ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తిరుమల టూర్‌. మూడు రోజుల పర్యటన. అనంతరం తిరుపతిలో భారీ సభ.


ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా తిరుపతి తిరుమలకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించుకున్నారు. ఈ టూర్‌లో భాగంగా తిరుమలలో మూడు రోజులు పాటు ఉండాలని భావిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం విమానంలో గన్నవరం నుంచి రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా అలిపిరి పాదాల మండపం వద్ద చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి కాలి నడక మార్గం ద్వారా తిరుమల కొండకు చేరుకుంటారు.

శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అక్టోబర్‌ 2న బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని దీక్ష విరమణ చేస్తారు. అనంతరం కొండపైన విస్తృతంగా పర్యటించనున్నారు. పలు ప్రదేశాలను ఆయన సందర్శించనున్నారు. వెంకటేశ్వరుని దర్శనం అనంతరం తిరుమల లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని పవన్‌ కళ్యాణ్‌ తనిఖీ చేయనున్నారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి అక్కడ వెంకటేశ్వరుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. దీంతో పాటుగా భక్తులు దర్శనానికి వెళ్లే క్యూలైన్లను కూడా ఆయన పరిశీలిస్తారు.
ఆ తర్వాత టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించి అన్ని అంశాల గురించి చర్చించనున్నారు. సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలతో బిజీగా ఉండే పవన్‌ కళ్యాణ్‌ బుధవారం రాత్రి కూడా కొండపైనే బస చేయనున్నారు. పవన్‌ కళ్యాణ్‌ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారానికి పూర్తవుతుంది. దీంతో తిరుమలలో దీక్ష విరమణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత గురువారం సాయంత్రం కొండ కింద అంటే తిరుపతికి చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు. సెప్టెంబర్‌ 22 నుంచి 11 రోజులపాటు ఆయన ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్షను ప్రారంభించారు.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్షను పల్లెపల్లెకు తీసుకెళ్లాలని జనసేన శ్రేణులకు పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా సెప్టెంబరు 30న రాష్ట్ర వ్యాప్తంగా దీపారాధన కార్యక్రమాలు నిర్వహించాలని, అక్టోబరు 1న ఓం నమో నారాయణ మంత్ర పఠనం, అక్టోబరు 2న నగర సంకీర్తన కార్యక్రమం, అక్టోబరు 3న ఆలయాల్లో భజన కార్యక్రమాలను నిర్వహించాలని ఈ కార్యక్రమాల్లో ప్రతి జనసైనికుడు ప్రాల్గొనాలని తన శ్రేణులకు పిలుపునిచ్చారు.
Next Story