చంపావతి నీరే చంపేసిందా?
x

చంపావతి నీరే చంపేసిందా?

13 మంది మరణానికి కారకులెవరు? నీటి కాలుష్య నివేదికపై ఇప్పటికీ రహస్యమే! ఇంతమంది చనిపోయినా ఒక్కరే అంటున్న ప్రభుత్వం. కాదు పదిమంది అంటూ సొంత సర్కారును ఇరకాటంలోకి నెట్టిన పవన్ కల్యాణ్.


(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

వారం రోజులుగా ఆ ఊళ్లన్నీ కంటిమీద కునుకులేకుండా ఉన్నాయి. ఏ ఊళ్లో ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందోనని తల్లడిల్లిపోతున్నాయి. విజయనగరం జిల్లా, గుర్ల మండలంలోని ఏడు గ్రామాల్లో వాంతులు, విరేచనాలతో అతిసార (డయేరియా) సోకి మరణాలు సంభవిస్తున్నాయి. మొదట్లో వీటిని తేలిగ్గా తీసుకున్న ఆ జిల్లా యంత్రాంగం ఆలస్యంగా మేల్కొంది. అయితే అప్పటికే జరగాల్సిన ప్రాణ నష్టం జరిగిపోయింది. వారం రోజుల్లో 12 మందికి పైగానే మృత్యువాత పడితే.. అబ్బే.. ఒక్కరంటే ఒక్కరే డయేరియాతో చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వ బాధిత కుటుంబాల్లో మరింత ఆగ్రహాన్ని రగిల్చింది. ఇంతలో మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. చనిపోయింది ఒకరు కాదు.. పది మందని కుండ బద్దలు కొట్టారు. సొంత సర్కారును ఇరకాటంలోకి నెట్టారు. ఇంతకీ కలుషిత నీటికి కారణంపై నివేదికలొచ్చినా వాటిని బహిర్గతం చేయకుండా జిల్లా యంత్రాంగం ఇంకా రహస్యంగానే ఉంచుతోంది. అయితే బాధిత గ్రామాల వారు మాత్రం చంపావతి నీరే తమ వారిని చంపేసిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని దాదాపు 20 గ్రామాలకు సొలిపి సోమన్నపేట వద్ద ఉన్న రక్షిత మంచినీటి పథకం ద్వారా చంపావతి నది నుంచి నీటి సరఫరా జరుగుతోంది. వీటిలో ఈ నీరు సరఫరా అయ్యే గుర్లతో పాటు గోషాడ, కెల్ల, కోటగండ్రేడు, పెనుబర్తి, నాగులవలస తదితర గ్రామాల్లో డయేరియా ప్రబలింది. దీంతో తొలుత మంచినీటి సరఫరా చేసే ట్యాంకుపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అధికారులు ఈ గ్రామాల్లో ఉన్న 22 ప్రైవేటు బోర్ల నీటిలో డ్రెయిన్ల మురుగు నీరు కలుషితం కావడం వల్లే డయేరియా సోకిందని చెప్పుకొచ్చారు. ఇంతలో అటు రక్షిత మంచినీటి పథకం నీటిని, ఇటు బోర్ల నీటి శాంపిళ్లను సేకరించి ల్యాబ్ కు పంపారు. ఈలోగా ఈ ఏడు గ్రామాల్లో వందల సంఖ్యలో అతిసార రోగులు పెరుగుతూ వచ్చారు.

దీంతో ఉలిక్కిపడ్డ అధికారులు కొందరిని జెడ్పీ హైస్కూలులో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి, గుర్ల పీహెచ్సీ, నెల్లిమర్ల సీహెచ్సీలకు, ఇంకొందరిని విజయనగరంలోని వివిధ ఆస్పత్రులకు, విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. ఇలా గుర్ల, నాగలవలస గ్రామాల్లో 13 మంది (అనధికారికంగా) వరకు అతిసారతో మృత్యువాత పడ్డారు. డయేరియాతో మరణిస్తున్నారని అటు బాధిత గ్రామాల ప్రజలు, ఇటు మీడియా గగ్గోలు పెడుతున్నా పెడచెవిన పెడుతూ వచ్చింది యంత్రాంగం.పైగా ఇంతమంది చనిపోతే కేవలం ఒక్కరంటే ఒక్కరే డయేరియాతో చనిపోయారని, మిగిలిన వారంతా వేర్వేరు జబ్బులతో మరణించారని కలెక్టర్ అంబేడ్కర్ సహా, ఆ జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. వీరి ప్రకటన బాధిత గ్రామాల్లో ఆగ్రహ జ్వాలలను రగిలించింది.

పరామర్శకొచ్చిన పవన్ కల్యాణ్..

గుర్లలో అతిసార అదుపు తప్పి మరణ మృదంగం మోగిస్తుండడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం బాధిత గ్రామాల సందర్శనకు వచ్చారు. అతిసారం ప్రబలిన గుర్లతో పాటు పరిసర గ్రామాలకు వెళ్లారు. రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించి నీటి కాలుష్యం ఎక్కడవుతోందని అడిగారు. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డయేరియాతో ఇప్పటివరకు పది మంది వరకు మరణించారని ప్రకటించారు. మానవతా ధృక్పథంతో ఒక్కో మృతుని కుటుంబానికి రూ.లక్ష చొప్పున తన వ్యక్తిగత నిధుల నుంచి ఆర్థిక సాయం అందిస్తానని వెల్లడించారు.

ఆయన ప్రకటనతో.. ఇప్పటిదాకా ఒక్కరే మరణించారని బుకాయిస్తున్న అధికార యంత్రాంగం ఉలిక్కి పడింది. అతిసారతో పది మంది చనిపోయారని సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రే బహిరంగంగా ప్రకటించడంతో సొంత సర్కారు ఇరకాటంలో పడిపోయింది. గుర్ల అతిసార ఘటనపై విచారణకు సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానందు నియమించామని, ఆయన ఇచ్చే నివేదకనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు. పవన్ ప్రకటన బాధిత కుటుంబాలకు ఊరట కలిగించింది.

అడుగడుగునా అలసత్వమే..

అతిసార ప్రబలిన తొలినాళ్లలో జిల్లా యంత్రాంగం తేలిగ్గా తీసుకుంది. రోజు రోజుకూ దాని తీవ్రత పెరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరించింది. ఇంటింటికి వెళ్లి రోగులపై సర్వే చేయకుండా నిర్లక్ష్యం చూపింది. మరణాల సంఖ్య పెరిగే సరికి కదలిక వచ్చింది. ఎంతసేపూ డయేరియా మరణాల సంఖ్యను తక్కువగా చూపడంపైనే శ్రద్ధ చూపారు తప్ప నివారణపై సీరియ స్ గా చర్యలు చేపట్టలేదన్న ఆగ్రహం బాధిత గ్రామాల ప్రజల్లో ఉంది. వారం క్రితమే నీటి శాంపిళ్లను సేకరించి పరీక్షకు పంపినా అక్కడ నుంచి వచ్చిన నివేదికను ఇప్పటికీ బహిర్గతం చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతిసార పాపం ఎవరిది? నీటి శాంపిళ్ల నివేదిక ఎందుకు రహస్యంగా ఉంచారన్న దానిపై ఏమి తేలుస్తారో చూడాలి.

రక్షిత మంచినీటి సరఫరా బంద్..

మరోవైపు ఈ గ్రామాలకు చంపావతి నుంచి మంచినీటిని సరఫరా చేసే సొలిపి సోమన్నపేట రక్షిత మంచినీటిని అధికారులు బంద్ చేశారు. ప్రత్యామ్నాయంగా గుర్లకు చీపురుపల్లి నుంచి ట్రాక్టర్ల ద్వారా మంచినీటిని పంపిస్తున్నారు. మిగిలిన గ్రామాలకు ఆయా గ్రామాల్లోని బోర్లలో సురక్షిత నీటిని వినియోగించుకునేందుకు వీలు కల్పించారు. వారం రోజులుగా అతలాకుతలం చేస్తున్న డయేరియా.. సోమవారం నుంచి అదుపులోకి వచ్చిందని అధికారులు చెప్తున్నారు.

Read More
Next Story