పోలీసుల అనుభవ రాహిత్యమే ఆంధ్రలో హింసకు కారణం.. అంబటి రాంబాబు
x

పోలీసుల అనుభవ రాహిత్యమే ఆంధ్రలో హింసకు కారణం.. అంబటి రాంబాబు

ఆంధ్రలో చెలరేగుతున్న హింసకు ఎన్నికల తప్పుడు నిర్ణయమే కారణమని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు.. టీడీపీ తొత్తులుగా మారారని విమర్శించారు.


పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో చెలరేగుతున్న హింసపై రాష్ట్ర మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. హింస చెలరేగడానికి పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందులోనూ ముఖ్యంగా ఎన్నికల సమయంలో అవగాహన లేని డీజీపీ, ఎస్పీలను నియమించడం వల్లే ఆంధ్రలో హింస పెట్రేగిపోయిందని, ఇప్పటికి కూడా ఆగకుండా మండుతోందని ఆయన వెల్లడించారు. వైసీపీ కేడర్‌పై టీడీపీ దాడులకు దిగుతోందని, మారణాయుధాలతో దాడులు చేస్తు హింసతను ప్రేరేపిస్తోందని డీజీపీకి ఫిర్యాదు ఇచ్చారు. అందుకోసం వైసీపీ ప్రతినిధులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, పేర్నినాని, లేళ్ల అప్పిరెడ్డి.. డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. పోలీసులు శాఖలో కొందరు టీడీపీతో కలిసి వైసీపీ కేడర్‌పై జరుగుతున్న దాడులను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.

‘పోలీసులు కావాలనే చేశారు’

ఎన్నికల సమయంలో భద్రత కల్పించడంలో కూడా పోలీసు శాఖ వివక్ష చూపిందని అంబటి రాంబాబు ఆరోపించారు. ‘‘వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో అత్యధికంగా పోలీసు బలగాలను మోహరించారు. అదే టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం పోలీసులే కరువయ్యారు. అక్కడి భద్రత అత్యంత అధ్వానంగా ఉంది. దాన్నే అదునుగా తీసుకుని వైసీపీ వర్గాలపై టీడీపీ దాడులకు పాల్పడింది. రక్తాలు వచ్చేలా దాడులు చేసింది. అంతేకాకుండా భద్రత తూతూ మంత్రంగా ఉండటంతో టీడీపీ వాళ్లు పోలింగ్ కేంద్రాలను క్యాప్చర్ చేశారు. నన్ను హౌజ్ అరెస్ట్ చేసి నా ప్రత్యర్థిని మాత్రం స్వేచ్ఛగా తిరగనిచ్చారు. ఇలా పోలీసులు ఎన్నో దుర్మార్గపు చర్యలు చేశారు’’ అని తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈసీ తప్పుడు నిర్ణయమే హింసకు కారణం

ఎన్నికల సంఘం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లే ఆంధ్రలో ఇంతటి హింస జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఉన్నట్టుండి అధికారులను మార్చినప్పటికీ ఇంతటి హింత ఎందుకు జరిగింది? మాకు అనుకూలంగా ఉన్నారంటూ టీడీపీ ఫిర్యాదు చేసీ చేయగానే ఆ అధికారిని ముందూ వెనక ఆలోచించకుండా బదిలీ చేశారు. దాని వల్ల ఏం లాభం జరిగింది. ఎక్కడ చూసినా హింసే కనబడుతోంది. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిచి మాట్లాడారంటే ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పోలీసు పరిశీలకుడు ఢిల్లీ, పురందేశ్వరి ఆదేశాల మేరకే నడుచుకున్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు అంబటి.

రీపోలింగ్‌ గురించి ఈసీ ఎలా చెప్తుంది

అదే విధంగా తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం ఉందో లేదో అన్న విషయాన్ని ఎన్నికల కమిషన్ ఎలా చెప్తుందని ఆయన ప్రశ్నించారు. ‘‘నేను చెప్పాననో, ఫిర్యాదు చేశాననో కాదు. వెబ్ క్యామ్‌లు ఉన్నాయ్ కదా.. వాటిని పరిశీలించి రీపోలింగ్‌పై ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అలా ఏమీ చేయకుండా రీపోలింగ్ అక్కర్లేదు అని ఎలా నిర్ణయం తీసుకుంటారు?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More
Next Story