తొలి సారి అధ్యాక్షా అన్నారు పవన్‌ కల్యాణ్‌. దీని కోసం పదేళ్లు నిరీక్షించారు. గెలుపును తీసుకోగలిగారు కానీ.. అని వైసీపీని సున్నితంగానే విమర్శించారు.


జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అసెంబ్లీలో తొలి సారి అధ్యక్షా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ను ఉద్దేశించి జరిగిన చర్చలో తొలి సారి పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగం చేశారు. తొలుత సభా నాయకులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసగించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. దాదాపు ఏడు నుంచి ఎనిమిది నిముషాల పాటు సాగిన పవన్‌ కల్యాణ్‌ ప్రసంగంలో సభలో పాటించాల్సిన నియమాలు, ఉపయోగించాల్సిన భాష, చర్చలు ఎలా జరగాలి, ఏ విధంగా చర్చలు జరిగితే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది, రాష్ట్రం కోసం అమర జీవి పొట్టి శ్రీరాములు చేసిన బలిదానం, దానిపైన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్‌ ఎలా ఉండాలి, భవిష్యత్‌ తరాలకు ఎలాంటి విలువలు అందించాలి వంటి అనేక అంశాలను మేళవిస్తూ ఆయన ప్రసంగం సాదించింది.

ఆధ్యంతం ఆకట్టుకున్న పవన్‌ మాటలు
సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగం ఆధ్యంతం ఆకట్టుకుంది. చట్ట సభల్లో ఎంతో అనుభవం గణించిన నేతలా, ఒక మేధావిలా, ఒక కవిలా పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించిన తీరు సభ్యులను ఆకట్టుకుంది. చట్ట సభల ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలు, అసెంబ్లీ నిర్వహణలో స్పీకర్‌ పోషించాల్సిన పాత్ర, బాధ్యతలు ఇలా అనేక అంశాలను మేళవిస్తూ పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రసంగం ఆయన ఆలోచన విధానానికి, పని విధానానికి నిదర్శనంగా ఉందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.
పవన్‌ ప్రసంగం సాగిందిలా..
16 అసెంబ్లీ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడుకి హృదయపూర్వక నమస్కారాలు. నేను మొదటి సారి అసెంబ్లీలో అడుగు పెట్టాను. సుదీర్ఘీ కాలం, దశాబ్దాల కాలం పాటు చట్ట సభల్లో అనుభవం కలిగి ఉండటం, ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా పని చేసిన చింతకాలయ అయ్యన్న పాత్రుడుని స్పీకర్‌ స్థానంలో ఉండటం సంతోష కరం. ఇన్ని దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ప్రజలు మీ వాడీ.. వేడిని చూశారు. మీకు కోపం వస్తే రుషి కొండను చెక్కినట్టు ప్రత్యర్థులకు పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. నాకు ఒకటే బాధేస్తోంది సార్‌.. ఇకపైన మీకు తిట్టే అవకాశం లేక పోవడం అని చలోక్తి విసరడంతో స్పీకర్‌తో సహా సభ్యులంతా ఒక్క సారిగా నవ్వులు చిందించారు.
మీ హుందాతనం చూడబోతున్నాం..
కానీ ఇన్నాళ్లు ప్రజలు మీ వాడీ వేడీని చూశారు. మీ ఘాటైన వాగ్దాటిని చూశాం. ఇక నుంచి రాష్ట్ర ప్రజలు, సభ్యులు సభలో మీ హుందా తనం చూడ బోతున్నారు. డిబేట్స్‌ వెనుకాల దాక్కొనే సంస్కార హీనమైన భాషను, భావాలను, రకరకాల మాధ్యాలను వెదజల్లుతుంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో.. ఇక్కడ నుంచే మొదలు కావాలి. ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఆడబిడ్డలు ఏ విధంగా నలిగి పోయారు, చిన్నా లేదు పెద్దా లేదు, ఎవరనేది లేదు, ఎవరైనా సరే ఒక మాట మాట్లాడితే వారిని వ్యక్తిగత దూషణలు చేయడం, సోషల్‌ మీడియాలో దాడులు చేయడం, క్యారెక్టర్‌ ఆసాసినేషన్‌ చేయడం, అది పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, గత ప్రభుత్వానికి ఎదురు తిరిగి వారి ఒపినీయన్‌ చెప్పే సగటు మనిషైనా కావచ్చు, వారిని ఇబ్బందులు పెట్టే సంస్కృతి ఇక్కడ నుంచి.. ఈ రోజు ఆగి పోవాలి. అది మీ ఆధ్వర్యంలో జరగాలని స్పీకర్‌ను కోరారు.
విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమిని అంగీకరించ లేక పోతున్నారు..
గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే.. వ్యక్తిగత దూషణలు.. చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు చూశాం. అందుకే ఈ రోజు వారిని 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు. ఈ రోజు సభలో వారు లేరు. ధైర్యం లేదు వాళ్లకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ, ఓటమిని అంగీకరించ లేక పోతున్నారు. ఓటమిని అంగీకరించే స్థాయి వారికి లేదని వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులకు చురకలందించారు.
భాష మనుషులను కలపడానికి.. కానీ..
భావంలో ఉండాల్సిన తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషులను కలపడానికి కానీ.. విడగొట్టడానికి కాదు. భాష విద్వేషాన్ని లేపడానికి కాదు.. షరిష్కరించడానికి. ఎంత భయంకరమైన, జఠిలమైన సమస్యలైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ.. వివాదం సృష్టించడానికి కాదు. ఈ సభ ఉండేది అందుకు. కానీ గత ప్రభుత్వంలో మనం చూసింది వాళ్ల దగ్గర నుంచి బూతులతోటి, వ్యక్తిగ దూషణలతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు. అలాంటి సభ కాకుండా ఈ సభ భవిష్యత్‌కి ఒక ప్రమాణికం కావాలని ఆకాంక్షించారు. 2047 నాటికి తెలుగు జాతి అద్బుత స్థాయికి వెళ్లాలంటే ఈ రోజు మనం వేసే అడుగు భవిష్యత్‌ తర్వాలకు ఒక నిర్థేశం కావాలి. సభలో ఉన్న సభ్యులందరూ చట్టాలు చేయడానికి ఉన్నారు.. చట్టాలను ఉల్లంఘించడానికి కాదు. విభేదించడం అంటే ద్వేషించడం కాదు. వాదించడం అంటే కొట్టుకోవడం కాదు. విభేదించడం, వాదిండం అనేవి ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాదులు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావమే ఆంధ్ర రాజ్యంతో మొదలైంది. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు బలిదానం మీద మన రాష్ట్రం పుట్టింది. 56 రోజులు తిండి తిప్పలు తినకుండా బాధను అనుభవిస్తూ రాష్ట్రం కోసం ఆయన బలైపోయారు. అలాంటి త్యాగమూర్తుల బలిదానాలతో ఏర్పడిన ఇలాంటి సభలో పొట్టి శ్రీరాములు త్యాగాలను, ప్రజా సంక్షేమం కోసం చర్చలు జరపాలి. వాదోప వాదాలనేవి హద్దులు దాటకుండా ఉండాలి. వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వం మాదిరిగా ఈ సభని తిట్లకు, బూతులకు, కొట్లాటలకు వాడితే ప్రతి నిముషం పొట్టిశ్రీరాములు బలిదానాన్ని అవమానం చేసినట్లే. గొప్పవాడు, మహాను భావుడు బతికినప్పుడే కాదు.. చనిపోయిన తర్వాత కూడా జనాలకు, భావితరాలకు ఉపయోగపడుతాడని నిరూపించాలి. అమరజీవి పొట్టిశ్రీరాములు స్మృతిలో విలువలతో కూడిన సత్ససంప్రదాయానికి తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభ జరగాలని స్పీకర్‌ను ఆకాంక్షించారు. ఈ ఐదేళ్ల ప్రజా ప్రస్థానంలో విలువైన ఐదేళ్లు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్‌ను ఇచ్చేలా, అన్నం పెట్టే రైతుకి, కౌలు చేసుకునే రైతుకి, రైతు కూలీకి అండగా ఉండేలా, మహిళలకు భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా, ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించేలా, పశువు, పక్షి, ప్రకృతి, సర్వజనులందరికీ కూడా మతాలకీ, ప్రాంతాలకు అతీతంగా సుభిక్షింగా అభవృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం అద్బుతమైన ప్రగతిని సాధించేలా ఈ సభలో చర్చలు సాగాలని ఆకాంక్షించారు. సభాపతి అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో ఈ సభ సరి కొత్త సత్ససంప్రదాయాలకు తెర తీయాలని కోరుతూ తన ప్రసంగాన్ని ముగించారు.
Next Story