అన్న నాగబాబుకే జై కొట్టిన తమ్ముడు పవన్ కల్యాణ్
నాగబాబును ఎలాగైనా ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దింపాలనే కల నెరవేర్చుకోనున్న పవన్ కల్యాణ్.. మరి బాలశౌరి పరిస్థితి ఏమిటి?
జి. విజయ కుమార్
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తన సోదరుడు నాగబాబును ఎలాగైనా పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దింపేందుకు రెడీ అయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా నాగబాబును పోటీలోకి దింపేందుకు రంగం సిద్ధం చేశారు. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశారు. దీనిపైన త్వరలో పవన్ కల్యాణ్ ప్రకటన చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, బిజెపీ పొత్తుల్లో జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. కాకినాడతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ స్థానాలను జనసేన కోరుతోంది. అందులో భాగంగా కాకినాడకు ఇది వరకే అభ్యర్థిని ఖరారు చేయగా, మచిలీపట్నం సీటు పెండింగ్‌లో ఉంది. టీటైమ్ యజమాని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా వారం రోజుల క్రితం పవన్ కల్యాణ్ ప్రకటించారు. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరీ ఇటీవల పార్టీ మారారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన ఫిబ్రవరి 2024లో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బాలశౌరీకే ఈ సారి మచిలీపట్నం పార్లమెంట్ స్థానం కేటాయిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ నాగబాబును మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేయనున్న అంశం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే సిట్టింగ్ ఎంపీ బాలశౌరీ పరస్థితి ఏమిటనేది ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బాలశౌరీని ఎక్కడ అకామిడేట్ చేస్తారనేది ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎంపీ కంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు బాలశౌరీ మొగ్గు చూపుతున్నారని, కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ నియోజక వర్గం అభ్యర్థిగా ఖరారు చేసే చాన్స్ ఉందని జనసేన శ్రేణులు చర్చించుకుంటున్నారు.
అనకాపల్లిలో గ్రౌండ్‌వర్కు చేసుకున్న నాగబాబు
అనకాపల్లి పార్లమెంట్ నుంచి నాగబాబు రంగంలోకి దిగుతున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. ఆ మేరకు అవసరమైన రంగం సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలను కలియతిరిగేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అందులో భాగంగా జనసేన పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు కాడా నిర్వహించారు. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. వాటిని ఎలా అడ్రస్ చేయాలో ప్లాన్ చేసుకున్నారు. అప్పటికి ఇంకా బిజెపితో పొత్తులు ఖరారు కాలేదు. ప్రాథమిక దశలోనే ఉన్నాయి. దీంతో జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఆ సమస్యలను ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపైన జనసేన శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. బిజెపీ పొత్తులు ఖరారు అయిన తర్వాత సీన్ మారింది. ఆ సీటును బిజెపీకి కేటాయించారు. మాజీ ఎంపి సీఎం రమేష్‌ను బిజెపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో అనకాపల్లిని జనసేన వదులు కోవలసి వచ్చింది.
అనకాపల్లిని ఎందుకు ఎంచుకున్నారు?
నాగబాబు అనకాపల్లినే ఎందుకు ఎంచుకున్నారు, అక్కడ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకున్నారనేది అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇక్కడ నుంచి చిరంజీవి బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పోటీ చేశారు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా 2009లో పీఆర్‌పి అభ్యర్థిగా బరీలోకి దిగిన అల్లు అరవింద్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి సబ్బం హరి చేతిలో ఓటమి చెందారు. అయినా అల్లు అరవింద్ గణనీయంగానే ఓట్లు రాబట్టగలిగారు. దాదాపు 2.94లక్షల ఓట్లను పొందగలిగారు. దీంతో ఇక్కడ పీఆర్‌పీకి మంచి పట్టు ఉందని, ఇది జనసేనకు కూడా బేస్‌గా ఉపయోగపడుతుందని పవన్ కల్యాణ్ నిర్ణయానికి వచ్చారు. దీంతో నాగబాబును అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దింపాలని నిర్ణయానికి వచ్చారు.
అనకాపల్లి కోసం పోటీ పడిన టీడీపీ
పొత్తుల్లో భాగంగా ఈ స్థానానికి టీడీపీ కూడా పోటీ పడింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ స్థానం కావాలని పట్టుబట్టారు. ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న తన కుమారుడు చింతకాయల విజయ్‌ని అనకాపల్లి నుంచి ఎంపిగా పోటీకి దింపాలని భావించారు. ఈ స్థానంలో విజయ్ పోటే చేసే అవకాశం కల్పించాలని అయ్యన్నపాత్రుడు చంద్రబాబును బహిరంగానే కోరారు.
Next Story