నెల్లూరు లేడీ డాన్ అరుణ ఆర్ధిక మూలాలపై పోలీసుల ఆరా!
x

నెల్లూరు 'లేడీ డాన్' అరుణ ఆర్ధిక మూలాలపై పోలీసుల ఆరా!

గూడూరు సమీపంలోని ఓ విద్యాసంస్థ ప్రిన్సిపాల్‌తో ఎక్కువగా కాంటాక్ట్‌లో ఉన్నట్లు వెల్లడైంది.


నెల్లూరు 'లేడీ డాన్‌'గా ఇటీవల వెలుగులోకి వచ్చిన నిడిగుంట అరుణకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలోని కాల్ డేటా ఆధారంగా కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. ఆమె సెల్ ఫోన్లలో కొంతమంది ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధుల ఆడియో, వీడియో రికార్డులతో పాటు వందలకొద్దీ ఫొటోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
అరుణకు ఎవరు వెన్నుదన్నుగా నిలిచారు? ఆమె ఎవరెవర్ని బెదిరించారు? తదితర అంశాల గుట్టు తేల్చేందుకు పోలీసులు ఆమెకు సంబంధించిన రెండేళ్ల కాల్‌ డీటెయిల్‌ రికార్డులు (సీడీఆర్‌) తెప్పించి విశ్లేషించారు. పలువురు రౌడీషీటర్లు, కొందరు ప్రభుత్వాధికారులు, కొంతమంది పోలీసులతో ఆమె తరచూ కాల్స్‌ మాట్లాడినట్లు తేలింది. గూడూరు సమీపంలోని ఓ విద్యాసంస్థ ప్రిన్సిపాల్‌తో ఎక్కువగా కాంటాక్ట్‌లో ఉన్నట్లు వెల్లడైంది. ఆ విద్యాసంస్థ పరిపాలన అధికారి నుంచి అరుణకు తరచూ డబ్బులు వచ్చేవని దర్యాప్తులో గుర్తించారు. అరుణ ప్రియుడు.. కరడుగట్టిన నేరగాడు శ్రీకాంత్‌కు పెరోల్‌ మంజూరు విషయంలోనూ ఆ ప్రిన్సిపాలే పలువురు ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు ఇప్పించినట్లు పోలీసులు నిగ్గు తేల్చారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అరుణకు వివిధ ప్రాంతాల నుంచి ఖరీదైన బహుమతులు అందేవి. వాటిని ఎవరు పంపించారో పోలీసులు ఆరా తీస్తున్నారు.
అరుణ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ఆమెను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. అరుణను అరెస్టు చేసినప్పుడు ఆమెవద్ద నుంచి రెండు ఖరీదైన మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అనుమతి తీసుకుని వాటిని తెరిపించాలని పోలీసులు నిర్ణయించారు. ఎవరెవరి ఫొటోలు, వీడియోలు, ఆడియోలు ఉన్నాయి? ఎవరి గుట్టు బయటపడుతుందనేవి చర్చనీయాంశంగా మారాయి.
అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి వ్యక్తులతో ఫోన్‌లలో మాట్లాడినప్పుడు అరుణ వారి వాయిస్‌ రికార్డు చేయటం, వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసుకునే వారని తెలుస్తోంది.
నెల్లూరులో జరిగిన ఓ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ కి పెరోల్ ఇప్పించడంలో అరుణ కీలక పాత్ర వహించిట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో శ్రీకాంత్ పెరోల్ ను రద్దు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపారు. అరుణను ఇటీవల బాపట్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడామె నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయి.
Read More
Next Story