అంతా రెడీ అన్న ఈసీ.. మాస్ వార్నింగ్ ఇచ్చిన పోలీసు శాఖ
x

అంతా రెడీ అన్న ఈసీ.. మాస్ వార్నింగ్ ఇచ్చిన పోలీసు శాఖ

కౌంటింగ్‌ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో 360 విజన్ నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.


కౌంటింగ్‌ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో 360 విజన్ నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. మొత్తం 33 ప్రాంతాల్లో 401 హాల్లలో కౌంటింగ్ జరగనుందని వివరించారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పోస్టర్ బ్యాలెట్ల కౌంటింగ్ కోసం 443 టేబుళ్లు, ఈవీఎంల కౌంటింగ్ కోసం 2443 టేబుళ్లను ఏర్పాట్లు చేసినట్లు ఈసీ ప్రకటించింది. దాంతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోస్టర్ బ్యాలెట్లకు 557, ఈవీఎంల కౌంటింగ్‌కు 2446 బల్లలు ఏర్పాట్లు చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ కౌంటింగ్ ప్రక్రియనకు పర్యవేక్షించడానికి 119 మంది అబ్జర్వర్లను నియమించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ‘‘ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్. ప్రతి కౌంటింగ్ హాల్‌లో అబ్జర్వర్‌కు సహాయంగా అదనంగా ఇద్దరు మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించాం. కౌంటింగ్ కోసం మొత్తం 25,209 మంది సిబ్బందిని విధుల్లో పెట్టాం’’ అని ఈసీ వివరించింది.

అత్యధిక రౌండ్లు ఆ నియోజకవర్గానికే

కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధిక రౌండ్ల లెక్కింపు జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఆ నియోజకవర్గంలో మొత్తం 27 రౌండ్ల కౌంటింగ్ జరుగుతుందని, ఈ నియోజకవర్గం ఫలితాలు సాయంత్రం 6గంటలు దాటిన తర్వాతే వస్తుందని అధికారలు స్పష్టం చేశారు. అదే విధంగా రాజమెండ్రి, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో కనీసం 13 రౌండ్ల కౌంటింగ్ జరుగుతుందని, అది పూర్తి కావడానికి 5గంటల సమయం పడుతుందని వివరించారు.

ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే అత్యధికంగా భీమిలీ, పాణ్యం నియోజకవర్గాల ఓట్లు 26 రౌండ్లలో లెక్కింపు కానున్నాయని చెప్పింది ఈసీ. అత్యల్పంగా కొవ్వూరు, సరసాపురం ఓట్ల లెక్కింపు 13 రౌండ్లలో జరుగుతుందని, ఈ లెక్కింపుకు 5 గంటల సమయం పడుతుందని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం

పార్టీల శ్రేణులకు పోలీసుల వార్నింగ్

కౌంటింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర బలగాలతో భద్రత నిర్వహిస్తోంది. అదే విధంగా కౌంటింగ్ సమయంలో అల్లర్లు జరగకుండా చూసుకోవాలని పోలీసు శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇరు పార్టీ శ్రేణులకు, అల్లరి మూకలకు పోలీసు శాఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రతి ఒక్కరు కౌంటింగ్ రోజున వళ్లు దగ్గర పెట్టుకుని నడుచుకోవాలని, ఎవరైనా మితిమీరిన వేషాలు వేస్తే కఠిన చర్యలు తప్పవంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది పోలీసు శాఖ. మరీ ముఖ్యంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు.. నలుగురు కన్నా ఎక్కువ మంది గుంపుగా కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, వారిపై కేసులు కూడా నమోదు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

ఆ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు: డీజీపీ

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజునే కాకుండా పోలింగ్ ముగిసిన కొన్ని రోజుల పాటు తీవ్ర హింసాత్మక ఘటనలు చెలరేగాయి. కానీ కౌంటింగ్ సమయంలో అటువంటి ఏమీ ఉండవని, ఆ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. ‘‘కౌంటింగ్ రోజున సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం. ఎవరైనా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ ఇప్పటికే కొందరు తమ రాజకీయ ప్రత్యర్థి శిబిరాలకు సోషల్ మీడియాలో వార్నింగ్‌లు ఇస్తున్నారు. మరికొందరు వ్యక్తిగత దాడులకు పాల్పడితూ ఉద్రిక్తలను రేకెత్తిస్తున్నారు. అలాంటి వారిని ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టం. వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. రౌడీ షీట్లు, పీడీ యాక్ట్ కింద కూడా పెడతాం’’అని హెచ్చరించారాయన.

అల్లర్లు చేస్తే ఖబడ్దార్: ఎస్పీ

ఇందులో భాగంగానే అల్లరిమూకలకు సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ‘‘కౌంటింగ్ కేంద్రాల దగ్గర నాలుగంచెల భద్రత ఏర్పాటు చేశాం. రెండు కౌంటింగ్ కేంద్రాల దగ్గర 1500 మందితో, జిల్లావ్యాప్తంగా అదనంగా మరో 500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. సిబ్బందితోనే కాకుండా.. డ్రోన్‌లు, సీసీ కెమెరాలతో కూడా పర్యవేక్షణ కొనసాగిస్తాం. ఎక్కడైనా ఏదైనా అనుమానకరంగా అనిపిస్తే వెంటనే చర్యలు తీసుకంటాం’’ అని ఆయన చెప్పారు. ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఎవరికైనా తాట తీస్తామంటూ మాస్‌ వార్నింగ్ ఇచ్చారు.

Read More
Next Story