చంద్రబాబు ఫోన్ కీ అందుబాటులో లేని పవన్ కల్యాణ్!
x
Pawan kalyan, Chandrababu Naidu

చంద్రబాబు ఫోన్ కీ అందుబాటులో లేని పవన్ కల్యాణ్!

ఆంధ్రప్రదేశ్ లో అసలేం జరగుతోంది? పవన్ కల్యాణ్ ఆరోగ్యం ఎలా ఉందీ? చంద్రబాబు ఫోన్ కి కూడా పవన్ కల్యాణ్ ఎందుకు అందుబాటులో లేకుండా పోయారు? ఈ కథనం చదవండి


ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై ఇటీవల ఊహాగానాలు పెరిగాయి. ఆయన ఆరోగ్యం బాగోలేదని, అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై జనసేన వర్గాలు స్పష్టతనిచ్చాయి.
పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై ఆందోళన అక్కర్లేదని, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించాయి. ఆయన ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన ఇటీవల గైర్హాజరు అయ్యారు. తాజాగా రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఫోన్ కి కూడా అందుబాటులో లేకుండా పోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. నిరంతరం రాజకీయ, సినిమా కార్యకలాపాలలో ఎంతో బిజీగా ఉండే పవన్ కల్యాణ్ ఒక్కసారిగా పబ్లిక్ లైఫ్ కి దూరంగా ఉండడంతో కొన్ని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కొంత విశ్రాంతి అవసరమైనప్పటికీ, ఆయనకు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలూ లేవని జనసేన నేతలు చెబుతున్నా కూటమి ప్రభుత్వంలో వైరుధ్యాల వల్లే ఆయన కొంతకాలం దూరం అయ్యారన్న ప్రచారమూ వినపడుతోంది.
అసలేమైందీ, ఎందుకు తరచూ అస్వస్థత?
ఉపముఖ్యమంత్రి హోదాలో ఇటీవల ఆయన దక్షిణాంధ్రలో వరుస పర్యటనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అలసటకు గురయ్యారు. దీంతో విశ్రాంతి తీసుకున్నట్లు అందరూ భావించినా ఫిబ్రవరి తొలివారంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేనని ముందురోజే ప్రకటన జారీ చేశారు. దీనిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి.
టీడీపీతో ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు కుమారుడు, రాష్ట్ర మంత్రి లోకేశ్ తో ఉన్న విభేదాలే కారణమని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చినపుడు డెప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ కి కుర్చీ వేయకపోవడం, ఆ తర్వాత అమిత్ షా ఆదేశాల మేరకు కుర్చీ వేయడం, పవన్ చెప్పిన పనుల్ని ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే వీటిని పటాపంచల చేస్తూ జనసేన ప్రకటన చేసింది. పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్, స్పాండలైటిస్ తో బాధ పడుతున్నారని స్పష్టం చేసింది. దీంతో ఆయన అభిమానులు అసలేమిటీ స్పాండలైటిస్ అంటూ గూగుల్ లో శోధన పెట్టారు.
సరిగ్గా ఈనేపథ్యంలోనే ఫిబ్రవరి 11న విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్షకు పవన్‌ హాజరుకాకపోవడం చర్చాంశనీయంగా మారింది. అన్ని శాఖల మంత్రులు హాజరైనా పవన్ మాత్రం గైర్హాజరయ్యారు. సీఎం పక్కన పవన్‌కి కుర్చీ కూడా వేయని అధికారులు.. ఆయన స్థానంలో నారా లోకేష్‌కి కుర్చీ వేశారు. అదే సమయంలో చంద్రబాబు ఫోన్ చేసినా పవన్ అందుబాటులోకి రాని విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది.
ప్రతీ శాఖ మంత్రి, కార్యదర్శులు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు, లోకేశ్‌లతో విభేదాలు కారణంగానే పవన్‌ కల్యాణ్‌ గైర్హాజరైనట్లు వైసీపీ మీడియా హోరెత్తించింది. 15 రోజులుగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు పవన్‌ కల్యాణ్‌ దూరంగా ఉంటున్నారు. నారా లోకేష్‌తో డిప్యూటీ సీఎం పదవి విషయంలో చిచ్చు రగులుతోంది. నారా లోకేష్ సోషల్ మీడియా.. పవన్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి కూడా పవన్ దూరంగా ఉన్నారు.
అయితే, ఇది విశ్రాంతి మాత్రమేనని, ఆరోగ్యంపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జనసేన నాయకుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పవన్ కల్యాణ్ త్వరలోనే పార్టీ కార్యకలాపాల్లో మరింత చురుకుగా పాల్గొనబోతున్నారని, అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై విపరీతమైన ఊహాగానాలు వద్దని జనసేన వర్గాలు సూచించాయి. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారని, త్వరలోనే కోలుకుని తిరిగి రాజకీయ, సినీ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలియజేశారు. అభిమానులు పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై స్పందిస్తున్నారు. జనసేన వర్గాలు కూడా ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తున్నాయి. డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన ఫాంహౌస్ లో చికిత్స తీసుకుంటున్నారు.
చంద్రబాబు ఆరా, అందుబాటులో లేని పవన్..
రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిబ్రవరి 11న నిర్వహించిన సమావేశానికి ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హాజరుకాలేదు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్ష ప్రారంభమయ్యే సమయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ జోక్యం చేసుకుని... పవన్‌ రెండువారాలుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారని, అందుకే సమావేశానికి రాలేదని తెలిపారు. రెండు మూడు రోజుల్లో విధులకు హాజరవుతారని తెలిపారు. దానికి సీఎం స్పందిస్తూ... ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించానని, దొరకలేదని, ఇప్పుడెలా ఉన్నారని అడిగారు. ఇప్పుడు కాస్త పర్వాలేదని మనోహర్‌ పేర్కొన్నారు.
పాతగాయాలే సలుపుతున్నాయా...
పవన్ కల్యాణ్ గతంలోనూ వెన్నునొప్పితో బాధపడ్డారు. ఏడాది కిందట జనవాణి కార్యక్రమం నుంచి కూడా మధ్యలోనే వెళ్లిపోయారు.
2017, 2019లోనూ ఆయన వెన్నునొప్పితో బాధపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌.. మళ్లీ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. పవన్‌కు.. శస్త్రచికిత్స (సర్జరీ) చేయాలని డాక్టర్లు అంటున్నా.. కానీ.. ఆయన ప్రకృతి వైద్యానికే మొగ్గుచూపుతున్నారు. అనారోగ్యం కారణంగానే.. పవన్ కొద్దిరోజులుగా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనటం లేదు. దీనికి సంబంధించి చికిత్స తీసుకోవాలని కూడా ఆయన తెలిపారు.
గతంలో.. ‘గబ్బర్‌ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో.. ఆయనకు వెన్నుపూస వద్ద గాయాలు అయ్యాయి. అప్పటినుంచీ వెన్నునొప్పి సమస్య తలెత్తింది. ఆ తర్వాత.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అది కొంచెం పెరగగా.. అప్పుడు.. ఫారిన్‌కు వెళ్లి తగిన చికిత్స తీసుకున్నారు. అయితే.. దాన్ని అశ్రద్ధ చేయడంతో.. వెన్ను నొప్పి సమస్య మళ్లీ తిరగబెట్టింది. దీంతో.. అప్పటి నుంచి ఆయన.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
Read More
Next Story