కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ ఎంపీలు
x

కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ ఎంపీలు

టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పమ్మెసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులయ్యారు. వారిద్దరు ఈరోజు రాష్ట్రపతి భవన్‌‌లో ప్రమాణ స్వీకారం చేశారు.


టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పమ్మెసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులయ్యారు. ప్రధాని మోదీ కేబినెట్‌లో మంత్రులుగా వారిద్దరు ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్పు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. వారి ప్రమాణ స్వీకారంతో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. అధికారంలోకే రాదన్న టీడీపీ ఇప్పుడు కేంద్రంలో కూడా కీలకంగా మారడమే కాకుండా కేంద్ర మంత్రుల పదవులను కూడా అందుకుందంటూ వైసీపీ వాళ్లని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా దెప్పిపొడుస్తున్నాయి కూడా. ఈ సందర్భంగానే ఏది ఏమైనా రామ్మోహన్‌నాయుడు తన మాటను అక్షర సత్యం చేశారని గతాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. అదే విధంగా తొలిసారే భారీ మెజార్టీ సాధించి కేంద్ర పదవికి ఎన్నికరైన పెమ్మసాని కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నిండు సభలో రామ్మోహన్‌నాయుడు ప్రతిన

2019లో ఏర్పాటైన పార్లమెంటులో ఓ చర్చ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతున్నారు. అతని సమయం అయిపోయిందని స్పీకర్ చెప్పడంతో ఇంకాస్త సమయం ఇవ్వాలని రామ్మోహన్ కోరారు. కానీ స్థానాల లెక్కల ప్రకారం రామ్మోహన్‌కు లభించే సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైనా అయితే రిక్వెస్ట్ చేసి సమయం తీసుకుని ప్రసంగాన్ని పూర్తి చేస్తారు. కానీ ఆ సమయంలోనే రామ్మోహన్‌ ఒక ప్రతిన పూనారు. ‘‘ఇప్పుడు నాకు సమయం కేటాయించలేమని అంటున్నారు. నాకు తక్కువ సమయమే ఉంది. కానీ రానున్న ఎన్నికల్లో టీడీపీ ఇంతకు మించిన మెజారిటీతో గెలుస్తుంది. అప్పుడు నాకు సమయం అనే సమస్యే ఉండదు’’ అని సభ దద్దరిల్లే చెప్పారు. ఇప్పుడు కేంద్రమంత్రిగా ఆయన సభలో ప్రసంగించడానికి చాలా సమయం ఉంటుంది. దీని గురించి చేసిన ప్రతినను రామ్మోహన్ నెరవేర్చుకున్నాడని, కుర్రాడని అందరూ అంటున్నా అనితరసాధ్యమైన కార్యాలను సాధించిన అసాధ్యుడని అనిపించుకుంటున్నాడంటూ టీడీపీ శ్రేణులు రామ్మోహన్‌నాయుడు ఆకాశానికెత్తేస్తున్నాయి.

శ్రీకాకుళం ప్రజలకు కృతజ్ఞతలు

తనకు కేంద్ర మంత్రి పదవి దక్కడంపై స్పందించిన రామ్మోహన్‌నాయుడు.. శ్రీకాకుళం ప్రజలకు తన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘అందరికీ నమస్కారం. కొత్తగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఆ ఆనందానికి కారణమైనా ఎంతో మందికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా మా నాన్నగారు ఎర్రాన్నాయుడు మరణించినప్పటి నుంచి నన్ను తమ వాడిగా భావించి అక్కున చేర్చుకుని వరుసగా విజయ సోపానాలు ఎక్కిస్తున్న శ్రీకాకుళ ప్రజలకు హృదయపూర్వ కృతజ్ఞతలు’’ అని తెలిపారు.

తొలిసారే కేంద్రమంత్రి

మోదీ కేబినెట్‌లో స్థానం అందుకున్న మరో టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన పెమ్మసారి చంద్రశేఖర్.. అనతికాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. వైద్యవిద్యకు సంబంధించిన ఓ సంస్థను ఏర్పాటు చేసి ఎదిగారు. నిజానికి ఆయన 2014 ఎన్నికల్లోనే టీడీపీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆయన ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2024లో ఎలాగైనా పోటీ చేయాలని ఫిక్స్ అయిన ఆయన అనుకున్నట్లే ఎన్నికల బరిలో నిల్చున్నారు. 3,44,695 ఓట్ల మెజార్టీతో అఖండ విజయాన్ని కూడా సొంతం చేసుకున్నారు. మొదటి సారి ఎన్నికల్లో నిల్చుని భారీ మెజార్టీ పొందడమే కాకుండా కేంద్ర మంత్రి పదవిని కూడా ఆయన అందుకున్నారు.

ఎన్నారైగా టీడీపీకి ఎనలేని సేవ

తొలుత నుంచి పెమ్మసాని చంద్రశేఖర్.. టీడీపీ తరుపునే ఉన్నారు. టీడీపీ ఎన్నారై విభాగం తరపున ఆయన ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ కోసం ఎనలేని సేవలందించారు. 2014 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ స్థానానికి పెమ్మసాని పేరు కూడా ఖరారైంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి పోటీ చేసిన గెలిచారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆయనకు ఉన్న అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో బాగానే పనిచేస్తుందని చంద్రబాబు విశ్వసించారు. అందుకే కేంద్ర పదవికి పెమ్మసాని పేరును చంద్రబాబు సిఫార్సు చేశారు.

Read More
Next Story