
తిరుపతి లోని వేమన విజ్ఞాన కేంద్రంలో నండూరి ప్రసాదరావు స్మారక సదస్సులో ప్రసంగిస్తున్న న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్ర బీర్ పురకాయస్థ.
వలసాధిపత్యం కోసమే ట్రంప్ టారిఫ్ యుద్ధం
నండూరి ప్రసాదరావు స్మారక సదస్పులో ‘న్యూస్ క్లిక్’ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ
గత కొన్నేళ్లుగా అమెరికా, పశ్చిమ దేశాలు ప్రపంచంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయని న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ అన్నారు. ఈదేశాలు పరోక్షంగా తమ వలసాధిపత్యాన్ని కొనసా గిం చడంలో భాగమే అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ మొదలు పెట్టిన సుంకాల యుద్ధమని వివరించారు.
తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన సీఐటీయూ నాయకుడు దివంగత నండూరి ప్రసాదరావు స్మారక సదస్సులో ప్రధాన వక్తగా ఆయన ప్రసంగిస్తూ , ప్రపంచ రాజకీయాలనుంచి దేశ రాజకీయాలను విడదీసి చూడలేమని స్పష్టం చేశారు. ఆయన ప్రసంగం ఇలా సాగింది.
‘‘అమెరికా, పశ్చిమ దేశాలు సాంకేతికంగా, ఆర్థికంగా ముందుండడం వల్ల అవి ప్రపంచంపై ఆదిపత్యం చెలాయిస్తున్నాయి. కొలంబస్ అమెరికాను కనుగొనే సమయానికి భారత, చైనా దేశాలు గొప్ప నాగరికతతో విలసిల్లుతున్నాయి. అమెరికాలో, ఆస్ట్రేలియాలో మూలవాసులను నిర్మూలించి యూరప్ వాసులు అక్కడ తిష్టవేయడంతో రాజకీయాధికారం వారి చేత చిక్కింది.
అవి అనేక దేశాలను ఆక్రమించి తమ వలసలుగా చేసుకున్నాయి. వలసపాలకుల నుంచి విముక్తి పొందిన తొలి దేశం భారత్ కాగా, విముక్తి పొందిన రెండవ దేశం చైనా. ఆ తరువాత దక్షిణాసియాలో ఒక్కొక్క దేశం వలసపాలన నుంచి విముక్తి పొందాయి. స్వాతంత్ర్యానంతరం భారత దేశం ఇటు రష్యా కూటమిలో కానీ, అటు అమెరికా కూటమిలో కానీ చేరకుండా మూడవ ప్రపంచ దేశంగా ఉండిపోయింది. దక్షిణాసియాలోని చాలా దేశాలు మూడవ ప్రపంచ దేశాలుగానే ఉండిపోయాయి.
నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ బలమైనదేమీ కాదు. మూలవాసులను తరిమేసి యూరప్ నుంచి వచ్చి స్థిరపడిన వారితో నిండినవే జి7 వంటి దేశాలు. వీటి ఆర్థిక వ్యవస్థ బ్రిక్స్ దేశాల కంటే బలమైనదేమీ కాదు. భారత్, చైనాలు స్వాతంత్ర్యంతో తమ గుప్పెట్లోనుంచి జారిపోయాయన్న బాధతో వీటిపైన ఎలా ఆదిపత్యం చెలాయించాలన్న ఆలోచనలో పశ్చిమ దేశాలు పడిపోయాయి.
ప్రపంచంలో రాజకీయంగా, ఆర్థికంగా, సాంకేతికంగా అనేక మార్పులు సంభవించాయి. భారత్ చైనాల దేశాలతోపాటు దక్షిణాసియా దేశాలు కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అబివృ ద్ధి సాధించాయి. వీటితో పోటీపడలేని స్థితిలో అమెరికా భౌగోళికంగా జాతి నిర్మూలనకు సిద్ధపడి, సముద్ర జలాలను కూడా అదుపు చేసుకుని, వలసలుగా మార్చుకోవాలని చూస్తోంది.
అమెరికా తన డాలర్ ను అంతర్జాతీయ కరెన్సీగా మార్చింది. ఫలితంగా ఏ దేశ కరెన్సీ కూడా వేరే దేశ కరెన్సీతో మారకం చేయడానికి వీలు లేకుండా పోయింది. ఒక దేశం మరో దేశంతో ఆర్థిక లావాదేవీలు జరపాలంటే డాలర్ ద్వారానే జరిపేలా చేసింది. దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు జరగకుండా అమెరికా కట్టడి చేసింది.
దీనికి తోడు అమెరికా తన మిలటరీ ఖర్చును విపరీతంగా పెంచేసింది. ఇది ఎంతగా పెరిగింటే, తొమ్మిది దేశాల మిలటరీ ఖర్చుకంటే కూడా అమెరికా మిలటరీ ఖర్చు ఎక్కువ. ఇరాన్ పైన అమెరికా చేసిన దాడిని రష్యా చైనాలు ఎదుర్కోవచ్చు కానీ, ఎదుర్కో లేదు. ఎందుకంటే డాలర్ ద్వారా వారి ఆర్థిక వ్యవస్థలను బిగించేస్తుంది కనుక.
అమెరికాను ఎదుర్కొనే ఉద్దేశ్యంతోనే చైనా అభివృద్ధి చెందుతోంది. చైనా లాగా భారత్ కు కూడా వనరులున్నాయి కానీ, స్వయం సమృద్ధి సాధించలేకపోతోంది. అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొనే స్థితిలో ఉన్నామా అన్నది ప్రశ్న. శాస్త్ర సాంకేతి విజ్ఞానం నిరంతరం మారుతుంది. దానికి అనుగుణంగా మనం కూడా మారాలి.
అమెరికాకు, చైనాకు ఉన్న టెక్నాలజీ మనకున్నదా అన్నది కాదు. మనం స్వయం సమృద్ధి సాధించామా, లేదా అన్నదే ముఖ్యం. మనం ఆర్థికంగా, జాతీయంగా స్వయం సమృద్ధి సాధించాలి. రైతుల ఆందోళనలను, కార్మికుల ఆందోళనలను సమర్థించాలి. ప్రపంచంలో జరుగుతున్న మార్పులను మనం గమనించాలి. నూతన వలసల్లోకి వెళ్లిపోతున్నాం. ఇది చాలా ప్రమాదకరం.’’ అంటూ హెచ్చరిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
మధ్యతరగతి ఉద్యోగుల సమన్వయ కమిటీ కన్వీనర్ కె.ఎన్.ఎస్. ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రబీర్ పురకాయస్థ ఆంగ్ల ప్రసంగాన్ని సీనియర్ జర్నలిస్ట్ రాఘవ సంక్షిప్తంగా వివరించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి మాట్లాడుతూ, నండూరి ప్రసాదరావు కు తిరుపతికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. తిరుపతి ఆర్టీసీలో సీఐటీయూకు ఆయనే పునాది వేశారని చెప్పారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సుబ్రమణ్యం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం సదస్సు లో ప్రసంగించారు.
ఇది కూడా చదవండి
Next Story

