పోయినచోటే వెదకాలనుకుంటున్న జనసేనాని...
x

పోయినచోటే వెదకాలనుకుంటున్న జనసేనాని...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి భీమవరం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి కచ్చితంగా జనసేన అధినేతను విజయం వరిస్తుందని నమ్మకంగా ఉన్నారు.


ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి ఆయన మరోసారి పోటీ చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఆయన భీమరం, గాజు వాక నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. రెండుచోట్ల ఓడిపోయారు. రెండు చోట్ల ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కుల సమీకరణలు, జనస మీకరణలు అన్నీ చూసుకున్నాకే ఆయన భీమవరం, గాజువాకలలో పోటీ చేశారు. అయినా ఓడిపోయారు.ఇది ఆయనకే కాదు, పరిశీలకులకు కూడా ఆశ్చర్యం కలిగించిన విషయం. అయితే, .ఈ సారి భీమవరం నుంచి మళ్లీ పోటీ చేసి సత్తా చూపాలనుకుంటున్నారు. తానెందుకు అపుడు ఓడిపోయానో ఆయన ఈ మధ్య బాగా అధ్యయనం చేశారట. ఏర్పాట్లు కట్టుదిట్టు చేసుకున్నారు. వీటికి తోడు ఈ సారి తెలుగుదేశంతో పొత్తుకూడా ఉంటున్నది. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతకాలంటారు పెద్దలు. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా అదే పని చేస్తారట.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికలను సవాల్ గా తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ క్యాడర్ లో ఉత్సాహం నింపాలన్న ప్రయత్నంలో పవన్ కల్యాణ్ ఉన్నారు.

జనసేన అధినేత జిల్లాల పర్యటనపై ప్రణాళికను ఇప్పటికే రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేక హెలికాప్టర్ కూడా సిద్దం చేశారు. 175 నియోజకవర్గాల్లో హెలికాప్టర్ ల్యాండింగ్‍కు అనువైన ప్రదేశాలను కూడా గుర్తిస్తున్నారు. ప్రతి జిల్లాలో మూడు సార్లు పర్యటించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రేపు భీమవరంలో తొలి పర్యటన ఉంటుంది. తరువాత జిల్లాల ముఖ్యనేతలతో సమీక్షలు ఉంటాయని తెలుస్తుంది . రేపటి నుంచి నాలుగు రోజుల పాటు గోదావరి జిల్లాల్లో ముఖ్యనేతలతో సమీక్షలు నిర్వహిస్తారు.

రేపు భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమీక్షలు చేయనున్నారు. 15న అమలాపురంలో తూర్పు గోదావరి జిల్లా నేతలతో పవన్ భేటీ అవుతారు. ఈనెల 16న కాకినాడలో మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 17న రాజమండ్రిలో పార్టీ నేతలతో పవన్ సమావేశం అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పవన్ మరోసారి భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. భీమవరంలో పవన్‌ పోటీ చేస్తే ఈసారి కచ్చితంగా గెలిపిస్తామని జనసేన నాయకులు బలంగా చెబుతున్నారు.

పవన్ అడుగులు కూడా ఆ దిశగానే సాగుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల తర్వాత పలుమార్లు భీమవరం వచ్చిన జనసేన అధినేత బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పార్టీ సమావేశాల్లో కొంతమంది నాయకులకు సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం రానున్నారు.

పవన్ ధైర్యం, జనసైనికుల ధీమా సరే, భీమవరం ప్రజలేమనుకుంటున్నారోచూడాలి.

Read More
Next Story