తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పవన్ ఎందుకు కొనియాడినట్లు..!
x

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పవన్ ఎందుకు కొనియాడినట్లు..!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోంది. తాజాగా ఈ వేడుకలపై పవన్ కల్యాణ్ స్పందించారు.


తెలంగాణ రాష్ట్రమంతటా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారీ ఏర్పాట్లతో ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోంది. తాజాగా ఈ వేడుకలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ పోరాట స్ఫూర్తిని ఆయన ఎంతో కొనియాడారు. భారతదేశ చరిత్రలో తెలంగాణకు ఎంతో ప్రత్యేకత ఉందని అన్నారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. ట్వీట్‌లో పవన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 1947లో తెలంగాణ మినహా దేశం మొత్తాన్నికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. కానీ 2014లో మాత్రం యావత్ భారతదేశం స్వాతంత్ర్యం పొందిందని చెప్పారు. స్వాతంత్ర్యం పొందడానికి ఎంతో మంది ప్రాణాలకు తెగించి పోరాడంటూ ఆనాటి తెలంగాణ ఉద్యమ పోరాటాలను గుర్తు చేసుకున్నారు.

60 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది

‘‘స్వాతంత్ర్యం కోసం తెలంగాణ రెండేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. కానీ రాష్ట్ర ఆవిర్భావం కోసం మాత్రం 60 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది సకల జనుల కల. అది సాకారమై అప్పుడే దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడి నీరు, గాలి, మాట, నేలలోనే కాదు పాటలో కూడా పోరాట పటిమ తొణికిసలాడుతోంది’’ అని ప్రశ్నంసలు గుప్పించారు. తెలంగాణ అంటే ఎవరికైనా ఉద్యమమే గుర్తొస్తుందని, తమ స్వాతంత్ర్యం కోసం వారు ఎంతో అధికారాన్ని ధిక్కరించి చేసిన పోరాటం కోసం ఎంత చెప్పుకున్నా తక్కువేనని చెప్పుకొచ్చారు.

పాలకులు గుర్తెరగాలి

‘‘నీళ్లు నిధులు-నియామకాలు అనే నినాదంతో తెలంగాణ జనులు సాగించిన ఉద్యమాన్ని పాలకులు గుర్తెరగాలి. ప్రజలందరికీ తెలంగాణ ఫలాలు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా అందాలి. అభివృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచేలా పాలకులు నడుచుకోవాలి. తద్వారా ప్రజా తెలంగాణను సంపూర్ణంగా ఆవిష్కరించాలి. అప్పుడే రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలు బలిదానం చేసిన అమరులను నిజమైన నివాళి అవుతుంది’’ అని రాసుకొచ్చారు పవన్ కల్యాణ్. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తన పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారాయన.

ఎందుకీ పొగడ్తలు

ఇన్నాళ్లూ తెలంగాణ ఆవిర్భావంపై ఏదో నామమాత్రంగానే ట్వీట్‌లు చేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఇంత పెద్ద మెసేజ్ ఎందుకు పెట్టారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న క్రమంలో ఆయన చేసిన ట్వీట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రాజకీయ లబ్ది పొందడానికే ఆయన ఈ ట్వీట్ చేశారని అంటున్న వారికి కొదవలేదు. దానికి తోడు ఆంధ్రలో వచ్చే ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు తెలంగాణపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పవన్ చేసిన ట్వీట్ మధ్య లింకేదైనా ఉందన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.

అసలు ఉద్దేశం అదేనా..

తాజాగా చంద్రబాబు.. తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా తెలంగాణపై దృష్టిపెట్టడం కీలకంగా మారింది. తెలంగాణలో కూడా టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలని ప్లాన్ చేస్తున్నాయా? అందుకే చంద్రబాబు తర్వాత పవన్ కూడా తెలంగాణపై ఫోకస్ చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఒకవేళ ఆంధ్రలో ఓడిపోతే తెలంగాణ రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారాలన్న ఉద్దేశంతోనే పవన్ ఈ ట్వీట్ చేశారా అన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మరి ఈ వాదనలపై పవన్ లేదా జనసేన వర్గాలు త్వరలో క్లారిటీ ఇస్తాయేమో చూడాలి.

Read More
Next Story