పవన్ ప్రచార షెడ్యూల్ ఖరారు
x
Source: Twitter

పవన్ ప్రచార షెడ్యూల్ ఖరారు

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. పిఠాపురంలో మూడు రోజుల పాటు పవన్ ప్రచారం చేయనున్నారు.


ఆంధ్రలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీలు దాదాపు తమ అభ్యర్థులను ప్రకటించేసి ప్రచార వ్యూహాలపై దృష్టి సారించింది. ఎన్నికల రెడ్ మ్యాప్, షెడ్యూల్ కూడా ఫైనల్ చేసేసుకున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, సీఎం జగన్ తమ ప్రచార షెడ్యూల్‌ను ప్రకటించారు కూడా. అంతేకాకుండా వాళ్లు తమ ప్రచారాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లను కూడా దాదాపు పూర్తి చేశారు.

ఈ నెల 27 నుంచి కుప్పం నుంచి చంద్రబాబు, ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ తమ ప్రచారాన్ని భారీగా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కల్యాణ్ కూడా తన ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్నారు. పిఠాపురం నుంచి ప్రారంభించి రాష్ట్రమంతా చేయాల్సిన ప్రచారానికి సంబంధించిన పార్టీ శ్రేణులతో చర్చించి ఒక నిర్ణయానికి పవన్ వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి.
పవన్ ప్రచారం షెడ్యూల్ ఇదే
ఈ నెల 30న పిఠాపురం నుంచి పవన్ తన ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రచారం కోసం ఇప్పటికే తన వారాహి వాహనాన్ని కూడా పూజలు చేయించి ప్రచారానికి సన్నద్ధం చేశారు. పవన్ ప్రచారం పిఠాపురంలో మూడు రోజుల పాటు సాగనుంది. ప్రచారంలో భాగంగా ఈనెల 30న పవన్ కల్యాణ్.. నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశమవుతారు. అనంతరం శ్రీపాద వల్లభుడి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
మరుసటి రోజు 31న ఉప్పాడ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న పార్టీ చేరికలు పర్యవేక్షించి, నియోజకవర్గంలోని మేధావులతో సమావేశం కానున్నారు. ఈ మూడు ప్రచార రోజుల్లో పవన్ కల్యాణ్.. పిఠాపురంలోనే బస చేయనున్నారు. ఆ తర్వాత పవన్..రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. వీటిలో తమ పార్టీ అభ్యర్థులకు మద్దుతుగానే కాకుండా కూటమి సభ్య పార్టీలైన టీడీపీ, బీజేపీ సమావేశాల్లో కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే మే 13న ఆంద్రప్రదేశ్‌లో లోక్‌‌సభ సహా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 25 ఎంపీ, 175 ఎమ్మెల్యే స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా జరిగే అన్ని ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
Read More
Next Story