పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
అన్ని శాఖల కంటే పోలీసు శాఖ అత్యంత కీలకమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకమని అన్నారు. అనేక మంది పోలీసు అధికారులు, పోలీసులు విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం విడిచి ప్రజల హృదయాల్లో త్యాగమూర్తులుగా నిలచిపోయారని పోలీసు సేవలను కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడుతారని, నిద్రాహారాలు లేకుండా ప్రజల సంరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను మనస్పూర్తిగా అభినందించారు. ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని పోలీసులు ఉక్కుపాదంతో అణచివేశారని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడటంలోను, ప్రజలకు సమస్యలు సృష్టించే రౌడీ మూకల ఆటకట్టించడంలోను, ఫ్యాక్షనిజాన్ని తొక్కిపడేయంలోను పోలీసులదే కీలక పాత్రని అన్నారు. అలాంటి కీలక విధులు నిర్వహిస్తున్న పోలీసుల సంక్షేమం తమ ప్రభుత్వ బాధ్యతని హామీ ఇచ్చారు. యంత్రాంగాన్ని పటిష్టం చేస్తామన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. వాహనాలు, పరికరాలు, సాంకేతిక సౌకర్యాలు కల్పించడంలో కూడా అనేక చర్యలు చేపట్టామన్నారు. 2014–2019 మధ్యలో రూ. 600 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. ఈ సారి వాహనాల కోసం రూ. 150 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. పోలీసు కార్యాలయాల మరమ్మతులు, నిర్వహణ వంటి అవసరాల కోసం రూ. 60 కోట్లు, రూ. 27 కోట్లతో ఎపీఎఫ్‌ఎస్‌ఎల్ ఎక్విప్‌మెంట్ కోనుగోలు చేశామన్నారు. పోలీసు సంక్షేమానికి రూ. 55 కోట్లు కేటాయించామన్నారు. విశాఖలో గ్రేహౌండ్స్ కోసం ప్రత్యే కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పోలీసు వ్యవస్థకు ఎప్పటికప్పుడు ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత, సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.