ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు గురువారంతో ముగిసాయి. ఐదు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను పొగడటం, మాజీ సీఎం జగన్‌ను విమర్శంచడమే ప్రధానంగా సాగింది.


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను పొగుడుకోవడానికి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, ఆయన గత ఐదేళ్ళ పాలను ఆడిపోసుకోవడానికే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు వేదికగా మారాయి. ఐదు రోజులు పాటు జరిగిన ఈ బడ్జెట్‌ సమావేశాల్లో ఆద్యంతం వీటినే కేంద్రంగా చేసుకొని చర్చలు కొనసాగించారు. అంతా ఆత్మ స్తుతి పర నింద అన్న చందంగా అధికార పక్షం అసెంబ్లీ సమావేశాలను జరిపించుకున్నారనే టాక్‌ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఈ నెల 22 నుంచి 26 వరకు తొలి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. సోమవారం మొదలైన ఈ సమావేశాలు గురువారంతో ముగిసాయి. ఐదు రోజుల పాటు జరిగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో జగన్‌ ప్రభుత్వం పనితీరును ఎండగట్టడమే ప్రధాన అజెండాగా పెట్టుకున్నారు. మూడు రంగాలకు సంబంధించిన శ్వేత పత్రాలను విడుదల చేసి వాటిపైన చర్చ జరిపారు. ఒక్కో రోజు ఒక్కో పత్రం విడుదల చేసి విమర్శలు గుప్పించారు. ఎక్సైజ్‌ రంగం, శాంతి భద్రతలు, ఆర్థిక రంగాలపై శ్వేత ప్రతాలను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే విడుదల చేశారు. సభలో ఉన్న పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌పై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌(పీపీటీ) ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. సభ్యులు కూడా ఇదే అంశాలపై మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, శాంతి భద్రతలను కూడా కాలరాశారని, దీనికి కారకులైన వారికి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
తనకు అసెంబ్లీలో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌లకు ధన్యవాదాలని చెప్పడంతో తన ప్రసంగాలతో ప్రతి సభ్యుడు ప్రారంభించడం విశేషం. చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షులని, ఆయన ద్వారానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని, పవన్‌ కళ్యాణ్‌ నిబద్దత కలిగిన నేతంటూ ఇద్దరిని పొగడ్తలతో ముంచెత్తడానికే సభలోని సమయం కేటాయించారనే టాక్‌ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హింస పెరిగింది. అత్యాచారాలు పెరిగాయి. బాలికల హత్యలు పెరిగాయి. వీటిపైన సమగ్ర చర్చ జరగాల్సి ఉన్నా అది జరగ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. ఎన్టీఆర్‌ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో సాగు నీటి సమస్యలు ఉన్నాయి. వర్షాలపైనే ఆధారపడి సాగు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సాగు నీటి సరఫరాతో పాటు విత్తనాలు, ఎరువులు, సబ్సిడీలు వంటి అంశాలపైన చర్చించి రైతులకు భరో కల్పించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్చలు జరగ లేదు. అంతేకాకుండా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఉభయ గోదావరి జిల్లాతో పాటు ఏలూరు వంటి పలు జిల్లాల్లో పంట నష్ట భారీగానే జరిగింది. దీనిపై చర్చించి రైతులకు మనో ధైర్యం కల్పించే విధంగా చర్చలు జరప లేదు.
గత కొద్ది రోజులుగా డయేరియా ప్రబలుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య వెంటాడుతోంది. దీని బారిన పడి పదుల సంఖ్యలో మృత్యువాత పడగా వేలాది మంది మంచాన పడ్డారు. దీనిపైన చర్చించి, అధికారులకు దిశా నిర్థేం చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్చలు సాగ లేదు. ఎన్నికల సమయంలో బాలికల అదృశ్యం గురించి జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ పలుమార్లు ప్రస్తావించారు. జగన్‌ ప్రభుత్వం వైఫల్యం వల్లే వేలాది మంది అదృశ్యమయ్యారని జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ అంశంపై కూడా చర్చలు సాగ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం ఆనవాయితి. ఇది ఎప్పటి నుంచో వస్తున్నదే. కానీ అన్నేళ్ళ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు సాధారణ బడ్జెట్‌పైన కానీ, దాని ప్రస్తావన కూడా ఈ సమావేశాల్లో కనిపించ లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఈ నెల 22 నుంచి 26 వరకు జగిరిన సమావేశాల్లో 27.28 గంటల పాటు సభ జరిగింది. సభ్యులు మొత్తం 36 ప్రశ్నలు సంధించారు. రెండు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. ఐదు రోజుల్లో మొత్తం 68 మంది సభ్యులు ప్రసంగించారు.
సభ ప్రారంభమైన తొలి రోజు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తెలుగుదేశం సింబల్‌ కండువాలను, జనసేన సభ్యులు ఆ పార్టీ కండువాలను, బీజేపీ సభ్యులు ఆ పార్టీ కండువాలను ధరించి హాజరవగా, మాజీ సీఎం జగన్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు మాత్రం నల్ల కండువాలను ధరించి వచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని, గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. వచ్చిన 15 నిముషాల వ్యవధిలోనే వాకౌట్‌ చేసి సభ నుంచి వెళ్ళి పోయారు. తర్వాత సభకు హాజరు కాకపోవడం గమనార్హం.
Next Story