ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎన్నికల్లో పీడీఎఫ్‌ తిరుగులేని శక్తిగా నిలుస్తోంది.


ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పీడీఎఫ్‌ పట్టు నిలుపుకుంది. రెండో సారి తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ ఎన్నికల్లో యుటీఎఫ్‌ బలపరిచిన పీడీఎఫ్‌ అభ్యర్థి బొర్రా గురుమూర్తికి ఉపాధ్యాయులు, అధ్యాపకులు భారీ మెజారిటీతో పట్టం గట్టారు. గతంలో ఇదే స్థానం నుంచి పీడీఎఫ్‌ ఎమ్మెల్సీగా గెలుపొందిన షేక్‌ సాబ్జీ ఏలూరు అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మెలో పాల్గొని భీమవరం వస్తుండగా 2023 డిసెంబరు 15న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ సమీపంలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురికావడం, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(యుటీఎఫ్‌) ఉద్యమానికి తీరని లోటును మిగిల్చింది. సాబ్జీ పదవీ కాలం 2027 మార్చి 29 వరకు ఉంది. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింద.

సాబ్జీ ఉద్యమ వారసత్వాన్ని అందుకున్న గురుమూర్తి అతి తక్కువ సమయంలోనే ఉపాధ్యాయ ఉద్యమంలో తనదైన ముద్ర వేశారు. సాబ్జీ మరణంతో ఏర్పడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఖాళీని భర్తీ చేసేందుకు డిసెంబరు 5న ఉపఎన్నికలు నిర్వహించారు. సోమవారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో గురుమూర్తి భారీ మెజారిటీ లభించింది. చెల్లుబాటయ్యే 14,680 ఓట్లలో అత్యధికంగా 9,165 ఓట్లు గురుమూర్తికి లభించాయి. 2021లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,534 ఓట్ల మెజారిటీతో షేక్‌ సాబ్జీ గెలిస్తే..తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో గురుమూర్తి 3,906 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడం విశేషం. అయితే సాబ్జీతో పోల్చితే గురుమూర్తి ఓటింగ్‌ శాతం కూడా పెంచుకో గలిగారు.
ఎవరీ గురుమూర్తి..
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచి మండలం నార్నిమెరక పంచాయతీలో గమళ్లపేటలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1975 ఏప్రిల్‌ 14న గురుమూర్తి జన్మించారు. ప్రాథమిక విద్యా భ్యాసం నుంచి హైస్కూలు వరకు మట్లపాలెంలో చదివారు. భీమవరం డీఎన్‌ఆర్‌ కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివిన గురుమూర్తి ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలలో బీఈడీ పూర్తి చేసి, 1998 డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. డీఎన్‌ఆర్‌లో చదువుతున్న కాలంలో విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. 1998లో టీచర్‌గా చేరిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యమాల్లో పని చేస్తున్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ పోరాటాల్లో తనదైన ముద్రను వేసుకున్నారు. ఉపాధ్యాయ సమస్యలపైన ఉద్యమాలే ఊపిరిగా ముందుకు సాగుతున్నారు. అప్రెంటీస్‌ వ్యవస్థ రద్దు కోసం, అప్రెంటీస్‌ కాలానికి రెండు నోషనల్‌ ఇంక్రిమెంట్లు సాధించేందుకు ఉద్యమాలు చేశారు. 2007 ఏప్రిల్‌లో పదో తరగతి స్పాట్‌ కేంద్రం వద్ద జరిగిన పోరాటంలో అరెస్టు కావడంతో రెండున్నర ఏళ్లు కోర్టు కేసులో తిరిగారు. సీపీఎస్‌ రద్దు కోసం అనేక పోరాటాలు చేశారు. ప్రస్తుతం యుటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తూ, ఉపాధ్యాయ సమస్యలపై పోరాటాలు సాగిస్తున్నారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని టీచర్స్‌ వర్గాల్లో గురుమూర్తికి మంచి పేరు ఉంది. నిస్వార్థంగా ఉపాధ్యాయ సమస్యలపై ఆయన చేసిన పోరాటాల తీరు టీచర్స్‌లో మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇది ఓట్ల రూపంలో గురుమూర్తికి బాగా కలిసొచ్చింది. దీనికి తోడు సాబ్జీ అకాల మరణంతో ఉపాధ్యాయ వర్గాల్లో నెలకొన్న సానుభూతి కూడా గురుమూర్తికి కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో గురుమూర్తికి అధిక మెజారిటీని కట్టబెట్టారు.
Next Story