డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. సరస్వతి పవర్‌ భూములను పరిశీలించనున్నారు.


స్వపక్షంపైనే ఘాటు విమర్శలు గుప్పించిన ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తాజాగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాపార సంస్థపై ఫోకస్‌ పెట్టారు. దానికి సంబంధించిన భూములపై దృష్టి సారించారు. వాటిని నిగ్గు తేల్చే పనికి పూనుకున్నారు. అందులో భాగంగా పల్నాడు జిల్లాలోని జగన్‌మోహన్‌రెడ్డి సరస్వతి పవర్‌ సంస్థకు చెందిన భూముల్లోకి ఆయన ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ సంస్థకు సంబంధించిన భూములను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హోదాలో పవన్‌ కళ్యాణ్‌ క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.

వైఎస్‌ జగన్‌కు ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు మధ్య నెలకొన్న ఆస్తుల గొడవల్లో ఈ సరస్వతి పవర్‌ ప్రాజెక్టు తెరపైకొచ్చింది. ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ జగన్‌కు చెందిన సరస్వతీ పవర్‌ ప్రాజెక్టు భూముల పరిశీలనకు ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటన అనంతరం పవన్‌ కళ్యాణ్‌ ఏమని మాట్లాడుతారనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
మంగళవారం పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు అలెర్ట్‌ అయ్యారు. పవన్‌ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మాచవరం మండలంలోని సరస్వతి పవర్‌ భూములను పవన్‌ కల్యాణ్‌ పరిశీలిస్తారు. ఇప్పటికే సరస్వతి భూములను సర్వే చేయాలని అధికారులను పవన్‌ ఆదేశించారు. ఆ మేరకు వారం రోజుల క్రితమే అధికారులు సర్వే కూడా పూర్తి చేశారు. నివేదికను కూడా పవన్‌ కళ్యాణ్‌కు అధికారులు అందించినట్లు సమాచారం. దీంతో నేడు స్వయంగా భూములను పరిశీంచాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించుకున్నారు. మరో వైపు మాసీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన 15 వందల ఎకరాల భూముల్లో అటవీ భూములున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పర్యటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.
Next Story