జగన్ పేరెత్తకుండా వైసీపీని విమర్శించిన ప్రధాని మోదీ
వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా వైఎస్ జగన్ పేరెత్తకపోవడం విశేషం. వైసీపీ ప్రభుత్వ విధానాలపై మాత్రమే ఆయన దాడి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల కోసం కాకుండా మాఫియా వికాసం కోసం పని చేసిందని ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. అనేక ఖనిజాలు, దేవాలయాలు కలిగిన నేల రాయలసీమని, ఈ ప్రాంతంలో చైతన్యవంతులైన యువత ఉందన్నారు. ఆయన ఈ సభలో ఏమన్నారంటే...
‘‘రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు లేవు. ఉపాధి కోసం యువత వలస వెళ్తోంది. ఈ పరిస్థితి మారాలంటే ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైసీపీ మోసం చేసింది. ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదు. పేదల వికాసం కోసం కాకుండా మాఫియా వికాసం కోసం వైసీపీ పనిచేసింది. ఈ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. పుంగనూరులో ఐదేళ్లుగా రౌడీ రాజ్యం నడుస్తోంది. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక అన్ని మాఫియాలకు పక్కా ట్రీట్‌మెంట్ ఇస్తాం. ప్రతీ ఇంటికి తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జలజీవన్ మిషన్‌కు వైసీపీ ప్రభుత్వం సహకారం అందించలేదు. ఐదేళ్లుగా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం వస్తే సాగునీటి ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తవుతాయి. ఉపాధి కోసం వలస వెళ్లేవారిని అన్నిరకాలుగా ఆదుకుంటాం. గల్ఫ్‌కు వెళ్లే భారతీయులకు ఇప్పుడు గౌరవం పెరిగింది. ఖతార్‌లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా రప్పించాం. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదు. అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ను మళ్లీ తీసుకొస్తామని కాంగ్రెస్ చెబుతోంది. భారత్.. విభిన్న జాతుల సమూహం అని చెబుతోంది. తెల్లవాళ్లు, నల్లవాళ్లు అనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అధికారం కోసం ఆ పార్టీ దేశాన్ని విభజించి పాలించాలని చూస్తోంది.
బల్లెట్ ట్రైన్ కావాలా? వద్దా? దక్షిణాదిలో కూడా బుల్లెట్ రైలు కావాలని భాజపా కోరుకుంటోంది. నంద్యాల-ఎర్రకుంట్ల రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయి. కడప-బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ మంజూరైంది. కడప విమానాశ్రయం కొత్త టెర్మినల్ నిర్మాణంలో ఉంది. వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల పనులు మరింత విస్తరిస్తాం. రైతుల జీవితాన్ని ఎన్డీయే ప్రభుత్వం మాత్రమే మార్చగలుగుతుంది. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తాం’’ అన్నారు మోదీ.
రామాలయంపై తీర్పుపై ఏమన్నారంటే..
‘గత పదేళ్లలో చేపట్టిన మంచి పనులను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తానని చెబుతోంది. రామమందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వెనక్కి తీసుకుంటానని చెబుతోంది. రామ మందిరానికి తాళం వేస్తానని అంటోంది. కాంగ్రెస్ నేతలు దేశాన్ని విభజిస్తూ మాట్లాడుతున్నారు. పదేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన పనులతో భారతదేశానికి గల్ఫ్ దేశాల్లో గౌరవం పెరిగింది’ అన్నారు ప్రధాని మోదీ.
జగన్ పేరెత్తకుండా వైసీపీపై విమర్శ..
వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఎక్కడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరెత్తకపోవడం విశేషం. వైసీపీ ప్రభుత్వ విధానాలపై మాత్రమే ఆయన దాడి చేశారు. వైసీపీ అధినేత జగన్ పేరును ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. ఆచితూచి విమర్శలు చేశారు.