బోండా ఉమ పేరు చెప్పమని పోలీసులు ఎందుకు ఒత్తిడి చేశారు?
x

బోండా ఉమ పేరు చెప్పమని పోలీసులు ఎందుకు ఒత్తిడి చేశారు?

జగన్‌పై దాడి కేసులో పోలీసులు టీడీపీ నేత వేముల దుర్గారావును అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ సమయంలో బొండా ఉమా పేరు చెప్పాలని పోలీసులు ఒత్తిడి తెచ్చారన్నారు.


సీఎం జగన్‌పై రాయి వేసిన ఘటనలో బొండా ఉమా పేరు చెప్పాలని పోలీసులు తనను ఒత్తిడి చేశారని టీడీపీ నేత వేముల దుర్గారావు బహిర్గతం చేశారు. ప్రతి రోజు తనను ఐదు గంటలపాటు విచారించారని, ఆ ఐదు గంటల్లో ఎక్కువగా సీఎం జగన్‌పై మీ పార్టీ కానీ, బొండా ఉమా కానీ రాయి వేయించమన్నారా అన్న ప్రశ్ననే అడిగారని అతడు చెప్పారు. తనకు ఎవరూ ఏం చేప్పలేదని, చేయని నేరానికి తాను నాలుగు రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను వారికి భయపడి ఉండి ఉంటే ఈపాటికి లోపలికి పంపి ఉండే వారు. నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టే నన్ను విడిచి పెట్టారు’’అని అతడు వివరించారు. అయితే జగన్‌పై దాడి కేసులో వేములను దుర్గారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం రాత్రి అతనిని విడిచి పెట్టారు. ఈ సందర్భంగానే పోలీసుల కస్టడీలో తన అనుభవాలను వెల్లడించారు.

మానసిక వ్యధకు గురిచేశారు

పోలీసుల కస్టడీలో తనను మానసిక వ్యధకు గురిచేశారని దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నన్ను గతవారం విజయవాడ సీపీఎస్ నుంచి మైలవరం సర్కిల్ కార్యాలయానికి తరలించారు. ఇక్కడికి ఎందుకు తెచ్చరని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా సాయంత్రానికి పంపుతాములే అని అన్నారు. కానీ పంపలేదు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారు 3 గంటల వరకు అక్కడే విచారించారు. ఆ సమయంలో నన్ను రెండు సార్లు కొట్టారు. అంతకంటే మానసికంగా మరింత ఇబ్బంది పెట్టారు. నువ్వు నిజం చెప్పాల్సిందే. ఇప్పుడు చెప్పకుంటే రేపటికైనా నిజం తెలుస్తుంది. మా సామాజిక వర్గం వారినే ఏడుగురిని తీసుకెళ్లి నన్ను ఇరికించాలని కూడా ప్లాన్ చేశారు. కానీ నేను భయపడకపోవడంతో విడిచిపెట్టేశారు’’అని వెల్లడించారాయన.

ప్రశ్నిస్తే కొట్టారు

‘‘నన్న అరెస్ట్ చేసిన రోజునే మా కాలనీ నుంచే అరెస్ట్ చేసిన సతీష్‌ను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టారు. సతీష్‌ను భయపెట్టి నేను చెప్తేనే రాయి విసిరినట్లు చెప్పించారు. అప్పుడు నేను నిన్ను ఇప్పుడే కలిశాను.. అలాంటప్పుడు రాయి వేయమని ఎప్పుడు చెప్పాను? అని ప్రశ్నించా. అందుకు సతీష్ ఏం చెప్పలేదు. బిక్క ముఖం వేసుకుని అలా చూస్తూ నిలబడ్డాడు. దాంతో నాకు విషయం అర్థమై.. ఈ కేసులో నన్నెందుకు ఇరికిస్తున్నారని పోలీసులతో వాదించాను. దాంతో వాళ్లు నన్ను కొట్టారు. నా వెనక ఎవరు ఉన్నారో చెప్పాలని ఒత్తిడి చేశారు. సతీష్ మా కాలనీకి చెందిన కుర్రాడే అయినా అతనితో నాకు పరిచయం లేదని చెప్పాను. నీ వెనక బొండా ఉన్నారు కదా.. అతను చెప్తేనే నువ్వు చేయించావు కదా అని పోలీసులు ఒకే ప్రశ్నను అటుతిప్పి ఇటుతిప్పి అడిగారు. నేను ఏమీ చేయనప్పుడు నా వెనక ఎవరైనా ఎలా ఉంటారని గట్టిగా ప్రశ్నించా’’ అని పోలీసుల కస్టడీలో తనకు ఎదురైన అనుభవాలను దుర్గారావు పూసగుచ్చినట్లు వివరించారు.

ఖాళీ కాగితాలపై సంతకాలు

‘‘రానున్న రోజుల్లో పోలీసులు, వైసీపీ నేతలతో ఇబ్బందులు ఉంటాయి. ఈరోజున టీడీపీలో నేను క్రియాశీలకంగా పనిచేస్తున్నందున్న నన్ను టార్గెట్ చేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నన్ను మైలవరం సీఐ విజయవాడ వన్‌టౌన్‌కు తీసుకొచ్చారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ కేసులో నీ తప్పు ఏమీ లేదు. నువ్వు వెళ్లిపోవచ్చని అన్నారు. అప్పుడు కొన్ని ఖాళీ కాగితాలు తీసుకొచ్చి సంతకాలు చేయమన్నారు. ఎలాగైనా ఇంటికే వెళ్తున్నాను కదా అని అప్పుడు ఏమీ ఆలోచించకుండా సంతకాలు చేసేశాను. ఆ తర్వాత 160 సీఆర్పీసీ నోటీసులపై సంతకాలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఖాళీ కాగితాలు తల్చుకుంటే భయంగా ఉంది. భవిష్యత్తులో వాళ్లు వాటిపైన ఏమి రాసుకుని నన్ను ఇబ్బంది పెడతారో అని’’అని ఆందోళన వ్యక్తం చేశారు దుర్గారావు.

బొండా ఉమా పేరే ఎందుకు?

జగన్‌పై రాయి దాడి జరగడం, అందులో వేముల దుర్గారావును అదుపులోకి తీసుకుని నాలుగు రోజులు విచారించడం. బయటకు వచ్చిన దుర్గారావు.. తనను బొండా ఉమా పేరు చెప్పాలని ఒత్తిడి చేశారని వివరించారు. దీంతో అసలు బొండా ఉమానే ఎందుకు టార్గెట్ చేశారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే జగన్‌పై దాడి విజయవాడ ర్యాలీలో జరిగింది. ఈ ఘటనలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీకి సిద్ధమవుతున్న వెల్లంపల్లికి కూడా గాయమైంది. విజయవాడ సెంట్రల్‌లో కూటమి తరపున బరిలో ఉన్న అభ్యర్థి బొండా ఉమా. మొన్నటి వరకు విజయవాడ సెంట్ర‌లో గెలుపు ఎవరిది అంటే కూటమికే గెలిచే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ సెంట్రల్‌లో తమ ప్రత్యర్థిని దెబ్బతీయడానికి, వేల్లంపల్లి గాయం ద్వారా నియోజకవర్గంలో, జగన్ గాయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సింపతీ సంపాధించడానికి వైసీపీనే ఈ దాడి నాటకం ఆడుతుందని కూటమి వర్గాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగా ప్రత్యర్థితి తొలగించడానికని పోలీసుల దగ్గర బొండా ఉమా పేరు వచ్చేలా వైసీపీ వ్యూహాలు రచించిందని, కానీ అవి బెడిసి కొట్టాయని కూటమి శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

వైసీపీ వ్యూహం ఫలించిందా!

కూటమి వర్గాలు అంటున్నట్లే ఒకవేళ వైసీపీ.. తమ ప్రత్యర్థితిని తొలగించడానికే ఈ దాడి డ్రామా ఆడి ఉంటే మరి వాళ్ల వ్యూహం ఫలించిందా అంటే విశ్లేషకులు ఫలించినట్లేనని అంటున్నారు. ఇప్పుడు ఈ దాడి, ఈ కేసులో పదేపదే బొండా ఉమా పేరు వార్తల్లో రావడంతో ప్రజల ఆలోచనా తీరు మారుతుందని, మొన్నటి వరకు గెలుపు ఎడ్జ్‌తో కొనసాగిన కూటమికి ఇప్పుడు ఓటమి ఎడ్జ్ వచ్చిందని వారు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా వెల్లంపల్లి పట్ల సింపతి క్రియేట్ అయిందని, దాని ద్వారా ఆయనకు పడే ఓట్లు సంఖ్య పెరగొచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఈ దాడి వల్ల విజయవాడ సెంట్రల్ రాజకీయ సమీకరణాల్లో మార్పులు సంభవించాయని, ఒకవేళ ఈ కేసు ఎన్నికలలోపు తేలిస్తే ఈ సమీకరణాలు ఈసారి తీవ్రంగా మారుతాయని, కానీ అది జరిగేలా కనిపించడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఇలాంటి ఆసక్తికర పరిస్థితుల మధ్య విజయవాడ సెంట్రల్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

Read More
Next Story