ఎన్నికల ప్రచారాలు.. ఈరోజు షెడ్యూల్ ఏంటంటే..
x
ప్రచారం చేస్తున్న షర్మిల, జగన్, పవన్ కల్యాణ్

ఎన్నికల ప్రచారాలు.. ఈరోజు షెడ్యూల్ ఏంటంటే..

ఆంధ్రలో ఎన్నికల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. రాష్ట్ర నలుమూలలా ప్రచారాలు కొనసాగుతున్నాయి. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి.


ఆంధ్ర అంతటా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎవరికి వారూ తమదైన స్టైల్‌లో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే నాలుగు ప్రధాన పార్టీల అధ్యక్షులు ప్రచార పథంలో దూసుకుపోతోంది. ప్రచారంలో భాగంగా ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే తామేం చేస్తామన్నది, తమ పార్టీ హయాంలో రాష్ట్రం ఎలా ఉన్నదా.. ఇప్పుడు ఎలా ఉన్నది అన్న అంశాలను బేరీజు చేస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు పార్టీల ప్రచార కార్యక్రమాల షెడ్యూల్ ఎలా ఉందో చూసేద్దాం..

సీఎం జగన్.. చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్రను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ బస్సు యాత్రలో భాగంగా కేవలం ప్రసంగాలు ఇచ్చుకుంటూ పోకుండా.. వీలైన ప్రతిచోట అక్కడి స్థానిక ప్రజల కష్టాలను అడిగి తెలుసుంటున్నారు. ఈ మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఈ రోజు 10 గంటలకు దర్శి నియోజకవర్గంలోని పొదిలిలో పెన్షనర్లతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వినుకొండ నియోజకవర్గానికి వెళతారు. సాయంత్రం 4:30 గంటలకు వినుకొండ టౌన్‌లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. 6:30 గంటలకు వినుకొండలోని శావల్యాపురంకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు వినుకొండలోని గంటా వారి పాలెంలో క్యాంపు నిర్వహించనున్నారు.

ఇక పవన్ కల్యాణ్ చేపట్టిన ‘వారాహి విజయభేరి యాత్ర’కు మరోసారి విరామం ప్రకటించారు. జనసేనాని మళ్ళీ అస్వస్థతకు గురికావడంతో ఈరోజు యాత్రకు విరామం అని పార్టీ ప్రకటించింది. ఆయన హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం గాజువాకలో ఎన్నికల ప్రచారం చేసిన పవన్‌కు తీవ్ర జ్వరం రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తప్పనిసరి అని వైద్యులు సూచించారని, దీంతో కొన్ని రోజుల పాటు వారాహి విజయభేరి యాత్ర ఆగనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే 11 నుంచి టీడీపీ, జనసేన కలిసి చేయనున్న ప్రచారంలో పవన్ పాల్గొనే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. ఈ సంయుక్త ప్రచారంలో ఇరు పార్టీల నేతలు కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నట్లు సమాచారం.

వైఎస్ షర్మిల చేపట్టిన ‘న్యాయ యాత్ర’ ఈరోజు కమలాపురం, వల్లూరు చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వీరపునాయిని పల్లిలో సాగనుంది. పలు ప్రాంతాల్లో షర్మిల ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రేపు అంటే ఏప్రిల్ 9న పండగ సందర్భంగా ఆమె యాత్రకు విరామం ఇవ్వనున్నట్లు సమాచారం.



Read More
Next Story