పిఠాపురంలో పవన్ గెలిచినా, ఓడినా రికార్డే!
పిఠాపురం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అక్కడ పవన్ కల్యాణ్, వంగా గీత మధ్య హోరాహోరీ పోటీ నెలకొని ఉంది. అక్కడ పవన్ గెలిచినా, ఓడినా రికార్డే అవుతుంది. ఎలాగంటే..
ఆంధ్ర ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం కీలకంగా మారింది. అందుకు అక్కడ జనసేనాని పవన్ కల్యాణ్, వైసీపీ తరపున ఓటమెరుగని వంగా గీత పోటీ పడటం ఒక కారణం. అయితే ఇప్పుడు అక్కడ గెలుపుపై, పోలింగ్ సమయంలో ఎర్ర కండువాను చూసి వంగా గీత ఇచ్చిన రియాక్షన్స్ వల్ల ఆ నియోజకవర్గం ఎన్నికలు అత్యంత రసవత్తరంగా మారుతున్నాయి. వంగా గీతకు ఓటమి భయం పట్టుకుందని జనసైనికులు సెటైర్లు వేస్తుంటే.. ఓడిపోతామని తెలిసే కండువాలు, గ్లాసులు ఇచ్చి పంపించారు పవన్ అంటూ వైసీపీ వర్గాలు రీకౌంటర్ ఇస్తున్నాయి. అంతేకాకుండా ఎర్ర కండువా విషయంపై వంగా గీత.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం.. దానిపై జనసేన నాయకుడు నాగబాబు ఘాటుగా బదులు ఇవ్వడం నెట్టింట కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిచినా, ఓడినా రికార్డు కావడం ఖాయమని కూడా ప్రచారం జరుగుతుంది. అది ఎలా అంటే..
పవన్ గెలిస్తే ఇలా!
ఒకవేళ పిఠాపురంలో ఎమ్మెల్యేగా జనసేన చీఫ్ కొణిదెల పవన్ కల్యాణ్ ఘన విజయం సాధిస్తే ఆ ఘట్టాన్ని జనసైనికులు పెద్ద పండగగా జరుపుకుంటారు. అందులో సందేహం లేదు. అయితే పిఠాపురంలో గెలవడం ద్వారా పవన్.. రాజకీయాల్లో తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంటారు. అదే విధంగా ఆయన ప్రత్యర్థి వంగా గీత తన రాజకీయ జీవితంలో తొలి ఓటమిని చవి చూస్తారు. దీంతో పిఠాపురంలో పవన్ గెలిస్తే.. ఆ నియోజకవర్గం ఇరు వర్గాల అభ్యర్థులకు తొలి అనుభవాలను అందిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా పవన్ ఓడినా రికార్డే అవుతుందని వారు చెప్తున్నారు.
ఓడితే రికార్డ్ ఇలా!
అలా కాకుండా ఒకవేళ పవన్ కల్యాణ్ ఓడిపోయినా అది కూడా ఇరు వర్గాల వారికి రికార్డ్ అవుతుందని నిపుణులు చెప్తున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపొతే అది ఆయనకు తన రాజకీయ జీవితంలో ముచ్చటగా మూడో ఓటమి అవుతుందని చెప్తున్నారు. అంటే 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. భీమవరం, గాజువాక స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్లు ఓటమిని చవి చూశారని, అదే విధంగా ఇప్పుడు 2024 ఎన్నికల్లో పిఠాపురంలో ఓడితే ఆయనకు ఇది ముచ్చటగా మూడో ఓటమే అవుతుందని, తన ఓటమి స్ట్రీక్ కంటిన్యూ చేసిన నేత అవుతారని వివరించారు. అదే విధంగా వంగా గీత మరోసారి ఓటమి తెలియని నాయకురాలిగా నిలుస్తుందని, పవన్ కల్యాణ్‌ను ఓడించడంతో నియోజకవర్గంలో ఆమె చరీష్మా తారాస్థాయికి చేరుతుందని, ఇప్పటివరకు ఓటమి ఎరుగని నేత అన్న తన విన్నింగ్ స్ట్రీక్‌ను వంగా గీత కంటిన్యూ చేస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు.
అయితే పోలింగ్ సమయంలో పిఠాపురంలో వెలుగు చూసిన పరిస్థితులను బట్టి అంచనా వేస్తే మాత్రం అక్కడ పవన్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అక్కడి ప్రజలు కూడా పవన్‌ను గెలిపించడానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు రికార్డ్‌లలో ఈసారి ఎన్నికల్లో పిఠాపురం దేనిని సృష్టిస్తుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.