
Hari Hara Veera mallu poster
అదిగదిగో 'హరిహర వీరమల్లు', పవన్ అభిమానుల హోరు
పవన్ అభిమానుల సందడి మొదలైంది. ఆట విడుదలకు సిద్ధమైంది. ప్రీ ఈవెంట్ కు విశాఖ ముస్తాబవుతోంది. సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరి హర వీర మల్లుకి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ వచ్చింది. అనేక చిక్కుల్ని అధిగమించి థియేటర్ల బాట పట్టనుంది. అంతా సవ్యంగా సాగితే ఈ నెల 24న హరి హర వీరమల్లు థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ఆరు కోట్ల మంది చూసినట్టు తెలుస్తోంది. సినిమా బాగుంటుందన్న టాక్ రావడంతో ఇప్పుడీ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్తగా చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరి హర వీర మల్లు అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
సెన్సార్ బోర్డు నుంచి యు/ఎ (U/A) సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమాకి ఫైనల్ రన్ టైమ్ కూడా సిద్ధమైంది. సెన్సార్ బోర్డు ఈ చిత్ర కథను, విజువల్స్‌కు ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం రన్ టైమ్ మొత్తం 2 గంటలు 42 నిమిషాలు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న టాక్ బయల్దేరింది.
ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూనే పవన్ కల్యాణ్ ఈ సినిమా చేశారు. సుమారు 250 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సినిమాను తీశారు. రెండేళ్లకు పైగా ఈ చిత్ర నిర్మాణం సాగింది. తొలుత ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించినా అసాధారణ జాప్యంతో ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు.
'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారైంది.జూలై 20న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ముఖ్య అతిథిగా ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి రానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.
గతంలో ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించాలనుకున్నారు. అప్పుడు సినిమా వాయిదా పడటంతో ఈ కార్యక్రమం కూడా ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా విశాఖను ఎంచుకున్నారు. ఈ సినిమాకి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించనున్నారు.
సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందించారు. ఇప్పటికే బయటకు వచ్చిన పాటలన్నీ దుమ్మురేపాయి.
చిత్రకథ ఏమిటి?
కథ 17వ శతాబ్దం ముగలాయుల కాలం నాటి పుట్టుకొచ్చిన రెబెల్ దొంగ "వీర మల్లు" జీవితం ఆధారంగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం మీద భారత్ లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ అంచనాలున్నాయి. అమెరికాలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది.
హరి హర వీర మల్లు సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు. యాక్షన్, ఎమోషన్, డ్రామా అన్నీ మిళితమై ఉన్న ఈ చిత్రం జూలై 24, 2025 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మే నెలలోగా విడుదల చేయాలనుకున్నా కుదరలేదు. ఆ తరువాత జూన్ 25కి మార్చారు. అప్పటికి కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో జూలై 24న విడుదల చేయాలని నిర్ణయించారు.
ఈ నేపధ్యంలో, కర్ణాటక ప్రభుత్వం నిన్నటి రోజు (జూలై 16) ఒక కీలక జీవో జారీ చేసింది. ఆ జీవో ప్రకారం, సినిమా టికెట్ల ధర రూ.200కిపైగా వసూలు చేయకూడదు అని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అభిమానులపై భారం పడకుండా ఉండేందుకు తీసుకున్నదని అధికారులు తెలిపారు. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో టికెట్ ధరలపై నియంత్రణ ఉంటే ఎలా అని సినీ నిర్మాతలు మదనపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ కూడా ఓ వారం పది రోజులకు అనుమతి ఇచ్చింది.
ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, నెల్లూరు తదితర నగరాల్లో థియేటర్ల వద్ద భద్రతా ఏర్పాట్లు పెంచారు. పవన్ కళ్యాణ్‌కు ఉన్న రాజకీయ నేపథ్యం దృష్ట్యా, కొన్ని ప్రాంతాల్లో అభిమానుల భారీ రద్దీ ఊహించి పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
ఫస్ట్-లుక్ పోస్టర్లు, కొత్త పాట "Asura Hananam" పోస్టర్‌లు ఉన్నాయి.
“Hari Hara Veera Mallu – Part 1 Sword vs Spirit” హైదరాబాదులో 2D (తెలుగు/హిందీ/తమిళ/కన్నడ/మలయాళం) కోసం టికెట్ బుకింగ్ మొదలైంది. "book tickets" లేదా "book your tickets" ద్వారా ముందస్తు టిక్కెట్లు పొందవచ్చు.
Next Story