చంద్రబాబు భార్యను తిట్టానని పవన్ ఎట్లా చెబుతాడు?
భువనేశ్వరిపై వల్లభనేని వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చలకు దారిశాయి. ఆ అంశాన్ని పవన్ లేవనెత్తడం, దానికి వంశీ కౌంటర్ ఇవ్వడమే ఇందుకు కారణం.
మే 13న జరిగే ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు పొరపాటున కూడా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీకి ఓటెయ్యొద్దని జనసేనాని పవన్ కల్యాణ్.. జనసైనికులకు పిలుపునిచ్చారు. వంశీ.. ఆడవాళ్లను అవమానించే వ్యక్తని, అటువంటి నేతను గెలిపిస్తే మహిళలను అవమానించిన వాళ్లమే అవుతామని వ్యాఖ్యానించారు. గన్నవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో మొదట ఆయన చాలా మంచి నాయకుడు అనుకున్నానని, కానీ తర్వాత కాలక్రమేణా ఆయన మారిపోయారంటూ విమర్శించారు. తనకు సోదరి సమానురాలైన నారా భువనేశ్వరిని వంశీ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.
చాలా బాధేసింది
‘‘టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్ అంటే నాకు ఎంతో అభిమానం. ఆయన కుమార్తె, నాకు సోదరి సమానురాలైన నారా భువనేశ్వరిని వల్లభనేని వంశీ అసెంబ్లీలో అవమానించారు. ఆమెను ఉద్దేశించి వంశీ చేసిన వ్యాఖ్యలను నన్ను ఎంతో బాధించాయి. భువనేశ్వరి వ్యక్తిత్వంపై అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి జనసేన మద్దతుదారులు ఎవరూ ఓటు వేయకండి. భువనేశ్వరిని ఒక మాట అంటే నా సోదరిని అన్నట్లే. రాజకీయాల్లో విబేధాలు ఉండటం సహజం. జగన్‌తోనూ మాకు విభేదాలు ఉన్నాయి. అలాగని ఆయన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సబబు అనిపించుకోదు. మేము ఎప్పుడూ అలా మాట్లాడలేదు కూడా. మహిళలకు జనసేన పార్టీ ఎంతో గౌరవం ఇస్తుంది’’ అని వ్యాఖ్యానించారు జనసేనాని.
అలా అనుకోవద్దు
వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు ఎప్పుడో కదా.. అది కూడా మనకు కాదు.. ఎవరికో జరిగిన అవమానం కదా అని ఎవరూ అనుకోవద్దని, ఈరోజున ఎవరినో అవమానించిన నేతను అధికారంలోకి తీసుకొస్తే రేపు మనల్ని అంతకుమించి అవమానిస్తారని ప్రజలు అర్థం చేసుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు. ప్రతి ఆడబిడ్డను మన ఇంటి ఆడబిడ్డ అనుకుని ముందుకు సాగితేనే మహిళలకు సరైన గౌరవం దక్కుతుందని చెప్పారు.
పవన్ ఆరోపణలు అవాస్తవం: వంశీ
తనకు ఓటేయొద్దని జనసేన మద్దతుదారులను కోరుతూ తనపై చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదంటూ వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. తనపై పవన్ చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలేనని, తాను అసెంబ్లీలో భువనేశ్వరిని ఏమీ అనలేదని వంశీ స్పష్టం చేశారు. ఎవరో చెప్పిన మాటలు విని ప్రచారం చేసే పద్దతిని పవన్ కల్యాణ్ మానుకోవాలని హితవు పలికారు. ‘‘నేను భువనేశ్వరి గురించి అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశానని పవన్ చెప్తున్నారు. అసలు ఆరోజున నేను అసెంబ్లీలోనే లేను. ఐఎస్‌బీ మొహాలీలో కోర్సు కోసమని పంజాబ్ వెళ్లి ఉన్నాను. అసలు అసెంబ్లీలోనే లేని నాపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. నేను ఎవరినీ ఏమీ అనకపోయినా క్షమాపణలు చెప్పాను. అది నా సంస్కారం’’అని ఘాటుగా బదులిచ్చారు వంశీ.
‘నా వల్ల తప్పు జరిగింది’
ఇదిలా ఉంటే 2021 డిసెంబర్ నెలలో నారా భువనేశ్వరి ఉద్దేశించి వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేకెత్తించాయి. కొన్ని రోజులకే తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానంటూ వంశీ క్షమాపణలు కూడా చెప్పారు. ఆవేశంలో పొరపాటు జరిగిందని అంగీకరించారు. ‘‘ఎమోషన్‌లో ఒక పదం తప్పు దొర్లింది. అది అంగీకరిస్తూ క్షమాపణలు కోరుతున్నా. నా వ్యాఖ్యలకు పశ్చాత్తాపం ఉంది కాబట్టే క్షమాపణలు చెప్తున్నా తప్ప ఎవరో బెదిరించారు అన్నదేమీ లేదు. బెదిరింపులకు నేను లొంగను. కానీ తప్పు చేస్తే ఎదురు ఎవరున్నా నేనే తల వంచుతాను. టీడీపీలో అందరికంటే నాకు భువనేశ్వరి ఆత్మీయురాలు. ఆమెను నేను అక్కా అని పిలుస్తాను. నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నా’’అని అప్పట్లోనే ఆయన తన వ్యాఖ్యలను క్షమాపణలు చెప్పారు.
గెలుపుపై సందేహమే కారణమా..
ఎన్నికలకు గట్టిగా మూడు రోజులు కూడా సమయం లేని క్రమంలో అప్పుడెప్పుడో 2021లో జరిగిన ఘటనను పవన్ కల్యాణ్ ప్రస్తావించడంపై వైసీపీ వర్గాలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. వల్లభనేని వంశీని ఓడించే దమ్ము లేకనే పాత విషయాలను పవన్ కల్యాణ్ తవ్వుతున్నారని విమర్శించారు. అప్పట్లో వివాదం జరగడం.. తన వ్యాఖ్యలకు వంశీ క్షమాపణలు చెప్పడం కూడా జరిగిందని, కానీ ఇప్పుడు దాన్ని ప్రస్తావించి భువనేశ్వరిని అవమానపరుస్తున్నది పవన్ కల్యాణ్ కాదా అని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మానిపోయిన గాయాన్ని గిల్లుతున్నది పవన్ కల్యాణ్ అని, నిజంగా వారు చెప్పుకుంటున్నట్లు మహిళలంటూ వారికి అంత గౌరవమే ఉంటే.. ఇప్పుడు అసలు ఈ అంశాన్ని లేవనెత్తేవారా అని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో మరోసారి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకి వస్తున్నాయి.