వైఎస్ అవినాష్‌రెడ్డి పీఏ కోసం గాలిస్తున్న పోలీసులు
సోషల్ మీడియా కేసులు గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పెద్ద ఎత్తును అరెస్టు చేస్తున్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, కడప ఎంపీ వైఎస్‌ఆర్ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం కడప పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రాఘవరెడ్డి కోసం కడప జిల్లాలో జల్లెడ పడుతున్నారు. సోషల్ మీడియాలో తీవ్ర అసభ్యకరమైన పోస్టులు పెట్టారనే కారణంగా వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని ఇది వరకే పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వర్రా రవీందర్‌రెడ్డి పోలీసుల ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు సంచలనంగా మారింది. అది కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి మెడకి చుట్టుకుంది. వర్రా రవీందర్‌రెడ్డి పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో వైఎస్ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి పేరు చెప్పడంతో ఆయన కోసం గాలింపులు చేపట్టారు. పులివెందుల, లింగాల మండల్లాల్లో జల్లెడ పడుతున్నారు. రాఘవరెడ్డి స్వగ్రామం అయిన అంబకపల్లెలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పులివెందులలో నమోదైన మరో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అనుమానుతుల కోసం కూడా పోలీసులు గాలింపులు చేపట్టారు.