కొండ చుట్టూ రాజకీయం: పైన వెంకన్న.. కింద జగనన్న
x

కొండ చుట్టూ 'రాజకీయం': పైన వెంకన్న.. కింద జగనన్న

తిరుమల లడ్డూ రాజకీయం మహారంజుగా సాగుతోంది. ఎవరి అస్త్రాలను వారు బయటకుతీస్తున్నారు. మధ్యలో భక్తులు, పోలీసులు ఇబ్బంది పడక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు.


తిరుమల లడ్డూ రాజకీయం మహారంజుగా సాగుతోంది. ఎవరి అస్త్రాలను వారు బయటకుతీస్తున్నారు. తిరుమల లడ్డూ పవిత్రతకు భంగం వాటిల్లినందుకు ప్రాయశ్చిత్తమని ఒకరంటే అలాంటిదేమీ లేదంటూ ఇంకొకరు వాదిస్తున్నారు.భక్తిని, హిందూ సెంటిమెంటును వాడుకునేందుకు ఎవరికి తోచిన రీతిలో వారు తమతమ టాలెంట్ ను ప్రదర్శిస్తున్నారు. సెప్టెంబర్ 27 నుంచి అంటే శుక్రవారం నుంచి వచ్చే నెల ఐదు వరకు రాజకీయ పార్టీల హడావిడితో భక్తులు ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తింది. రాజకీయాల్లోకి దేవుడ్ని లాగడమే కాకుండా తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా సాగుతున్న ఈ వ్యవహారంలో ఎవరి నాటకం రక్తికడుతుందో వేచిచూడాలి.


వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28వ తేదీన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లనున్నట్లు ప్రకటించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. మరోవైపు తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనని ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ తిరుమల దర్శనంపై ఉత్కంఠ నెలకొంది. తిరుమలలో పలువురు స్వాములు నిరసనకు దిగారు. గో బ్యాక్ జగన్‌ అంటూ గురువారం అలిపిరి వద్ద శ్రీనివాస ఆనంద స్వామీజీతో పాటు పలువురు స్వాములు ఆందోళనకు చేపట్టారు. గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ ప్లే కార్డ్స్‌తో నినాదాలు చేశారు. వాస్తవానికి ఎవరైనా అన్యమతస్తులు తిరుమల దర్శనానికి వస్తే స్వామి వారిపై తమకు విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. హైందవ మతాన్ని పాటిస్తున్నవారైతే నేరుగా దర్శనం చేసుకోవచ్చు. గత ఐదేళ్లలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వంలో ఉండటంతో అధికారులు ఎవరూ జగన్‌ను డిక్లరేషన్ గురించి ఒత్తిడి చేయలేదు. దీంతో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమల దర్శనానికి వెళ్లారు. తాజాగా సెప్టెంబర్ 28వ తేదీన తిరుమల శ్రీవారిని వైసీపీ అధ్యక్షులు దర్శించుకుంటారని ఆ పార్టీ నేతలు ప్రకటించడంతో ప్రస్తుతం డిక్లరేషన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

వైసీపీ వారి వాదన ఇలా ఉంది...
వైఎస్ జగన్ 2009లోనే డిక్లరేషన్ ఇచ్చినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు ఆయన తిరుమల వెళ్లారని, అప్పుడు డిక్లరేషన్ ఇచ్చారని సీనియర్ ఐఎఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం కూడా చెప్పారు. అటువంటప్పుడు ప్రతి సారీ డిక్లరేషన్ ఇవ్వాల్సిన పని లేదన్నది వైసీపీ వాదనగా ఉంది. అయితే ఈ వాదనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తోసిపుచ్చారు. అన్యమతస్తులు ఎప్పుడు వెళ్లినా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదని, కాని పవిత్ర పుణ్యస్థలంలో సంప్రదాయాలను పాటించాలని కూటమి పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరితో పాటు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జనసేన నాయకులు సైతం జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
వంగా గీత ఏమన్నారంటే..
తిరుమలలో జగన్ డిక్లరేషన్‌పై ఆ పార్టీ మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ వివాదంలో వస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తేనే జగన్ డిక్లరేషన్ ఇస్తారని చెప్పారు. జగన్ డిక్లరేషన్‌కు, లడ్డూ వివాదానికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఆ పార్టీ నేత వంగా గీత రెండింటికి ముడిపెట్టారు.
జగన్ ఈ అంశంపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. డిక్లరేషన్ ఇచ్చి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తారా.. డిక్లరేషన్ అడిగారనే నెపంతో.. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారా అనేది తేలాల్సి ఉంది.
ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు వాదన ఇదీ..
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి మెట్లు ఎక్కి కాలినడకన తిరుపతి వెళుతున్నారన్నారు. అన్య మతస్థుడు తిరుపతి వెళ్లాలంటే హిందూ మతం పట్ల అమితమైన విశ్వాసం ఉందని ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలన్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత, ఒకప్పటి జగన్ సన్నిహితుడు జ్యోతుల నెహ్రూ కూడా జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటున్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ టూర్లు...

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తోడు తిరుమల లడ్డూ ప్రసాదాల కల్తీ వ్యవహారం నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తిరుపతికి వరుస పర్యటనలు తలపెట్టారు. ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు కీలక నేతలు పర్యటనకు వస్తుండడంతో భద్రతాపరంగా పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే సెక్షన్ 30ని ప్రకటించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4వ తేదీన ప్రారంభం కానుండడంతో తొలిరోజు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడానికి సీఎం చంద్రబాబు అదే రోజున తిరుమల రానున్నారు.
ఇక, శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం నేపధ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సైతం దీక్ష చివరి రోజున తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అక్టోబరు 1వ తేదీన తిరుపతి వచ్చి అలిపిరి కాలినడక మార్గంలో తిరుమల వెళతారని, 2న శ్రీవారిని దర్శించుకుని, 3న తిరుపతిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
లడ్డూ వివాదంలో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈనెల 28న తిరుపతి వచ్చి అలిపిరి నడక దారిలో తిరుమల చేరుకుని 29న శ్రీవారిని దర్శించుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
పోలీసులకు తప్పని తలనొప్పి
సీఎం చంద్రబాబు తిరుపతి నుంచీ రోడ్డు మార్గాన తిరుమల చేరుకుని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాక వెనుదిరగనున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అలిపిరి నడక దారిలో తిరుమల వెళితే మాత్రం దారి పొడవునా బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వుంటుంది. ఆయనకున్న జనాకర్షణ కారణంగా దారి పొడవునా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాల్సిందే. తిరుమలలోనూ, చివరి రోజు తిరుపతిలో కూడా ఆయన పర్యటనకు బందోబస్తు ఏర్పాటు చేయడం పోలీసులకు కఠిన పరీక్ష కానుంది.
ఇక మాజీ సీఎం జగన్‌ పర్యటన అన్నింటికంటే పోలీసు యంత్రాంగానికి అగ్ని పరీక్షగా మారనుంది. ఎందుకంటే శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీకి ఆయనే కారకుడంటూ పలు రాజకీయ పార్టీలు, హిందూ మత సంస్థలూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నడక దారిన వెళితే దారిపొడవునా భద్రత ఏర్పాటు చేయడం ఒక సమస్య అయితే ఆయన్ను పలు పార్టీలు, సంఘాలు, సంస్థలూ అడ్డుకునే అవకాశాలున్నాయి. శ్రీవారి ప్రసాదాలను అపవిత్రం చేసిన వారికి తిరుమల వెళ్ళే హక్కు గానీ, శ్రీవారిని దర్శించుకునే హక్కు గానీ లేదని అభ్యంతరపెట్టే అవకాశముంది. ఆయన్ను అడ్డుకునే యత్నాలు శాంతిభద్రతల సమస్యకూ దారితీసే ప్రమాదముంది. ఆ మేరకు పోలీసు యంత్రాంగం భారీ బలగాలను మొహరించాల్సి వుంటుంది.
Read More
Next Story