చంద్రబాబు స్వీట్ డ్రీమ్... నిజమవుతుందా?
x
Source: Twitter

చంద్రబాబు స్వీట్ డ్రీమ్... నిజమవుతుందా?

తణుకులో నిర్వహించిన సభలో చంద్రబాబు: ‘సైకిల్ స్పీడు, గ్లాసు జోరుకు ఫ్యాన్ కొట్టుకుపోవడం ఖాయం. వైసీపీకి డిపాజిట్లు కూడా డౌటే. పవన్ రియల్ హీరో


‘‘ప్రజలు ఆగ్రహిస్తే జగన్ కనుమరుగవడం ఖాయం. జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే మా లక్ష్యం’’అని తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని వారిద్దరూ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాగళం దెబ్బకు వైసీపీ కొట్టుకుపోతుందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతోనే టీడీపీ-జనసేన-బీజేపీ చేతులు కలిపాయని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తమ జెండాలు వేరైనా అజెండా మాత్రం ఆంధ్ర అభివృద్ధి, ఆంధ్రుల సంక్షేమమేనని చెప్పారు.
‘‘పదేళ్ల కిందట రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రజల కష్టాలను కడతేర్చటానికి ఈ మూడు పార్టీలు ఒక్కటయ్యాయి. మళ్లీ ఇప్పుడు జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిపోతోంది. దాని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మేము మరోసారి కలిశాం. ఒక్కటైంది మామూలు వ్యక్తులు కాదు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న నేను, ప్రజలకు సేవ చేయాలని, ప్రజల జీవితాలను చక్కబెట్టాలన్న తపన ఉన్న పవన్ కల్యాణ్, దేశాన్ని ప్రపంచంలో నెంబర్‌వన్‌గా నిలపాలని కృషి చేస్తున్న నరేంద్ర మోదీ. ఇలాంటి ముగ్గురు వ్యక్తులు కలిస్తే వారికి ఎదురు ఉంటుందా. మరి మాకు తిరుగుంటుందా’’అని వ్యాఖ్యానించారు.
పవన్ నిజమైన హీరో
‘‘పవన్ కల్యాణ్ కేవలం తెరపైనే కాదు రియల్ లైఫ్‌లోని రియల్ హీరో. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయల ఆదాయం, సుఖవంతమైన జీవితాన్ని సైతం కాలదన్ని ప్రజల కోసం నిలబడిన వ్యక్తి. పవన్ కేవలం పవర్ స్టార్ మాత్రమే కాదు రియల్ స్టార్ కూడా. వైసీపీ నేతలు వ్యక్తిగత, భౌతిక దాడులు, అవమానాలు చేసినా వాటిని తట్టుకుని ప్రజల పక్షాన నిలబడిన యోధులు పవన్ కల్యాణ్. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఏమీ ఆశించకుండా బేషరతుగా నా తరపు నిలబడి నా కోసం పోరాడిన వ్యక్తి పవన్. నేను గానీ, టీడీపీ గానీ ఈ విషయాన్ని ఎన్నటికీ మర్చిపోం. చీకటి పాలనను అంతమొందించే క్రమంలో ఓటు చీలనివ్వబోమని చెప్పిన తొలి వ్యక్తి పవన్. మన సంకల్పాన్ని సాధించడానికి కేంద్ర సహకారం అవసరం. ఆ సహకారం మనకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి లభిస్తుంది’’అని చంద్రబాబు వివరించారు.
వైసీపీకి డిపాజిట్లూ డౌటే!
‘‘2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని మొత్తం 15 స్థానాల్లో టీడీపీ జెండాను ఎగరేశారు. ఈసారి జనసేన, టీడీపీ కలిసి వస్తున్నాయి. మరి 2024 ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు అయినా దక్కుతాయా? ఇవాళ తణుకు సభలో యువత పవర్ చూశాను. యువత కన్నెర్ర చేసిందంటే జగన్.. లండన్ పారిపోతారు. ఆయనకు చిప్ప కూడు ఖాయం. ఎక్కడికి వెళ్లి చిప్ప కూడు తింటారో ఇప్పుడే చెప్పను. నేను, పవన్ చేసి చూపుతాం. 2014-2019 మధ్య ఉన్న పాలన కావాలంటే బాబు రావాలి. రాష్ట్ర ప్రయోజనాలకే మేము ప్రాధాన్యత ఇస్తాం’’
ఫేక్ ఫెలోస్ వచ్చారు
వైసీపీ హయాంలో రాష్ట్రంలోని ఫేక్ ఫెలోస్, బోగస్ మనుషులు వచ్చారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. వాళ్లను నమ్మితే తీవ్రంగా నష్టపోతామని, ప్రజలు వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘‘ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలి. దొంగలు చెప్పే తప్పుడు వార్తలను నమ్మకండి. జగన్ ఎన్నికల ముందు ఎన్నో చెప్పారు. గతంలో చెప్పారు కూడా. కానీ ఐదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు. అసలు ఈ ఐదేళ్ల కాలంలో ఆయన ఒక్కసారైనా ప్రజల చెంతకు వచ్చారా? ఇప్పుడు ఎన్నికలు అనడంతో ప్రజలతో మమేకం అవుతున్నానంటూ కబుర్లు చెబుతున్నారు. ఆఖరికి అధికారంలో ఉన్నంత కాలం తాడేపల్లిలోని ఫ్యాలెస్‌లో కూడా ఎవరినీ కలవలేదు. ఇప్పుడు జగన్ చూపుతున్నది మీపై ప్రేమ కాదు. మీ ఓట్లపై ఉన్న ప్రేమ. జగన్‌ను ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దు’’అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Read More
Next Story