10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టినా ఎన్నికల్లో గెలిచింది లేదు. తొలి సారి జనసేనకు అసెంబ్లీలో ప్రాతినిద్యం వచ్చింది. ఒకే సారి 21 ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అసెంబ్లీ వాతావరణం ఎంజాయ్‌ చేస్తున్నారు.


జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ సభలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సమావేశాల్లో తన పార్టీ ఎమ్మెల్యేలు భాగస్వాములు అవుతున్న విధానంపై పవన్‌ కల్యాణ్‌ తనలో తాను నవ్వుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రశ్నోత్తరాలు, లఘు చర్చలు, జీరో అవర్‌ వంటి వాటిల్లో తన పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించుకుంటున్నారు. ఆయా అంశాలపై లేవనెత్తుతున్న పాయింట్లు, భయం, బెరుకు లేకుండా ప్రసంగిస్తున్న తీరు, సమస్యలపై వారికి ఉన్న అవగాహన వంటి అంశాలపైన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, పర్వాలేదు తమ పార్టీ ఎమ్మెల్యేలు సభలో బాగానే మాట్లాడుతున్నారని తనలో తాను ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ మురిసి పోతున్నారు. ఒకే సారి తనతో పాటు 21 మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టడంతో పవన్‌ కల్యాణ్‌ ఉబ్బితబ్బుబ్బైపోతున్నారు.

అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్‌ కల్యాణ్‌ సభలో మాట్లాడుతున్న విధానంపై జనసేన పార్టీ ఎమ్మెల్యేలు సంతోషంగా ఫీలవుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్న తీరు, ఆయన చెబుతున్న అంశాలను శ్రద్దగా వింటున్నారు. సభలో మాట్లాడిన అనుభవం గతంలో లేక పోయినా, ఎంతో అనుభవం కలిగిన నాయకుడిగా పవన్‌ కల్యాణ్‌ ప్రసంగిస్తున్న విధానంపై ఆకర్షితులవుతున్నారు. అదే సందర్భంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సమయంలో పవన్‌ కల్యాణ్‌ చాలా ఇంట్రెస్ట్‌గా ఆలకిస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ ప్రసంగాలను ప్రారంభించే ముందు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడంతో పాటు తమకు అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం ఇచ్చిన తమ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు ధన్యవాదాలు తన పార్టీ ఎమ్మెల్యేలు చెబుతుంటే.. వాటిని వింటూ నవ్వుకొని ఎంజాయ్‌ చేస్తున్నారు.
జనసేన నుంచి పోటీ చేసి గెలిచిన వారిలో కొంత మంది తప్పితే తక్కిన వారందరూ కొత్త వారే. కొణతాల రామకృష్ణ, నాదెండ్ల మనోహర్‌లు అనుభవం ఉన్న వారు. గతంలోనే వీరు అసెంబ్లీకి ఎన్నికైన వారు. కొణతల రామకృష్ణ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగాను, నాదెండ్ల మనోహర్‌ డిప్యూటీ స్పీకర్‌గాను పని చేసిన అనుభవం కలిగిన వారు. పులిపర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్‌ బాబులు ఇది వరకు ఎమ్మెల్యేలుగా పని చేయగా, మండలి బుద్ద ప్రసాద్‌ గతంలో మంత్రిగాను, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. వీరు కాకుండా పవన్‌ కల్యాణ్‌తో సహా తక్కిన వారందరూ కొత్తగా అసెంబ్లీలో అడుగు పెట్టిన వారే.
10ఏళ్ళ క్రితం పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టినా ఎన్నికల్లో విజయం సాధించింది లేదు. 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతు తెలిపిన పవన్‌ కల్యాణ్, 2019లో కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఎన్నికల రంగంలోకి దిగారు. రెండు స్థానాల నుంచి రంగంలోకి దిగిన పవన్‌ కల్యాణ్‌ కూడా ఒటమిని చవి చూశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తుతో ఎన్డీఏ కూటమిగా ఏర్పడి 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసి గెలుపొంది రికార్డు సృష్టించారు.
Next Story