సీఎం చంద్రబాబు పరిపాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా పేకాట క్లబ్‌లు రాజ్యమేలుతున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి పాలనలో ఏపీ తిరోగమనంలో నడుస్తోందన్నారు. రెడ్‌బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వలేక పోయారన్నారు. లిక్కర్, ఇసుక స్కాంలు చాలా బాధాకరమని అన్నారు. గురువారం తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయకపోగా స్కాంల పాలన సాగిస్తోందని మండిపడ్డారు.
తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థలను తీసుకొచ్చామన్నారు. లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రతి సంక్షేమ పథకం ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేశామన్నారు. బడ్జెట్‌లో కేలండర్‌ను ప్రకటించి మరీ పథకాలను అమలు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని వెనక్కి నెట్టుతోందన్నారు. సూపర్ సిక్స్‌లు కనిపించడం లేదన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు కనిపించడం లేదన్నారు. రెడ్‌బుక్ పాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడవడమే కనిపిస్తోందన్నారు. ఉన్న ఆదాయం కాకుండా అదనపు ఆదాయం వచ్చేలా చేయడాన్ని సంపద సృష్టి అంటారని, రాష్ట్ర పురోగతిని, భవిష్యత్‌లో ఎక్కువ మార్గాలు వచ్చేలా ఉంటే అది సంపద సృష్టి అని అన్నారు. ఏపీ చరిత్రలో తమ హయాంలోనే సంపద సృష్టి జరిగిందన్నారు.