పిఠాపురంలో లోకల్ నినాదం.. స్వరం మార్చిన వర్మ
పిఠాపురం నుంచి పవన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. పవన్ అభ్యర్థిత్వాన్ని టీడీపీ కో-ఆర్డినేటర్ వర్మ వ్యతిరేకించారు.
పిఠాపురం రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పిఠాపురం నుంచి పవన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడమే ఈ మార్పులకు పురుడుపోసింది. పవన్ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే నియోజకవర్గ టీడీపీ కో-ఆర్డినేటర్ వర్మ స్వరం మారింది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తానంటే తాను పూర్తి మద్దతు ఇస్తానని, నియోజకవర్గంలో పవన్ అడుగు పెట్టకుండానే గెలుపు ఆయన చేతుల్లో పెడతానని మొన్నటి వరకు చెప్పారు. కానీ తీరా అక్కడి నుంచే పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించడంతో ఆయన మాట మార్చారు.
ఇన్నాళ్లూ లేని లోకల్ నినాదాన్ని ఆయన ఎత్తారు. గెలిచే సీట్లను నాన్ లోకల్ అభ్యర్థులకు ఎలా కట్టబెడతారని పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన అనుచరులు తీవ్ర నిరసనకు దిగారు. టీడీపీ పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ జెండాలు, ప్లెక్సీలను దగ్ధం చేశారు. పిఠాపురం టికెట్‌ను వెంటనే వర్మకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన పవన్ అభ్యర్థిత్వం, ఎన్నికల పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వర్మ నోట లోకల్ మాట
ఇన్నాళ్లూ పవన్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటిస్తూ వచ్చిన వర్మ ఆఖరి క్షణంలో తన మాట మార్చారు. తనది పిఠాపురంలో పుట్టి పెరిగిన కుటుంబమని, అలాంటి తమను కాదని ఒక నాన్ లోకల్ వ్యక్తికి నియోజకవర్గం టికెట్ ఎలా ఇస్తారని మండిపడ్డారు. ‘‘పవన్‌కు తమ కార్యకర్తలు చేస్తున్న ఈ ఆందోళనలతో సంబంధం లేదు. ఇది మా పార్టీ వ్యవహారం. పార్టీ కోసం నేను కష్టపడ్డానో లేదో ప్రజలకు తెలుసు. పార్టీ కోసం ఇంత కష్టపడిన తనకు ఇది తీరని అన్యాయం. ఇక పిఠాపురం ప్రజలదే తుది నిర్ణయం’’అని స్పష్టం చేశారు.
ఎవరినీ అగౌరవించొద్దు
వర్మకు పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కోసం కష్టపడే వారికి టికెట్ ఇవ్వకుండా వారిని అధిష్టానం అవమానిస్తోందని ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో తన అనుచరులకు వర్మ కీలక సూచనలు చేశారు. అందరూ సమన్వయం పాటించాలని, ఎవరినీ అగౌరవ పరిచేలా వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. తమ వల్ల నియోజకవర్గాన్ని చెడ్డ పేరు వచ్చేలా చేయొద్దని చెప్పారు. కాగా తాను పార్టీ అనుచరులు, కార్యకర్తల అభీష్టం మేరకే తన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తానని, పిఠాపురంలో పోటీ చేయాలా వద్దా అన్న అంశంపై కూడా అందరినీ అభిప్రాయాలు సేకరించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
గతంలోనూ ఇంతే..
పొత్తు బలోపేతానికి అన్ని విధాలా సహకరిస్తానన్న వర్మ.. గతంలో నియోజకవర్గానికి జనసేన కో-ఆర్డినేటర్‌గా వచ్చిన ఉదయ్ శ్రీనివాస్‌ను వ్యతిరేకించారు. ఆయనతో కలిసి పనిచేయడానికి కూడా విముఖత కనబరిచారు. అప్పుడే అక్కడి నుంచి జనసేనాని పవన్ పోటీ చేస్తే తన పూర్తి మద్దతు ఇస్తానని అన్నారు. కానీ తీరా ఇప్పుడు పవన్ తన అభ్యర్థిత్వాన్ని పిఠాపురం నుంచే ప్రకటించడంతో ఆయన అయోమయంలో పడ్డారు. పార్టీ టికెట్ తనకు దక్కకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, అందుకే అనుచరుల చేత నిరసనలు, ఆందోళనలు చేయిస్తున్నారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story