తాను జాంబవంతుడు వంటి వాడినని, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ఆంజనేయస్వామి వంటి వారు, అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.


ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ ప్రసంగించినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు. తాను పరమ భక్తుడనే అంశాన్ని తెలియజేసేందుకు ప్రయత్నిస్తుంటారు. దానిని ప్రజలు కూడా గుర్తించాలనే విధంగా ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి సందర్భమే విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ సభలో చోటు చేసుకుంది. వేదికపై సీఎం చంద్రబాబు, ఇతర ప్రభుత్వ పెద్దలు, అధికారులు, ప్రజలతో ఉన్న, నిండు సభలో ఇలాంటి ప్రయత్నమే చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. పవన్‌ కల్యాణ్‌ ఏమి మాట్లాడుతారో శ్రద్ధగా విందామని ఆసక్తిగా చూస్తున్న వారి దృష్టిని తన మాటలతో ఒక్క సారిగా తనవైపునకు తిప్పుకున్నారు. రామాయణం గురించి ప్రస్తావించి తన భక్తిని మరో సారి చాటుకున్నారు. తనను జాంబవంతుడుతోను, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను ఆంజనేయస్వామితోను పోల్చుతూ మాట్లాడారు. సీతమ్మ వారిని లంక నుంచి తీసుకొచ్చే సమయంలో జాంబవంతుడు ఆంజయేస్వామికి తనకున్న శక్తిని తెలియజేస్తారు. అప్పుడు ఆంజనేయస్వామి సముద్రాన్ని దాటి లంక వైపు వెళ్తారు. సీతమ్మవారిని రక్షించి తీసుకొస్తారు. అంతటి శక్తి తనకు ఉందని జాంబవంతుడు గుర్తు చేసేంత వరకు ఆంజనేయస్వామికి తెలియదు. అంతటి శక్తి, సామర్ధ్యాలు ఆంజనేయస్వామికి ఉన్నాయి.

నేను జాంబవంతుడి వంటి వాడిని. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు అంజనేయస్వామి వంటి వారు. నేను జాంబవంతుడిలా చెబుతున్నాను. మీకున్న శక్తి, సామర్థ్యాలను గుర్తు చేస్తున్నాను. మీకు అపారమైన శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి. మీరు మీ శక్తిని, సామర్థ్యాలను తెలుసుకోండి. దాని ప్రకారం పని చేయండి. ఎవరికీ భయపడొద్దు. ప్రజలకు సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఆంజనేయస్వామి తన శక్తిని తాను గుర్తించిన విధంగా మీ శక్తిని మీరు తెలుసుకోండని ప్రజలకు కూడా సూచించారు. వైఎస్‌ఆర్‌సీపీని 151 సీట్ల నుంచి గత ఎన్నికల్లో 11 సీట్లకు తీసుకొచ్చారు. అలాంటి శక్తి మీకు కూడా ఉంది. దాని గురించి తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు.
Next Story