తిరుమల బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు ప్రారంభం
x
తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

తిరుమల బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు ప్రారంభం

శ్రీవారికి సెప్టెంబర్ 24న సీఎం పట్టువస్త్రాల సమర్పణ. సమీక్షలో ఈఓ వెల్లడి.


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. చక్రస్నానంతో అక్టోబర్ రెండో తేదీతో ముగుస్తాయి.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం ఎన్. చంద్రబాబు బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే సెప్టెంబర్ 24వ తేదీ తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో టీటీడీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.

తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ అధికారులు ఇప్పటి నుంచే అధికారులను సన్నద్ధం చేస్తున్నారు. ఆ మేరకు టీటీడీ ఈఓ జె. శ్యామలారావు, అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు తిరుమల అన్నమయ్య భవన్లో సోమవారం సాయంత్రం సమీక్షించారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధనరాజుతో పాటు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ అన్నమయ్య భవనంలో ఈఓ శ్యామలరావు ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు.
గత అనుభవాలతో..
టీటీడీ ఈఓగా గత ఏడాది జే. శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి బ్రహ్మోత్సవం జరిగింది. వారి పర్యవేక్షణలో ఈ ఏడాది 2025లో రెండోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తరువాత బీఆర్. నాయుడు సారధ్యంలోని పాలక మండలి మొదటిసారి ఈ బ్రహ్మోత్సవాలను పర్యవేక్షించనుంది. టీటీడీ అధికారులు, సిబ్బందిన సమన్వయం చేయడం ద్వారా గత ఏడాది బ్రహ్మోత్సవాలు పూర్తిగా అధికారుల సారధ్యంలోనే జరిగాయి. ఆ అనుభవం నేర్పని పాఠాలతో మరింత పటిష్టంగా ఉవ్సాలు నిర్వహించడానికి ఈఓ శ్యామలరావు సమీక్షలు సాగిస్తున్నారు.
బ్రహ్మోత్సవాల వేళ వచ్చే ప్రొటోకాల్ అధికారులు, ప్రజాప్రతినిధుల తోపాటు ప్రధానంగా సామాన్య యాత్రికులకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం జరిగిన సమీక్షలో ఈఓ శ్యామలరావు అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం తోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అందులో ప్రధానంగా
బ్రహ్మోత్సవాల్లో శ్రీవారితో పాటు మాడవీధుల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపును కనులారా చూడాలని యాత్రికులు భావిస్తారు. దీనికోసం మాడవీధుల్లోని గ్యాలరీల్లో యాత్రికులకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, బాధ్యతలను వికేంద్రీకరించే దిశగా చర్చించారు.
ఈ అంశాలపై టీటీడీ ఈఓ శ్యామలరావు ఏమి సూచనలు చేశారంటే..
"ఆలయం, గ్యాలరీల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంతాల్లో జిల్లా పోలీసులతో సమన్వయం చేసుకోండి. భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి" అని ఈఓ ఆదేశించారు. తిరుమలలో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.
ఆ రెండు రోజులే ప్రధానం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మిగతా వాహన సేవలతో పోలిస్తే, రెండు రోజులు జరిగే ఉత్సవాలు ప్రధానమైనవిగా భావిస్తారు.
1. సెప్టెంబర్ 28న గరుడ సేవ
2. అక్టోబర్ 2న చక్రస్నానం
అంటే గరుడోత్సవంతో సగం బ్రహ్మోత్సవం పూర్తయినట్లు భావిస్తారు. ఆ రోజు రాత్రి జరిగే గరుడోత్సవంపై శ్రీవారిని దర్శించుకునేందుకు కనీసంగా ఐదు లక్షల మంది హాజరవుతారనేది గత రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
"బ్రహ్మోత్సవాల తోపాటు ఆ రెండు రోజుల్లో రద్దీని ముందుగానే అంచాని వేసి, జాగ్తత్తలు తీసుకోండి" అని టీటీడీ ఈఓ జే. శ్యామలరావు అధికారులకు ప్రధానంగా పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు.
"యాత్రికుల భద్రత కూడా ప్రధానం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విధంగా శ్రద్ధ తీసుకోవాలి" అని ఈఓ గుర్తు చేశారు.
అలిపిరిలో...
తిరుమలలో ఎంత రద్దీ ఏర్పడుతుందనే విషయం అలిపిరిలోనే తెలిసిపోతుంది. టోల్ గేట్ ద్వారా వచ్చే ఆర్టీసీ బస్సుల్లోని యాత్రికులతో పాటు ప్రయివేటు, సొంత వాహనాల్లో వచ్చే యాత్రికుల సంఖ్యను అంచనా వేయవచ్చు. దీనికోసం
"అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహన రాకపోకలను అంచనా వేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకోండి" అని ఈఓ సూచించారు.
బారికేడింగ్
ఆలయ మాడవీధులతో పాటు, వాహన మండపం, పరిసరాల్లో రద్దీ నియంత్రణ కోసం ఇంజినీరింగ్ పనులపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. బ్రహ్మోత్సవాల వేళ ఆలయ కైంకర్యాలు, వాహనసేవలు, ఇంజినీరింగ్ పనులు, వసతి గృహాలు, కల్యాణకట్ట, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, గార్డెన్ విభాగం అలంకరణలు, శ్రీవారి సేవకుల సేవలు, మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం, మే ఐ హెల్ప్ యూ సెంటర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, టీటీడీ, ఏపీఎస్ఆర్టీసీ రవాణా సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించారు. ఆ విభాగాల అధికారులు సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేయడంతో పాటు సమన్వయంతో పనిచేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని ఈఓ శ్యామలరావు సూచనలు చేశారు. సమావేశంలో టీటీడీ ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ, సీఈ సత్యనారాయణ, ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం జగదీష్, టీటీడీ, పోలీసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story