‘సప్త సముద్రాల అవతలున్నా రప్పిస్తాం’.. జగన్‌కు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
x

‘సప్త సముద్రాల అవతలున్నా రప్పిస్తాం’.. జగన్‌కు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

ప్రభుత్వ అధికారులకు వార్నింగ్‌లు ఇస్తే చూస్తూ ఊరుకోమని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని హెచ్చరించారు.


మాజీ సీఎం వైఎస్ జగన్‌(YS Jagan)కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఐఏఎస్(IAS), ఐపీఎస్‌(IPS)లతో పాటు ప్రభుత్వ అధికారులకు వార్నింగ్‌లు ఇస్తే చేతులు ముడుకుచుకుని కూర్చోమని, సుమోటోగా కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అధికారులను చులకనగా చూడొద్దని అన్నారు. గుంటూరు వేదికగా జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్, వైసీపీలను హెచ్చరించారు పవన్ కల్యాణ్. ఇకనైనా వాళ్లు తమ తీరుతెన్నులు మార్చుకోవాలని అన్నారు. గతంలో మాదిరిగా నడుచుకుంటే ఇప్పడు కుదరదన్నారు. ఇరువై ఏళ్లు అధికారం తమదే అంటూ కబుర్లు చెప్పి ప్రభుత్వ అధికారులను ఇష్టం వచ్చినట్లు వినియోగించుకున్నారని, తీవ్ర తప్పులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులపై గీత పడినా చూస్తూ ఊరుకోం

‘‘మాజీ ముఖ్యమంత్రి అయినా ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే. మీకు కూడా బాధ్యతలు ఉంటాయి. ‘సప్త సముద్రాలు అవతల ఉన్నా రప్పిస్తామని తిరుపతి ఎస్పీ సుబ్బారయుడిని ఉద్దేశించి, అదే విధంగా రిటైర్ అయినా వదలబోమని డీజీపీని ఉద్దేశించి’ వ్యాఖ్యానించారు. ప్రతి అధికారి కూడా తమ కర్తవ్యాలనే నిర్వర్తిస్తున్నారు తప్పా ఎవరికీ కొంగుకాయడం లేదు’’ అని జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘‘మీరు బెదిరిస్తే బెదిరిపోరు. అధికారులపై చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోం. వారిపై ఈగ వాలినా మీదే బాధ్యత. ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్లాల్సిన నాయకులు.. ఇష్టమొచ్చనిట్లు నోటికి ఏదొస్తే అది.. ఎంత వస్తే అంత మాట్లాడితే ఎలా?’’ అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని అన్నారు.

అటవీ శాఖకు పూర్తి మద్దతు

‘‘అడవుల రక్షణ కోసం అటవీ శాఖ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. అటవీ శాఖ అమరవీరుల త్యాగాలను ఎప్పటిక మర్చిపోము. అతి త్వరలోనే వివిధ వర్గాల నుంచి అటవీ శాఖకు రూ.5 కోట్ల విరాళాలు సేకరించి ఇస్తాను. అటవీ అమరులకు అతి త్వరలోనే స్తూపాలు నిర్మించి నివాళులు అర్పిద్దాం. స్మగ్లర్ల నుంచి అడవులను కాపాడటం కోసం అధికారులకు ఎలాంటి సహాయమైనా అందిస్తాం. విధుల్లో 23 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. అమరుల స్మరణకు ఫారెస్ట్ కార్యాలయం ప్రత్యేక బ్లాక్‌ను ఏర్పాటు చేయాలి. గంజాయిని పూర్తిగా నిర్మూలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వాటిని అతి త్వరలోనే కార్యాచరణలోకి తీసుకొస్తాం’’ అని వెల్లడించారు.

అఘాయిత్యాల నివారణకు అదొక్కటే మార్గం

‘‘ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు ఆగాలంటే మొదట మనందరికీ సామాజిక స్పృహ ఉండాలి. అన్యాయం జరిగితే ఆపాలన్న ఆలోచన సమాజానికి ఉండాలి. కళ్ల ముందు ఆడబిడ్డలను ఏడిపిస్తుంటే చోద్యం చూస్తూ ఉంటారు. ముందుగా ప్రజలు తమ కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించాలి. నా కళ్ల ముందు ఏ ఆడబిడ్డకు ఇబ్బంది కలిగినా చూస్తూ ఊరుకోను. పోలీసులు కూడా.. ఫిర్యాదు చేసిన వారిని క్రిమినల్స్‌గా పరిగణించవద్దు. ఇటీవల కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసు పెట్టడానికి వెళ్తే అధికారులు సరిగా స్పందించలేదు. ఆ కేసులో తమ బిడ్డ బ్రెయిన్ డెడ్ అయితే అతని తల్లి అవయవాలు దానం చేయడం నన్ను కదిలించింది. ఇలాంటి సమయంలో ప్రాణాలు తీసుకురాలేకపోయినా, మన ప్రవర్తన ఓదార్పునివ్వాలి. ప్రజలు కూడా నేరం మీద ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు మనల్ని ఇబ్బందిపెడతారు అన్న ఆలోచనల నుంచి బయటకు రావాలి. పది మంది వెళ్లి ఫిర్యాదు చేస్తే అలాంటి పరిస్థితులను నిలువరించవచ్చు’’ అని అన్నారు.

నేరగాళ్లకి కుల, మతాలు ఉండవు

‘‘ఎన్ని చట్టాలు తెచ్చినా వాటిని అమలు చేసే వ్యక్తుల్లో చిత్తశుద్ది లేకపోతే ఫలితం ఉండదు. నిర్భయ కేసు తర్వాత కూడా కోల్ కత్తా ప్రభుత్వ ఆసుపత్రి లాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. చట్టాల అమలుకు ప్రజల నుంచి కూడా సహకారం అవసరం. సింగపూర్ తరహా శిక్షలు అమలు చేయాలి. నిర్భయ చట్టం సమయంలో చాలా మంది పార్లమెంటేరియన్లు, న్యాయమూర్తులు కూడా బలంగా మాట్లాడారు. క్రిమినల్స్‌కి కులాలు, మతాలు ఉండవు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడి కులాల వెనుక దాక్కుంటామంటే కుదరదు. ఏ కులం అయినా, మతం అయినా తప్పు చేస్తే శిక్షించి తీరాలని ముఖ్యమంత్రికి, డీజీపీకి చెప్పాము. దీంతో పాటు ఆడ బిడ్డల సంరక్షణలో ముందుగా చుట్టుపక్కల వారి పర్యవేక్షణ ఉండాలి. పూంచ్ సెక్టార్ మాదిరి విలేజ్ డిఫెన్స్ సిస్టం ఉండాలి. ప్రాంతాల వారీగా యువత, పెద్దల కలయికతో డిఫెన్స్ కమిటీలు రావాలి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. దీంతోపాటు విద్యార్ధినులకు విద్యాలయాల్లో నిరంతర స్వీయ రక్షణ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి’’ అని అన్నారు.

గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ

‘‘గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనల పేరిట ఇష్టానుసారం రోడ్ల పక్కన ఉన్న చెట్లు నరికేశారు. ఈ చర్యలు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీశాయి. ఈ వ్యవహారంలో బాధ్యులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాము. చెట్ల నరికివేత మీద చర్యలు మొదలుపెడితే వైసీపీలో ఉన్న చాలా మంది నాయకులు ఊచలు లెక్కపెట్టాల్సి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెట్ల నరికివేతపై మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీస్ శాఖ స్పందించలేదు. అయితే గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా ఊహించనన్ని సమస్యలు కూటమి ప్రభుత్వానికి వచ్చాయి. లా అండ్ ఆర్డర్ సమస్యలతోపాటు సరస్వతి పవర్ భూముల్లో 76 ఎకరాలు అసైన్డ్ భూములు, చుక్కల భూములు ఆక్రమించేశారు. దీనితోపాటు వాగులు వంకల సంరక్షణ బాధ్యత కూడా ఉంది. అటవీ శాఖ అధికారులతో ఈ అంశంపై చర్చిస్తున్నాము. పవర్ ప్లాంట్ పరిధిలో గ్రీన్ జోన్ ఏర్పాటు చేయాలి. కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమలు కూడా లేవు. సరస్వతి పవర్ వ్యవహారంలో పాల్పడిన ఉల్లంఘనలన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’’ అని వెల్లడించారు. కాగా విశాఖ నడిబొడ్డున గంజాయి పెంచుతున్నారని, భవిష్యత్తులో గంజాయి సాగు, డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

అమర వీరుల త్యాగాలను వృధా కానివ్వం

‘‘అటవీ సంపద దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీర మరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వృథా కానివ్వకుండా, వారి ఆశయాలకు అనుగుణంగా మనం పని చేయాలి. అటవీ సంపద పరిరక్షణలో ఒక ఐ.ఎఫ్.ఎస్. అధికారితో పాటు 23 మంది సిబ్బంది తమ ప్రాణాలు అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో అశువులు బాసిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రకృతి ప్రసాదించిన వన సంపదను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేద్దాం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చెప్పినట్లు మనది వసుధైక కుటుంబం. భూమ్మీద మనతో పాటు సహజీవనం చేస్తున్న జంతువులు, చెట్లు చేమలు, పశు పక్షాదులను రక్షించే బాధ్యత మనందరిదీ. సిబ్బంది, నిధుల కొరత ఉన్నా వాటిని అధిగమించి అటవీ శాఖను బలోపేతం చేస్తాం. అటవీశాఖలో సిబ్బంది కొరత ఉన్నా అధికారులు నిబద్ధతతో పని చేస్తున్నారు. రాజకీయ నాయకులు వాళ్ల ముందర కాళ్లకు బంధాలు వేయకుండా వాళ్ల పని వాళ్లను చేసుకోనిస్తే సరిపోతుంది’’ అని వివరించారు.

Read More
Next Story