సోషల్‌ మీడియాలో వల్గర్‌ పోస్టులు పెడుతున్న వారిని పోలీసులు కటకటాల వెనక్కి పంపించే పనిలో ఉన్నారు. ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో సోషల్‌ మీడియా పేరు చెబితే కొన్ని కుటుంబాల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ పిల్లలు ఏ పోస్టులు పెడుతున్నారో.. ఏ పార్టీ తరపున వారు పనిచేస్తున్నారో తెలియని తల్లిదండ్రుల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. బీపీ ఉన్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. పోలీసులు ఇంటికి వచ్చారంటే సోషల్‌ మీడియాలో మావోడు ఏ ఘనకార్యం చేశాడోననే అనుమానం తల్లిదండ్రుల్లో వస్తోంది. కాస్త చదువుకున్న పిల్లాడైతే ఇదే పరిస్థితి ప్రతి కుటుంబంలోనూ ఉందంటే ఆశ్చర్యం లేదు. పోలీసులు ఫోకస్‌ అంతా సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్న వారిపైనే పెట్టింది. ప్రధానంగా ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా పెడుతున్న పోస్టులపైనే పోలీసులు దృష్టి పడింది. పోలీసులకు వస్తున్న ఫిర్యాదులు కూడా ట్విటర్‌లో వస్తున్న పోస్టులపైనే ఎక్కువగా ఉంటున్నాయి.

తెలుగుదేశం పార్టీలో ఉన్న సోషల్‌ మీడియా వారు ఎప్పటికప్పుడు వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా వారు పెడుతున్న వల్గర్‌ పోస్టులను ఆయా ప్రాంతాల టీడీపీ ముఖ్య నాయకుల దృష్టికి తెస్తున్నారు. దానిని ఎంత మంది చూశారనే దానికంటే ఆ పోస్టు పెట్టిన వాడిపై వెంటనే కేసు పెట్టాలని నాయకులు చెబుతుండటంతో కార్యకర్తలు కేసులు పెడుతున్నారు. కొందరైతే గత ప్రభుత్వ హయాంలోనే కేసులు పెట్టారు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులను సైతం పోలీసులు బయటకు తీసి బూజు దులుపుతున్నారు. పతి జిల్లాలోనూ 30 నుంచి 50 కేసుల వరకు నమోదయ్యాయి. ఎన్‌టీఆర్‌ జిల్లాలో సుమారు 42 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఆదివారం రాత్రి ఒక్క రోజే 18 కేసులు నమోదయ్యాయి. శని, ఆదివారాల్లో చాలా మందిపై కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదులు చేసిన వారంతా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే.
వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ సజ్జల భార్గవ్‌పై ఇప్పటికే కేసు నమోదైంది. ఆయనతో పాటు పలువురు సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లపై టీడీపీ వారు కేసులు పెట్టారు. కడప జిల్లా పులివెందులకు చెందిన వర్రా రవీంద్ర రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. అర్జున్‌రెడ్డిపై కూడా కేసు నమోదైంది. ఆదివారం రాత్రి అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై ఎస్‌సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అలాగే పి గన్నవరానికి చెందిన పర్వతరెడ్డి సుధాకర్‌రెడ్డిపై బాపట్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వైఎస్సార్‌ జిల్లా సింహాద్రి పురానికి చెందిన హరి అనే వ్యక్తి ఈ కేసు పెట్టారు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్న వందల మందిని అరెస్ట్‌ చేశారు. కోర్టులు కూడా వీరికి బెయిల్‌ వెంటనే ఇవ్వకుండా రిమాండ్‌కు పంపుతున్నాయి.
పోస్టులు ఎంత అసభ్య పదజాలంతో ఉంటున్నాయంటే ఒక ఉదాహరణ పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈనెల 7న కడప మునిసిపల్‌ కార్పొరేషన్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మాధవి రెడ్డి పాల్గొన్నారు. మేయర్‌కు, ఎమ్మెల్యేకు మధ్య వాదోప వాదాలు జరిగాయి. దీంతో కోపం తెచ్చుకున్న మేయర్‌ సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కమిషనర్‌ ఏదో చెబుతున్నారు. ఆ సందర్భంలో ఎమ్మెల్యే చేత్తో సైగచేసి ఏదో చెప్పింది. ఎమ్మెల్యే మాధవి కమిషనర్‌కు కన్నుకొట్టిందంటూ ట్విటర్‌లో పోస్టు వచ్చింది. దీంతో ఎమ్మెల్యేపై అనుచితంగా పోస్టు పెట్టిన వ్యక్తిని అరెస్ట్‌ చేయాలని టీడీపీ కార్యకర్త ఒకరు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పోస్టు వైఎస్‌ఆర్‌ జె ది వార్ట్‌ లో రావడంపై దాని నిర్వాహకులపై కేసు నమోదైంది. కేవలం సోషల్‌ మీడియాపైనే ప్రభుత్వం ఫోకస్‌ పెట్టిందని, మిగిలిన వ్యవహరాలు గాలికొదిలేసిందనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి.
పైగా ఇదేదో దేశ సమస్యలాగా పోలీసులు భావించడం కూడా మంచిది కాదనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రాబివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా అలాగే ఉన్నాయి. పోలీసులకు కూడా సవాల్‌గా మారిన ఎన్నో అత్యాచారాలు, హత్య కేసులు ఉన్నాయి. ఆ కేసులపై డేగకన్ను ఉంటేనే తప్ప అదుపులోకి రావు. ఒక పక్క కేసులు నమోదవుతుంటే మరో పక్క సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గంజాయి విచ్చల విడిగా రాష్ట్రంలో అమ్ముడవుతోంది. గంజాయికి కారకులను పట్టుకోవడంలో పోలీసులు సక్సెస్‌ కాలేక పోయారు. కేవలం రవాణా చేసే వారిని మాత్రం అప్పుడప్పుడూ పట్టుకో గలుగుతున్నారు. కానీ పట్టణాలు, నగరాల్లో గంజాయి అమ్ముతున్న వారిని ఒక్కరిని కూడా అరెస్ట్‌ చేసిన దాఖలాలు లేవు.
Next Story