చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. సీఎం సోదరుడు రామ్మూర్తినాయుడు మరణించిన నేపథ్యంలో చంద్రబాబును పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ సారధులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు సోమవారం భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసాని ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరు సమావేశమయ్యారు. ప్రధానంగా కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై వీరు చర్చించినట్లు తెలిసింది. ఇటీవల కాకినాడ పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకెళ్లి హడావుడి చేశారు. భారీ ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతోందని, వీటి వెనుక ఎవరున్న నిగ్గు తేలుస్తామని అంటూనే, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన తాను చూసిన అంశాలను, పరిశీలించిన విషయాలపైనే సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఎలాగైన ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలనే దిశగానే చర్చలు సాగాయి. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణపై సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.