మాపై ప్రజలకు నమ్మకం ఉంది.. అధినేతకే నమ్మకం లేదు..

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్లో ధిక్కార స్వరం వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వటం లేదని తెలిసిన ఎమ్మెల్యేలు కొందరు అక్కడక్కడ తమ స్వరం పెంచారు.


మాపై ప్రజలకు నమ్మకం ఉంది.. అధినేతకే నమ్మకం లేదు..
x
Janga Krishna murthy and Dokka Manikya Varaprasad

మాకు ప్రజల్లో మంచి అభిమానం ఉంది. మా నేతకే మాపై నమ్మకం పోవడం దురదృష్టం అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరైతే నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తారు. నాకు తప్పకుండా టిక్కెట్‌ వస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో టిక్కెట్‌ ఇవ్వడం లేదని సమాచారం అందుకున్న తరువాతనే వారి స్వరం మారింది. అయినా వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఇవేమీ పట్టించుకోవడం లేదు. అనుకున్నది ఎమ్మెల్యేలకు చెబుతున్నారు.

గురజాల వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ కోసం జంగా పోరాటం..
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నాకే టిక్కెట్‌ ఇస్తారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పలు సార్లు వ్యాఖ్యానించారు. ఇటీవల పల్నాడు జిల్లాలో పల్నాడు బలహీన వర్గాల సమాఖ్య ఏర్పాటు చేసిన సభకు హాజరై మాట్లాడుతూ ‘పల్లకీ మోసేది మేము, పెత్తనం మరొకరిదా’ అంటూ గురజాల ఎమ్మెల్యే కాసు మషేష్‌రెడ్డిపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. వైఎస్సార్‌సీపీలో చేరిన దగ్గర నుంచి బీసీ నాయకుడిగా ముందుండి పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వాలని కోరినా టిక్కెట్‌ వైఎస్‌ఆర్‌సీపీ అధిష్టానం ఇవ్వలేదు. ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి విప్‌గా ప్రకటించారు. గురజాల జంగా సొంత నియోజకవర్గం కావడంతో ఎవరైనా కార్యకర్తలు వస్తే వారికి కావాల్సిన పనులు చేయించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఎమ్మెల్యే కాసు మషేష్‌రెడ్డి అడ్డుకుంటున్నారని, దీనిని తాను తీవ్రంగా పరిగణిస్తున్నానని బహిరంగంగానే చెప్పారు.
కాగా మూడు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ వారితో మాట్లాడారని, వారు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తే పార్టీ మారుతానని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని ఫెడరల్‌ ప్రతినిధి జంగా కృష్ణమూర్తి వద్ద ప్రస్తావించగా అటువంటిదేమీ లేదన్నారు. ఎవరెవరో ఏదేదో రాస్తున్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఈయన మూడు సార్లు గురజాల నుంచి పోటీ చేసి రెండు సార్లు గెలిచారు. మొదట తెలుగుదేశం పార్టీలో చేరి ఆ తరువాత కాంగ్రెస్‌లోకి వచ్చారు. అనంతర పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ అసంతృప్తి..
గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన సాధికార యాత్రలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్‌. ప్రత్యక్ష రాజకీయాలపై తనకు ఆసక్తి లేకపోయినా తాడికొండ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. తరువాత ఆ బాధ్యతల నుంచి అర్ధాంతరంగా ఎందుకు తొలగించారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన ఒక ఫంక్షన్‌కు వెళ్లి అక్కడ గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును కలిసి మాట్లాడుతూ ఈసారి మీ ప్రభుత్వమే వస్తుందన్నా అంటూ వ్యాఖ్యానించారని, ఆ విషయం తెలుసుకున్న జగన్‌ డొక్కాను తాడికొండ ఇన్‌చార్జ్‌ పదవి నుంచి తొలగించారని విశ్వసనీయ సమాచారం.
నేను మీ సేవకుడిగా ఉంటా.. కొలుసు


కృష్ణా జిల్లా పెనమలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి అసంతృప్తి రాగం వినిపించారు. దురదృష్ణ వశాత్తు తమ నాయకుడు తనను గుర్తించలేదన్నారు. కానీ నియోజకవర్గ ప్రజలు తన వెంట ఉన్నందుకు రుణపడి ఉంటానని, సేవకుడిగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. సాధికార యాత్ర సభలోనే ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అంటే ఇప్పటి వరకు పెనమలూరు నియోజకవర్గం నుంచి పార్థసారధిని మారుస్తున్నట్లు జగన్‌ వెల్లడించలేదు. ముందుగానే సమాచారం అందటం వల్ల పార్థసారధి ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో విజయవాడలోని పార్థ సారధి సొంత స్థలంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయం నడిచింది. పార్టీ నిర్మాణానికి ఆయన వంతు కృషి చేస్తున్నారని చెప్పవచ్చు.
ఈయన బీసీ నాయకుడు, జంగా కృష్ణమూర్తి కూడా బీసీ నేత కావడం వివేషం. డొక్కా మాణిక్య వరప్రసాదరావు ఎస్సీ నాయకుడు. రైల్వే అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు.
Next Story