ప్లీజ్‌ సార్‌.. మీరొకసారి పోతిన మహేష్‌కు చెప్పాలి. ఆయన కలిసొస్తేనే అక్కడ నా గెలుపు సాధ్యమవుతుంది.


సార్‌ .. మీ పార్టీ వాళ్లు కాస్త పెడమొఖంగా ఉన్నారు. నన్ను పట్టించుకోవడం లేదు. ప్లీజ్‌ మీరొక సారి వాళ్లకు చెప్పండి. అంటూ విజయవాయ వెస్ట్‌ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిసి ప్రాదేయపడ్డారు. అయితే తలూపడం తప్ప పవన్‌ కల్యాణ్‌ నోటి మాటగా చూద్దామని కూడా అనలేదని పవన్‌ కల్యాణ్‌ను కలిసిన సమయంలో పక్కనే ఉన్న కొందరు టీడీపీ అభిమానులు బయట చెప్పుకుంటున్నారు. పొత్తులో భాగంగా సుజనా చౌదరికి భారతీయ జనతా పార్టీ విజయవాడ వెస్ట్‌ సీటును ఖరారు చేసింది. ఇక్కడ ముస్లింలతో పాటు బీసీలు, ఎస్సీలు, మార్వాడీలు ప్రధానంగా నగరాలు ఇంకా మిగిలిన సామాజిక వర్గాల వారు ఉన్నారు. ముస్లిం ఓటర్ల సంఖ్య కాస్త ఎక్కువుగానే ఉంటుంది. బిజెపీ పోటీ చేయడంతో వారి నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తం అవుతోంది. ఆ మాటలు తెలుగుదేశం వారితో మిగిలిన వారితో చెప్పలేక మొదటి నుంచి జనసేనను అంటిపెట్టుకొని ఉన్న పోతిన మహేష్‌కు చెప్పినట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న సుజనా చౌదరి ఏకంగా పార్టీ అధ్యక్షుల వద్దకు పిఠాపురం వెళ్లి కలవడంతో పాటు మహేష్‌కు గట్టిగా మీరు మాట చెప్పాలని కోరారు.

రెండు సార్లు గెలిచిన వైఎస్‌ఆర్‌సీపీ
జనసేనతో పాటు తెలుగుదేశానికి కూడా ఈ నియోజక వర్గంలో ఓటర్ల బలముంది. టీడీపీ సీనియర్‌ నేత జలీల్‌ ఖాన్‌ 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచి తెలుగుదేశంలోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్‌కు వైఎస్‌ఆర్‌సీపీ టికెట్‌ ఇచ్చింది. ఆయనపై జలీల్‌ ఖాన్‌ కుమార్తె షబానా ఖాటూన్‌ టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఈ ఎన్నికల్లో గెలిచారు. అంటే వరుసగా రెండు సార్లు ఇక్కడ వైఎస్‌ఆర్‌సీపీ గెలిచింది. 2009లో వెల్లంపల్లి పిఆర్‌పి నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన పోతిన మహేష్‌కు 21వేలకుపైగా ఓట్లు వచ్చాయి. దీనిలో జనసేన పార్టీ కూడా వెస్ట్‌ నియోజక వర్గంలో బలంగా ఉన్నట్లు స్పష్టమైంది. ఏ మాత్రం అశ్రద్ధగా ఉంటే తన గెలుపు చిక్కుల్లో పడే అవకాశముందని భావించిన సుజనా చౌదరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పోతిన మహేష్‌కు దక్కని సీటు
జనసేన నాయకుడు పోతిన మహేష్‌ విజయవాడ వెస్ట్‌ సీటును దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు. అయితే బిజెపితో పవన్‌ కల్యాణ్‌ అంటకాగుతుండటం వల్ల ఆ సీటును పొత్తులో భాగంగా బిజెపీ వారికి కేటాయించాల్సి వచ్చింది. దీంతో పోతిన మహేష్‌ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నాయకుడు చెప్పినా వింటాడా లేదా అనే అనుమానం కూడా స్థానికుల్లో వ్యక్తం అవుతోంది. సుజన చౌదరితో కలిసి మాట్లాడక పోవడాన్ని మీరు ఎలా భావిస్తున్నారని మీడియా వారు ప్రశ్నిస్తే నేను ఈ జిల్లా వాసినేనని అందరినీ కలుపుకొని మాట్లాడి ముందుకు సాగుతానని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆయన తన అనుచర వర్గంతో ముఖ్యులను కలవడం తప్ప ఇంటింటి ప్రచారాన్ని పూర్తి స్థాయిలో చేపట్టలేదు.
పవన్‌ ప్రచారానికి వస్తానన్నారు
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ని పిఠాపురంలో కలిశాను. ఏపిలో మూడు పార్టీల పొత్తు కోసం ఆయన చేసిన కృషికి అభినందనలు తెలిపానని తన ఫేస్‌బుక్‌ వేదికగా సుజనా చౌదరి చెప్పడం విశేషం. రాష్ట్రంలో దుష్టపాలనని అంతమొందించి, ప్రజాప్రభుత్వం ఏర్పడటం కోసం జనసేన త్యాగాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాను. పొత్తు కోసం తన సొదరుడు పోటీలో నుంచి వైదొలగాల్సి వచ్చినా సిద్ధపడిన పవన్‌ కళ్యాన్‌ వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నా గెలుపు సునాయాసం అని ఈ సందర్భంగా ఆయన అన్న మాటలకి కృజ్ఞతలు చెప్పాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారానికి తాను కూడా వస్తానని పవన్‌ కళ్యాణ్‌ మాట ఇచ్చారని పేర్కొన్నారు.
Next Story