ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారిని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ప్రభుత్వానికి, మంత్రులకు, టీడీపీకి వ్యతిరేకంగా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వారి భరతం పట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారిని అదుపులోకి తీసుకోవడం పోలీసులు మొదలు పెట్టారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల నుంచి వత్తిడులు పెరగటంతో పోలీస్ ఉన్నతాధికారులు సైతం వీరిని పట్టుకుని అరెస్ట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలువరు సోషల్ మీడియా వారిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కేసులు పెట్టారు.

ఎక్స్, ఫేస్‌బుక్‌ వేదికగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు అసభ్యకరంగా, వైషమ్యాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ సీఎం మంత్రి వర్గ సమావేశానంతరం జరిగిన సమావేశంలో లేవనెత్తారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి, మంత్రులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారిని వదిలిపెట్టొద్దని పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పారు. మిగిలిన మంత్రులు కూడా పవన్ మాటలను సమర్థించారు. తాను పిఠాపురంలో అలా మాట్లాడటానికి కారణం కొందరు ఎస్పీలని, వారు కనీసం ఫోన్ కూడా ఎత్తి మాట్లాడటం లేదన్నారు. చాలా మంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు పనిచేయడం లేదని సీఎం వద్ద పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. సోషల్ మీడియాను కట్టడి చేయాల్సిందేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇటీవల ఆయన ఒక సభలో మాట్లాడుతూ సోషల్ మీడియా నియంత్రణకు ప్రభుత్వం చట్టం తీసుకురాబోతోందని కూడా చెప్పారు. దానిని నిజం చేస్తూ నేడు జరిగిన మంత్రి వర్గంలో సోషల్ మీడియా వారి గురించి చర్చించారు. అవినీతి అధికారులపై చర్యలు ఉంటాయని, సోషల్ మీడియాలో ఇష్టానుసారం వ్యవహరించే వారి మీద చర్యలు ఉంటాయని, మాట వినని ఐపీఎస్ ల విషయం నెల రోజుల్లో నేను సరిచేస్తానని పవన్ కళ్యాణ్ కు సీఎం సర్థి చెప్పారు.

వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసినా, అలాంటి పోస్టులను ఫార్వర్డ్‌ చేసినా ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలను సీఐడీ అధికారులు అర్ధరాత్రి ఇళ్లలోకి వచ్చి మరీ అరెస్ట్​లు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు విపక్షాలపై అభ్యంతరకర పోస్టులు పెట్టినా అప్పట్లో పోలీసులు కిమ్మన లేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నాయకులు అధికారం కోల్పోయినా ఆ పార్టీ సోషల్‌ మీడియా తీరు మారలేదు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ , హోం మంత్రి అనితలతో పాటు వారి కుటుంబ సభ్యులను కించ పరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారని పవన్ కళ్యాణ్ సమావేశంలో చెప్పినట్లు సమాచారం.

కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై తెలుగుదేశం, జనసేన నాయకుల ఫిర్యాదుల మేరకు విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో శనివారం ఒక్కరోజే పోలీసులు 42 కేసులు నమోదు చేశారు. పశ్చిమ డివిజన్‌లో 5, నార్త్‌ డివిజన్‌లో 3, సౌత్‌ డివిజన్‌లో 3, సెంట్రల్‌ డివిజన్‌లో6, సైబర్‌ పీఎస్‌లో9, మైలవరం డివిజన్‌లో2, నందిగామ డివిజన్‌లో 14, కలిపి మొత్తం 42 కేసులు పెట్టారు. వీటితో ఇప్పటి వరకు ఈ తరహా కేసులు మొత్తం 47 నమోదయ్యాయి.

ఎఫ్‌ రెడ్డి, ఏకే ఫ్యాన్‌ ఎట్‌ జగన్‌ మామ 92, దర్శన్‌ ఎట్‌ దూరదర్శన్‌ 619 తదితర ఎక్స్‌ హ్యాండిల్స్‌ పేర్లతో ఈ పోస్టులు పెట్టినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇప్పటికే కొన్నింటి వివరాలు సేకరించారు. మరి కొందరు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వీరిపై ఐటీ చట్టంతో పాటు బీఎన్‌ఎస్‌ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నేత హరీశ్వర్‌రెడ్డి గత ప్రభుత్వంలో అప్పటి టీడీపీ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రస్తుత హోం మంత్రి వంగలపూడి అనితపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారని మండల టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు చెరుకూరు మహేశ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంగనాథ్‌గౌడ్‌ పేర్కొన్నారు.

కడప జిల్లాకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఆయనపై కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి పోలీసులు రవీందర్ రెడ్డని అదుపులోకి తీసుకుని కడపకు తీసుకొచ్చినట్లు ఆయన బంధువులు చెబుతున్నారు. ఆయన భార్యను, ఒక స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. మంగళగిరి, హైదరాబాద్ ల్లోనూ పలు కేసులు వున్నట్లు పోలీసులు చెబుతున్నారు. చంద్రబాబు, లోకేష్, షర్మిల, సునీత, విజయమ్మలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారని చెబుతున్నారు. రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ పెద్దల నుంచి వత్తిడి పెరగటంతో కర్నూలు డిఐజీ సైతం కడపలో మకాం వేశారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై అసత్య ఆరోపణలతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన నాగిరెడ్డి అనే వ్యక్తిని సత్తెనపల్లిలో బుధవారం ఉదయం అరెస్ట్ చేసి మార్కాపురానికి తీసుకొచ్చారు. వరద సహాయక చర్యల పేరుతో రూ. 534 కోట్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు దోచుకున్నారని ఈయన పోస్టు పెట్టినట్లు మార్కాపురంలో కేసు పెట్టిన వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కడప జిల్లా రాయచోటి మండలం ఆరవీడు గ్రామానికి చెందిన కె హనుమంతరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయనపై గాలివీడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. హనుమంతరెడ్డికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు పెండ్లూరు సర్పంచ్ మహేశ్వరరెడ్డి స్టేషన్ వద్దకు రాగా అక్కడ ఒక కానిస్టేబుల్ సర్పంచ్ పై చేయి చేసుకుని పంపించేశారు. రెండు రోజుల క్రితం గుంటూరులో వైఎస్సార్సీపీ షోషల్ మీడియా లో పనిచేస్తున్న ఒక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇద్దరు సీఐలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కడప ఎస్పీ హర్షవర్థన్ ను కూడా బదిలీ చేసింది. కడపలోనే డీఐజీ ఉన్నారు. పోలీసుల అదుపలో ఉన్నా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చూపించలేదనే ఆరపణలు ఉన్నాయి.

ఇకపై షోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో బూతులు రాస్తూ సోషల్ మీడియాను వేదిక చేసుకుంటున్న వారిని వదిలిపెట్టేది లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. వీరికి బెయిల్ కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఇటువంటి కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వడం లేదు.

Next Story