పవన్ కల్యాణ్ కో లెక్కుంది, దానికో తిక్కుంది: పేలుతున్న సెటైర్లు
x
పరస్పరం నమస్కారం చేసుకుంటున్న చంద్రబాబు, పవన్

పవన్ కల్యాణ్ కో లెక్కుంది, దానికో 'తిక్కుంది': పేలుతున్న సెటైర్లు

పంచపాండవులు.. మంచపు కోళ్ల సామెత మాదిరిగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుందా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ మరికొన్ని సీట్లయినా త్యాగం చేస్తారా..


ఏపీలో విపక్షాల పొత్తు, సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాయి. 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో 8 గంటలకుపైగా మూడు పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల్ని కొలిక్కి తెచ్చారు. చర్చల్లో కుదిరిన అవగాహన మేరకు.. బీజేపీ అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్‌సభ సీట్లలో.. జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ సీట్లలో పోటీ చేయనున్నాయి. రాజమహేంద్రవరం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది.

ఇంతవరకు బాగానే ఉన్నా, ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిన చందాన జనసేన తన సీట్లను తగ్గించుకోవడంపై రాష్ట్రంలో చిటపటలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రయోజనాల పేరిట సొంతపార్టీని కుదించుకుంటారా అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జోకులు పేలుతున్నాయి.

రాష్ట్రం బాగు కోసం.. ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాం

‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో రాబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు మూడు పార్టీలూ కట్టుబడి ఉన్నాయి. తద్వారా అంతర్జాతీయంగా భారతదేశ నాయకత్వం పరిఢవిల్లాలనేది తమ ప్రగాఢ ఆకాంక్ష’ అని ఈ మూడు పార్టీల పేరిట సంయుక్త ప్రకటన విడుదలైంది. చంద్రబాబు ఈ ప్రకటనను సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టే చేశారు. ఆ తర్వాత కాసేపటికి పవన్ కల్యాణ్ పేరిట పత్రికా ప్రకటన బయటకువచ్చింది. ‘ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో మూడు పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. దానికి కొనసాగింపుగా సోమవారం అమరావతిలో సుదీర్ఘ సమావేశం జరిగింది. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్‌ పండా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఈ చర్చల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ కూటమి ఉంటుంది. సీట్ల పంపకం విషయంలోనూ రాష్ట్ర భవిష్యత్తుకే ప్రథమ ప్రాధాన్యం. ఈ చర్చలతో రాష్ట్ర పురోభివృద్ధికి బలమైన పునాది పడింది. రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకెళ్తాం. ఎన్‌డీఏ భాగస్వాములుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం‘ అంటూ జనసేన ప్రకటన సాగింది. చంద్రబాబు ఆ తర్వాత ట్వీట్ చేస్తూ ‘బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తును రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలి. సేవ చేసే అవకాశం కల్పించేలా చారిత్రక తీర్పు ఇవ్వాలి‘ అని కోరారు.

పవన్ పై సెటైర్లు...

జనసేన కార్యాలయం నుంచి ప్రకటన రావడంతోనే సెటైర్లు పేలాయి. జనసేన తీరు ‘పంచ పాండవులు, మంచపు కోళ్ల’ మాదిరిగా ఉందని ఒకరంటే మరొకరు ఆయన ‘అపర త్యాగశీలి’ అంటూ అధికార వైసీపీ వాళ్లు వ్యంగాస్త్రాలను సంధించారు. సోషల్ మీడియా యావత్తు రెండుగా చీలి ఒక వర్గం అనుకూల శత్రువులుగా మరో వర్గం ప్రతికూల మిత్రులుగా వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. ‘ఈ పికే ఇచ్చిన బిల్డప్ అసయ్యకరంగా ఉంది. వేల పుస్తకాలు చదివినట్లు నటించడం సమాజాన్ని అవమానపరచడమే. మనకు అన్నీ తెలియకపోయినా తెలిసిన వాళ్ళతో మాట్లాడతాం. కానీ ఈ పీకే తన వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసే దాకా నిద్రపోడు. అతనికి ఇప్పుడు జనసేన పార్టీ గాని కార్యకర్తలు గాని ఉన్నారని గుర్తులేదు. భుజకిరీటాలకు రెండు వైపుల 2 పార్టీలనీ పెట్టుకొని విర్రవీగడం నచ్చడం లేదు. నాలుగు తిట్లు తిడితే బాగుపడతాడేమోనని ఆశ’ అంటూ రాజకీయ పరిశీలకుడు జయధీర్ తిరుమలరావు పేరిట సోషల్ మీడియాలో ఓ కామెంట్ బాగా వైరల్ అయింది. ఎవరైనా సొంత పార్టీని పెంచుకోవాలని చూస్తారని, పవన్ కల్యాణ్ మాత్రం తన పార్టీని తగ్గించుకోజూస్తున్నారంటూ జనసేనలో పని చేసి ఇటీవల రాజీనామా చేసిన గుంటూరు జిల్లా నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

24 అని 21కి రావడమేమిటో...

పెద్ద పార్టీలతో పొత్తు చిన్నపార్టీలకు నష్టమేనని మరోసారి తేలిపోయింది. 24 అసెంబ్లీ సీట్లకు టీడీపీతో సర్దుబాటు చేసుకుని మరో రెండింటిని తనే తగ్గించుకోవడం వల్ల పార్టీ కార్యకర్తలకు జనసేన అధినేత ఏమి సందేశం ఇస్తునట్టని పార్టీలోని అసమ్మతి వర్గాలు ప్రత్యేకించి సీట్లు ఆశించి భంగపడుతున్న నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఓట్లే లేని బీజేపీకి 21 ఇచ్చేసి తానే ఆ పదికి రెడీగా ఉంటాడేమోనని కూడా సెటైర్లు వేస్తున్నారు. దీన్ని దూలగుంట చక్రవ్యూహం అంటారని నల్లా శ్రీనివాస్ అనే జనసేన కార్యకర్త వాపోయారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే టీడీపీ ఇంకో అయిదు త్యాగం చెయ్యొచ్చు కదా అనేది ఆయన ఆవేదన. ఏమైనా, పవన్ కల్యాణ్ తీరు జనసేన నేతలకు నచ్చినట్టు లేదు. అయితే వీటేటినీ పవన్ కల్యాణ్ పట్టించుకోరు. తన మాట వినేవాళ్లే తన పార్టీలో ఉండండి, నచ్చని వాళ్లు వెళ్లిపోండి అని పవన్ కల్యాణ్ చెప్పినందున ఈ విమర్శల్ని ఆయన పటించుకోరు. ఈ తరహా విమర్శలు, సెటైర్లకు ఆయన లొంగరు. ఆయన స్టైల్లో చెప్పాలంటే.. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ తగ్గించుకోవాలో కూడా పవన్ కల్యాణ్ కి తెలుసు. తనను తాను తగ్గించుకున్న వాడు గొప్పవాడన్నది పవన్ కల్యాణ్ నమ్మిన సిద్ధాంతమని ఆయన గతంలో అనేక సార్లు చెప్పిన విషయాన్ని విమర్శకులందరూ గుర్తుపెట్టుకోవాలి. 25 సీట్లు తీసుకుంటే పావలా అనే అర్థం వస్తుందనుకుని 24 తీసుకుంటే అది కాస్తా ఆధ్యాత్మిక సంఖ్యా శాస్త్రంలో కుదరకపోవడంతో బీజాక్షరాలలో 21 ప్లస్ 2 సీట్లు తీసుకున్నారట. అదేమిటో చూడాలి మరి.

Read More
Next Story