అతిసార వ్యాధితో మరణించిన బాధిత కుటుంబాలను వ్యక్తిగతంగా ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున ప్రకటించారు.
విజయనగరం జిల్లా గుర్ల మండలం, గుర్ల గ్రామంలో కలుషిత నీటి ప్రభావంతో డయేరియా బారినపడి ఇటీవల మృతి చెందినవారి కుటుంబాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. అంతకు ముందు గుర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గుర్ల గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అతిసార ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యుల్లో చదువుకునే పిల్లలు ఉంటే వారి విద్యా బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అతిసార వ్యాధుల వల్ల ఏడుగురు మృతి చెందడం విచారకరమన్నారు. పలువురు ఆసుపత్రి పాలు కావడం ఆవేదన కలిగించిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గుర్ల గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా, నీటి కాలుష్యం నివారించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.