మూల నక్షత్రం రోజున ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తన కుమార్తెతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్నారు. పలువురు మంత్రులు కూడా అమ్మ వారిని దర్శించుకున్నారు.
విజయవాడ కనక దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయం వద్ద పవన్ కళ్యాణ్‌కు అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందించారు. సంప్రదాయం ప్రకారం ఆయనకు కండువా కప్పి అమ్మవారి చిత్ర పటం అందజేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తన కుమార్తె ఆద్యను కూడా వెంట తీసుకుని వెల్లారు. ఇద్దరు కలిసి దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ రోజు మూల నక్షత్రం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అకాశాలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్‌కు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చూడటంలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్‌తో పాటు రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌లు ఉన్నారు. వీరు కూడా అమ్మ వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరి కంటే ముందు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు దుర్గమ్మను దర్శించుకొని పూజలు చేశారు. మూల నక్షత్రం రోజు సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇచ్చారు. భక్తులు భారీగా హాజరు కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కోలాహలంగా మారింది. భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా మంచినీరు, మజ్జిగ దర్శనాలకు వెళ్లే దారుల్లో అందించే ఏర్పాట్లు అధికారులు చేపట్టారు.