మూడు కేసుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినా నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించినా పోలీసు నిఘాలో ఉండే విధంగా షరతులు విధించింది. పిన్నెల్లి దాఖలు చేసిన మూడు కేసుల్లోను ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. జూన్ 6 వరకు రక్షణ కల్పిస్తూ షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అందులో అప్పటిన వరకు ఆయనను అరెస్టు వంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని వెల్లడించింది. అయితే ఒక పక్క బెయిల్ మంజూరు చేస్తూనే అనేక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే మాత్రం పోలీసులు చర్యలు తీసుకోవచ్చని వెల్లడించింది. ప్రతి రోజూ ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5లోపు ప్రతి రోజూ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించింది. ఎట్టిపరిస్థితుల్లోను నరసరావుపే దాటి వెళ్ళొద్దని స్పష్టం చేసిన హైకోర్టు ఆ ఊళ్లో ఎక్కడ ఉంటున్నారనే విషయాన్ని పల్నాడు జిల్లా ఎస్పీకి తెలియ జేయాలని ఆదేశించింది. అంతేకాకుండా దేశం విడచి వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన పాస్ పోర్టును అప్పగించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులకు అధికారాలు ఉంటాయనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ఆ మేరకు పోలీసులకు వెసులుబాటు కూడా కల్పించింది.