నామినేటెడ్ పోస్టుల రేసులో నాగబాబు.. క్లారిటీ ఇచ్చిన పవన్
x

నామినేటెడ్ పోస్టుల రేసులో నాగబాబు.. క్లారిటీ ఇచ్చిన పవన్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమిలో నామినేటెడ్ పోస్టుల పోరు మొదలైంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమిలో నామినేటెడ్ పోస్టుల పోరు మొదలైంది. వీటిని కూడా కూటమి పార్టీలు ఒక ప్రణాళికాబద్దంగానే పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పోరులో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ఇప్పటికే తనకు ఏ పదవి కావాలో అన్న అభ్యర్థనను కూటమి ముందు ఉంచారని, అందుకు కూటమి కూడా ఓకే చెప్పిందని కూటా టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే నాగబాబు.. టీటీడీ ఛైర్మన్ పదవిని కోరారని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం బాగానే జరుగుతోంది. కానీ దీనిపై కూటమి నేతలు ఎవరూ స్పందించలేదు. తాజాగా దీనిపై డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ప్రజాప్రతినిధులను ఆయన సత్కరించారు. అనంతరం నామినేటెడ్ పోస్ట్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని తాము మర్చిపోమని మరోసారి పునరుద్ఘాటించారు పవన్ కల్యాణ్.

అందరికీ అంటే కష్టం

ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని చెప్పారు పవన్. హరిప్రసాద్‌కు లభించినట్లే ప్రతి ఒక్కరికీ గుర్తింపు దక్కుందని ఉదహరించారు. ‘‘కానీ ప్రతి ఒక్కరూ ఛైర్మన్ పదవులు ఆశిస్తే కష్టం. కొందరు టీటీడీ ఛైర్మన్ సహా ఇంకొన్ని ఛర్మన్ పదవులను కోరుతున్నారు. వీటిలో టీటీడీ ఛైర్మన్ పదవి కోసం 50 మంది క్యూ కట్టారు. కానీ ఆ పదవిని అందరికీ ఇవ్వలేం కదా. కాబట్టి ఒకే పదవి అందరికీ అంటే కష్టం’’ అని వివరించారు. ఇదే సందర్భంగానే టీటీడీ ఛైర్మన్ పదవిని నాగబాబు కోరారన్న ప్రచారంలో వాస్తవం ఏమీ లేదని కూడా స్పష్టం చేశారు. ‘‘నా కుటుంబ సభ్యులెవరూ కూడా టీటీడీ ఛైర్మన్ పదవి కోరలేదు. ఈ మేరకు కొందరు ప్రచారం చేస్తున్నారు. అది సరైన పద్దతి కాదు. ఏదైనా ఉంటే ఆధారాలతో నిరూపించాలి. నాగబాబు ఏ పదవిని ఆశించలేదు’’ అని చెప్పుకొచ్చారు.

ఎలా అడగాలో అర్థం కావట్లా

‘‘మీకిది చేశాం కాబట్టి మాకు ఈ పదవులు ఇబ్బంది అని చంద్రబాబును ఎలా అడగాలో అర్థం కావట్లేదు. కానీ ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎవరికైనా పదవి దక్కలేదంటూ ఆగ్రహించకుండా ఒక్కసారి నా మనసుతో ఆలోచించాలని కోరుతున్నా. ఎవరికైనా ఏదైనా పదవి కావాలి అని ఉంటే.. ఆ విషయం చెప్పండి. కమిటీతో చర్చించి వాటిని మీకు ఇచ్చేలా ప్రయత్నం చేస్తా. అలాగని అందరూ ఛైర్మన్‌లే పదవే కావాలంటే కష్టం. కాబట్టి పదవులు అడిగే సమయంలో ఒకసారి ఆలోచించండి’’ అని సూచించారు.

కావాలంటే కేంద్ర పదవి అడిగేవాడిని

‘‘ప్రధాని మోదీని నేనూ కేబినెట్ పదవి అడగగలను. కానీ అడగలేదు. పదవుల కోసం పనిచేసే పద్దతి కాదు మనది. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. పదవులు అనుభవించడానికి కాదు. ఆ ఆలోచన కూడా నాకు ఎన్నడూ లేదు. కేంద్రంలోకి రావాలని.. మంత్రి పదవి ఇస్తానని ప్రధాని మోదీ పిలిచారు. కానీ రాష్ట్రంలోనే ఉంటానని చెప్పాను. అడగాల్సిన సమయంలో రాష్ట్రం కోసం ప్రధానిని అడగాల్సిందే అడుగుతా. విశాఖ స్టీల్ అభివృద్ధి, రైల్వే జోన్, 20 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలను కచ్ఛితంగా అడుగుతా’’ అని వ్యాఖ్యానించారు.

పదవి అడిగేటప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకోండి

‘‘అదే విధంగా పదవులను కోరే సమయంలో నేతలు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. నేతలు తమ అనుభవాలను, అర్హతలను దృష్టిలో పెట్టుకుని వాటికి దగ్గరగా ఉండే పదవులు కోరండి. ఏ పదవిలో ఉంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయగలము అన్న విషయాన్ని ఆలోచించుకుని పదవులను కోరండి. వాటిపై చర్చించి వాటిని ఇచ్చేలా చేయడానికి నా వంతు కృషి చేస్తాను. పదవులు దక్కుకుంటే మనస్థాపం వద్దు. ప్రజల కోసం పనిచేద్దాం’’ అని పిలుపునిచ్చారు.

అదే విధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటిస్తూ ప్రజకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. అదే విధంగా నంద్యాల ఘటనల్లాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని అందరూ ఆలోచించాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే అక్రమంగా జరుగుతున్న రేషన్ బియ్యం దందాను అడ్డుకోవడానికి నాదెండ్ల మనోహర్ కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. వీటన్నింటినిపై క్యాబినెట్‌లో తప్పకుండా చర్చించి సరైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

Read More
Next Story