ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ గిరిజన గ్రామాల్లో పర్యటించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.
జోరు వానలోనూ పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన సాగింది. గిరిజన గ్రామాల్లో కాలి నడకన పర్యటిస్తూ అక్కడ స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. గిరిజన గ్రామాల్లో అంతర్గత రహదారులను పరిశీలించిన ఆయన వాటిని మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మక్కువ మండలం, కవిరిపల్లి గ్రామం ప్రారంభం నుంచి చివర వరకు నడిచారు. చీపురు వలస సమీపంలోని వెంగళరాయసాగర్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ప్రకృతి అందాలను తిలకించారు. కొండలు జలపాతాలను స్వయంగా మొబైల్‌లో బంధించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సూచించారు.
శంబర గ్రామంలో శ్రీ పోలమాంబ ఆలయం వద్ద పనికి ఆహార పథకం నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును పరిశీలించారు. రోడ్డు క్వాలిటీ, నిర్మాణ వ్యయం తదితర అంశాలను తెలుసుకున్నారు. కొత్త రోడ్డును తన మొబైల్‌లో వీడియో తీసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన గ్రామాల్లో పలు రోడ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రూ. 36.71 కోట్ల వ్యయంతో నూతన రోడ్ల నిర్మాణంతో పాటు బాగుజోల–సిరివర మధ్య రూ. 9.50 కోట్లతో బీటీ రోడ్డుకు గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. మక్కువ మండలం, పనసభద్ర గ్రామ పంచాయతీ పరిధిలోని బాగుజోల – సిరివర మధ్య మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద రూ. 9.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అంతకు ముందు బాగుజోల వద్ద గిరిజన గ్రామాల్లో స్థితిగతులు, ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనుల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు, రహదారుల నిర్మాణం తదితర అంశాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పవన్ కల్యాణ్ తిలకించారు.