చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్.. బీజేపీతో పొత్తు అందుకేనా..
x
Source: Twitter

చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్.. బీజేపీతో పొత్తు అందుకేనా..

పుంగనూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మళ్ళీ జగనే సీఎం అవుతారని అన్నారు.



చిత్తూరు ఎస్సీ రిజర్వుడు పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ అంతా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్యనే అన్నట్లుగా ఉంది. అక్కడి రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు చిత్తూరులోని పుంగనూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పెద్దిరెడ్డి.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. జగన్‌ను ఒంటిరిగా ఎదుర్కొనే దమ్ములేక విపక్షాలన్నీ కలిసి కట్టుగా పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వస్తున్నాయని సెటైర్లు వేశారు. బీజేపీని ఉద్దేశించి గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడారని, ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయించి ఆంధ్రకు ప్రత్యేక హోదా తప్ప మిగతా వాటన్నింటినీ బీజేపీ ఇచ్చిందంటున్నారని ఆగ్రహించారు.


బీజేపీతో పొత్తు అందుకేనా!


టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై కూడా పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఆంధ్రకు బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చిందని చంద్రబాబు వెళ్ళి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారా అని వ్యంగ్యంగా చురకలంటించారు. సీఏఏ చట్టాన్ని తెచ్చి మైనార్టీలను ఇబ్బంది పెట్టాలని బీజేపీ చూస్తున్నందుకే చంద్రబాబు పొత్తుకు ముందడుగు వేశారా అంటూ విమర్శించారు. జగన్ ఒక్కరిని ఓడించడానికి విపక్షాలన్నీ ఏకమయ్యాయని, వారు ఎన్ని వ్యూహాలు రచించినా, ఎంత ప్రయత్నించినా ఈసారి ఎన్నికల్లో జగన్‌ గెలుపును అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.


మళ్ళీ జగనే సీఎం


ఆంధ్ర సీఎంగా మళ్ళీ జగనే ఎన్నికవుతారని, ఈసారి ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ విజయ దుందుబి మోగిస్తుందని అన్నారు. గతంలో కూడా పెద్దిరెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసిందని, కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో జగన్‌కు ఏ మాజీ సీఎం సాటి లేరని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి పదవుల్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ అది చేశాం.. ఇది చేశాం అని చెప్పుకున్న వారే తప్ప వారు చేసిన అభివృద్ధి అంతంత మాత్రమేనని, రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్‌దేనని వ్యాఖ్యానించారు.



Read More
Next Story