పరిష్కరించిన అర్జీలపై ప్రజలు ఏమేరకు సంతృప్తిగా ఉన్నారనే అంశాలపై అర్జీదారుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


రెవెన్యూ అధికారులపై ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సీరియస్‌ అయ్యారు. ప్రజల సమస్యలను సరిగా పరిష్కరించడం లేదని, రెవెన్యూ సమస్యలతో వస్తున్న అర్జీదారులు అసంతృప్తిగా ఉన్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ సదస్సుల్లో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న ప్రజల సమస్యల పట్ల మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర ఆగ్రం వ్యక్తం చేశారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం సీసీఎల్‌ఏ కార్యాలయంలో ప్రాంతీయ రెవెన్యూ అధికారుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జోన్‌2, జోన్‌ 3 జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.

రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న సమస్యలు, వాటి పరిష్కాలపై ఈ సదస్సులో మంత్రి చర్చించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల్లో ఇప్పటి వరకు పరిష్కించిన వాటిల్లో సగం మంది అర్జీదారులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని మంత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. క్లిష్టతరమైన సమస్యల అర్జీలను కాకపోయినా.. పరిష్కరించే అవకాశం ఉన్న అర్జీలను కూడా సకాలంలో పరిష్కరించ లేక పోతే ఎందుకని అధికారులను ప్రశ్నించారు. పరిష్కరించిన అర్జీలపై ప్రజలు ఏమేరకు సంతృప్తిగా ఉన్నారనే అంశాలపై అర్జీదారుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేత ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా కూడా అధికారుల తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖకు ప్రస్తుతం సర్జరీ అవసరమని అన్నారు. ట్రెడ్‌ మిల్‌పైన పరుగెడుతున్నట్టు రెవెన్యు అధికారుల పని తీరు ఉందని, అక్కడే ఉంటున్నారు కానీ గమ్యం చేరడం లేదని సిసోడియా అసంతృప్తి వ్యక్తం చేశారు.

Next Story