పవన్ కల్యాణ్‌ను కూటమిలో లేకుండా చేస్తారు!
x

పవన్ కల్యాణ్‌ను కూటమిలో లేకుండా చేస్తారు!

పవన్ ఉంటే లోకేష్ సీఎం కాలేడని భయం. అందుకే ఆయన ఆదేశాలను పట్టించుకోవద్దని హుకుం. కాపులను, జనసేనను అణచి వేసే కుట్ర జరుగుతోంది, వైసీపీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.

ఉన్నట్టుండి జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డికి ప్రేమ పుట్టుకొచ్చినట్టుంది. కూటమి ప్రభుత్వంలో ఆయనపై కుట్ర జరగుతోందని, కూటమి నుంచి ఆయన్ను సాగనంపుతారంటూ కొత్త రాగం అందుకున్నారు. సరికొత్త దుమారానికి తెరలేపారు. వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఆయన ఆ పార్టీ నాయకులతో గురువారం విశాఖలో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

'జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను కూటమిలో కొనసాగే అవకాశం లేకుండా చేస్తారు. ఇప్పటికే ఆయన్ను కూటమి ప్రభుత్వంలో ద్వితీయ శ్రేణి నాయకుడిగా చూస్తున్నారు. పవన్ను కూటమిలో కొనసాగిస్తే భవిష్యత్తులో తన తనయుడు లోకేష్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డంకిగా మారతాడన్న భయం చంద్రబాబుకు పట్టుకుంది. రాష్ట్రంలో 20 శాతం ఉన్న కాపులను, పవన్ కల్యాణ్ను ఎదుర్కోవడం కష్టం కాబట్టి వారిని ప్రణాళికా బద్ధంగా అణచి వేయడానికి కుట్ర జరుగుతోంది' అంటూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


అందుకే పవన్ కల్యాణ్ను నెల నెలా డౌన్ గ్రేడ్ చేస్తున్నారని ఆరోపించారు. 'గతంలో గతంలో అధికారంలోకి రాకముందు లోకేష్ పవన్కు పాద నమస్కారం చేసాడు. ఈరోజు పవన్ ఆదేశాలు పాటించవద్దని అధికారులకు లోకేష్ ఆదేశాలు జారీ చేస్తున్నాడు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం, మహిళలు, బాలికలపై జరుగుతున్న హత్యాచారాలపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మందకృష్ణ మాదిగ చంద్రబాబును కలిసొచ్చాక పవన్ కల్యాణ్పై విమర్శలు చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు.

మేం మళ్లీ 2027లో అధికారంలోకి వస్తాం. ఇప్పుడు మీరు (చంద్రబాబు) చేస్తున్న కక్ష సాధింపులకు మీ కుమారుడు (లోకేష్) పదింతలు అనుభవించాల్సిన రోజులొస్తాయి. మీ కుటుంబాలను పదింతలు వేధిస్తాయి. ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. గత ఐదేళ్లలో వైసీపీ అందించిన సుపరిపాలనను కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే నాశనం చేశారు. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు. థర్డ్ డిగ్రీలతో వేధిస్తున్నారు' అని ఆరోపించారు.

ఔను..కార్యకర్తలను నిర్లక్ష్యం చేశాం!

'గత ఐదేళ్లలో మా కార్యకర్తలను ఒకింత నిర్లక్ష్యం చేసిన మాట నిజమే. ఎవరు ఔనన్నా, కాదన్నా అది వాస్తవం. తిరిగి వారిలో ఉత్సాహాన్ని నింపి పార్టీకి ఎలా చేయించుకోవాలో ఆలోచిస్తాం. పార్టీ కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యతనిస్తాం. వారిని సంతృప్తి పరుస్తాం' అని స్పష్టం చేశారు. వన్ కంట్రీ, వన్ నేషన్ రియాలిటీ కాబోతుంది. మహిళా రిజర్వేషన్ వచ్చి తీరుతుంది. డీలిమిటేషన్ అయి ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. 2027 లో జరిగే జమిలీ ఎన్నికల నాటికి డీలిమిటేషన్తో ఇప్పుడున్న 175 అసెంబ్లీ స్థానాలు 225కి పెరుగుతాయి. అప్పుడు వైసీపీ 215 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంటుంది. గత ఐదేళ్ల పాలన అనుభవంతో సమస్యలను ఆకళింపు చేసుకుని ప్రజల మన్ననలు ఎలా పొందాలో తెలుసుకుంటాం. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం' అని వివరించారు.

చంద్రబాబు అమాయకుడా? మూర్ఖుడా?

‘విశాఖలోని రుషికొండలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అధ్భుతమైన పర్యాటక భవనాలను నిర్మించాం. సంపదను సృష్టించాం. రాష్ట్రానికే తలమానిమైన ఆ భవనాలను, ఆ సంపదను ఎలా వినియోగించుకోవాలో తెలియని అమాయకుడనుకోవాలా?, మూర్ఖుడనుకోవాలా? రాజకీయం చేయాలను కుంటున్నాడా? అసమర్థుడా చంద్రబాబు? ఆయనకు చేతగాకపోతే ఎలా ఉపయోగించుకోవాలో నిపుణుల సలహా మేరకు నడచుకోవాలి' అని సూచించారు.

స్టీల్ ప్లాంట్పై బాబు చేతులెత్తేశాడు..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా వైసీపీ ప్రభుత్వం హయాంలో అడ్డుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు చేతులెత్తేశాడు. ప్రైవేటీకరణ తప్పదన్న సంకేతాలిస్తున్నాడు. రూ.లక్షా పది వేల కోట్ల విలువైన 22 వేల ఎకరాల భూమిని, లక్ష కోట్ల విలువైన ప్లాంట్ ఆస్తులను కేవలం రూ.8 వేలకే ప్రైవేటుకు కట్టబెట్టాలని చూస్తున్నారు. మేం చూస్తూ ఊరుకోం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం..' అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Read More
Next Story