టిటిడి అటవీ కార్మికులకు న్యాయం చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
x

టిటిడి అటవీ కార్మికులకు న్యాయం చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న టిటిడి అటవీ సిబ్బందికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. సిబ్బందికి న్యాయం చేయకపోతే, రాష్ట్ర వ్యాపిత ఉద్యమం అని హెచ్చరిక


టీటీడీ అటవీ కార్మికుల రిలే నిరాహార దీక్ష అమరణ దీక్షగా మారినా న్యాయం చేయకపోవడం దారుణమని, జూనియర్లను పర్మినెంట్ చేసి సీనియర్లకు అన్యాయం చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు అన్నారు. ఈ తప్పును టీటీడీ యాజమాన్యం సరిదిద్దు కోకుంటే అటవీ కార్మికులు తక్కువ సంఖ్యే అయినా వారికి మద్దతుగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేయడానికి తాము వెనుకాడేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్మికుల రిలే నిరాహార దీక్ష 1160 రోజులు దాటింది.


సోమవారం నాటి ఉదయం టిటిడి అటవీ కార్మికులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షల శిబిరాన్ని ఆయన సందర్శించి ప్రసంగించారు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన కార్మిక వ్యతిరేకంగా తయారైందని, ధార్మిక సంస్థ టీటీడీలోను ఈ ధోరణులు పెరిగి పోయాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. తిరుమల కొండ పచ్చదనానికి కారకులైన అటవీ కార్మికుల పట్ల టిటిడి యాజమాన్యం మొండివైఖరిని సమాజం యావత్తు ఏవగించు కునేటట్టు ఉందని గుర్తు చేశారు.
30 సంవత్సరాల పాటు సేవలందించిన అటవీ కార్మికుల్లో అత్యధికులు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికే 12 మంది మరణించారని అయినా టీటీడీ యాజమాన్యానికి కనికరం కలగకపోవడం క్షంతవ్యం కాదని విమర్శించారు.
తిరుపతి నగరంలోని యావత్ పౌర సమాజం అటవీ కార్మికులు సాగిస్తున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిందని టీటీడీలో ఉన్నతాధికారులకు మనసు ఎందుకు కరగడం లేదో అర్థం కావడం లేదని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో తాజాగా అంగన్వాడీల పోరాటాన్ని నిర్వహించిన సిఐటియు దీనికి నాయకత్వం వహిస్తున్న విషయాన్ని టిటిడి యాజమాన్యం గుర్తుంచుకోవాలని అన్నారు.

ధార్మిక సంస్థలో అధర్మాన్ని సహించేది లేదని ధర్మాన్ని రక్షించండి... ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని ప్రతి నిత్యం ప్రచారం చేసే టిటిడి అధర్మంగా ప్రవర్తిస్తుంటే సరిదిద్దే నాథుడు లేరా? అని ప్రశ్నించారు. టీటీడీ బోర్డులో కార్మిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నం జరుగుతుందన్న విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి పై ఉందని, ఇటీవల కొన్ని సమస్యలు పరిష్కరించారని దీర్ఘకాలంగా పోరాడుతున్న అటవీ కార్మికుల విషయం ఎందుకు పట్టించుకోవడంలేదని... దీనికి కుట్ర దారులు ఎవరైనా ఉన్నారా? ఈ కుట్రకు పాత్రధారులు, సూత్రధారులు ఎవరనే విషయం వెల్లడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


ఆమరణ దీక్షా శిబిరానికి తరలివచ్చిన టిడిపి నేతలు

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి నేతృత్వంలో ఎనిమిది మంది కార్మికులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షల శిబిరానికి టిడిపి నేతలు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు.

టిఎన్ టియుసి రాష్ట్ర అధ్యక్షులు గొట్టిముక్కల రఘురామ కృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, టిటిడి బోర్డు మాజీ సభ్యులు ఓవి రమణ, దంపూరి భాస్కర్, టిఎన్ టియుసి నేతలు సింధూజ, లక్ష్మీపతి నాయుడులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై దీక్షా శిబిరంలోని నేతలకు పూలమాలలు వేసి మద్దతు ప్రకటించారు. కళాకారులు సంఘీభావంగా పాటలు పాడారు.

కాంగ్రెస్ పార్టీ మద్దతు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి, చిట్టిబాబు తదితరులు కందారపు మురళి కి పూలమాలలు వేసి సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ జూనియర్లను పర్మినెంట్ చేయడం వెనుక పెద్ద స్కాం దాగి ఉందని విచారణ జరిపిస్తే దోషులు తేలుతారని అన్నారు.
రిపబ్లిక్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పూతలపట్టు అంజయ్య దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు.

మద్దతు ప్రకటించిన లాయర్లు
దీక్షా శిబిరానికి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్(ఐలు) ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
న్యాయవాదుల సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరాజులు, జిల్లా నేత పత్తికొండ మురళి, కె. నేతాజీ చల్లా వెంకటయ్య, ప్రసన్న, ఉషాకిరణ్ లతోపాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ మద్దతు
బిఆర్ఎస్ నేత ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ దీక్షా శిబిరానికి విచ్చేసి సంఘీభావం ప్రకటించారు. సీనియర్ జర్నలిస్టు ఆదిమూలం శేఖర్ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు.

వివిధ కార్మిక సంఘాల మద్దతు
ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఈఎస్ కుమార్, జోనల్ కార్యదర్శి భాస్కర్, ఎన్ వికె రెడ్డి ,ఏపీ రజక వృత్తి దారుల సంఘం అధ్యక్షులు మునిరత్నం, భాస్కర్, లోక తదితరులు పాల్గొన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి పి. సాయి లక్ష్మి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. హేమలత మరికొందరు రైతులు పూలమాలు వేసి సంఘీభావం ప్రకటించారు.

ఎల్ఐసి యూనియన్ తరపున ఈ.వెంకట ముని, వై. కృష్ణకుమార్ తదితరులు మద్దతు ప్రకటించారు. దీక్షా శిబిరం వద్ద పెద్ద సంఖ్యలో అటవీ కార్మికులు, తిరుపతికి చెందిన వివిధ యూనియన్లు, ప్రజాసంఘాల కార్యకర్తలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు శిబిరం కిటకిటలాడుతూనే ఉంది.



Read More
Next Story