ఏలూరు రేంజీ డీఐజీ అశోక్‌ కుమార్, తూర్పు గోదావరి జిల్లా నరసింహ కిశోర్‌ కేసు వివరాలను వెల్లడించారు.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలుగు సమాజంలో సంచలనం రేపిన పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల అనుమానాస్పద మృతి కేసుకు సంబందించిన వివరాలను పోలీసు అధికారులు ఏలూరు రేంజీ డీఐజీ అశోక్‌ కుమార్, కాకినాడ జిల్లా ఎస్పీ నరసింహికిశోర్‌లు శనివారం వెల్లడించారు. పోస్టు మర్టం రిపోర్టు వచ్చిందని, ఆ నివేదిక ప్రకారం పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల బాడీ మీద గాయాలు ఉన్నట్లు తేలిందన్నారు. ప్రవీణ్‌ పగడాల చేతులు, ముఖం మీద కొన్ని గాయాలు ఉన్నట్లు పోస్టుమర్టం రిపోర్టులో తేలిందని తెలిపారు. వివరాలు పూర్తిగా రావలసి ఉందని, అవి పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల ఎలా మృతి చెందారనే విషయం మీద స్పష్టత వస్తుందన్నారు. కారు ఢీ కొడితే బుల్లెట్‌ కింద పడిపోయిందా? లేదా? అనే విషయాల మీద ట్రాన్స్‌పోర్టు అధికారులు పరిశీలస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ కేసును చాలా ప్రత్యేకంగా తీసుకుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా దీనిని పర్యవేక్షిస్తున్నట్లు ఏలూరు రేంజీ డీఐజీ అశోక్‌ కుమార్‌ తెలిపారు.

బుల్లెట్‌ మీద వస్తూ ఈ నెల 24 అర్థరాత్రి రాజమండ్రికి సమీపంలోని కొంతమూరు వద్ద అనుమానాస్పద స్థితిలో మరణించిన పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ డీ నరసింహకిశోర్‌ తెలిపారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మరణాన్ని అనుమానాస్పద కేసుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కాకినాడ ఎస్సీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. తన స్వీయ పర్యవేక్షణలో ఇద్దరు డీఎస్పీలు ఆధ్వర్యంలో 4 బృందాలు ఈ కేసు దర్యాప్తులో నిమగ్నమైనట్లు ఎస్పీ తెలిపారు. మార్చి 24న ఉదయం 11 గంటల సమయంలో పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు.
అదే రోజు సోమవారం మధ్యాహ్నం 1:29 గంటల సమయంలో చౌటుప్పల్‌ వద్ద టోల్‌ గేట్‌ దాటారని తెలిపారు. అక్కడ నుంచి విజయవాడ చేరుకున్న తర్వాత దాదాపు 3 గంటల పాటు ఆయన ఎక్కడ ఉన్నారనే విషయం తెలియాల్సి ఉందని, దీనిపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. అయితే రాజమండ్రి సమీపంలోని కొంతమూరు పెట్రోల్‌ బంక్‌ వద్దకు సోమవారం అర్థరాత్రి 11:40 గంటలకు పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల చేరుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత 11:42 గంటలకు ఘటన జరిగిందన్నారు. కేసుకు సంబందించిన పూర్తి వివరాలు రావలసి ఉందని చెప్పారు. అందులో భాగంగా హైదరాబాద్, విజయవాడలో ఉన్న సీసీ కెమేరాల ఫుటేజీల ద్వారా డేటా పరిశీలిస్తామన్నారు. దీంతో పాటుగా ప్రవీణ్‌ పగడాల ప్రయాణం చేసిన దారిలోని అన్ని టోల్‌ గేట్ల వద్ద సీసీ కెమేరాల ఫుటేజీలను తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల రాజమండ్రి ఎందుకు వచ్చారో అనే విషయాన్ని కూడా పరిశీలించామన్నారు.
లాలా చెరువు సమీపంలో ప్రవీణ్‌ పగడాల తన కుమార్తె పేరుతో కొంత స్థలం కొనుగోలు చేశారని, అక్కడ ఒక బిల్డింగ్‌ నిర్మించేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నట్లు తెలిసిందని, దీనికి కోసం ఒక భవనాన్ని ఇంటి కోసం అద్దెకు కూడా తీసుకున్నట్లు తెలిసిందన్నారు. అయితే పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల రాజమండ్రికి వస్తున్నట్లు అతని భార్యతో పాటు స్థానికంగా ఉంటున్న ఆకాష్, జాన్‌లకు మాత్రమే తెలుసని, ఈ విషయంలో మృతుని కుటుంబ సభ్యులందరినీ విచారించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని కోరారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఫోరెన్‌సిక్‌ ల్యాబ్, పెథాలజీకి కూడా పంపామని, ఆ నివేదికలను కూడా పరిశీలిస్తామని, వెల్లడించారు. పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల ఉపయోగించిన మొబైల్‌ డేటాను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు. పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మరణం మీద సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని డీఐజీ అశోక్‌కుమార్‌ హెచ్చరించారు. పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతిపై తహశీల్దార్‌ సమక్షంలో విచారణ చేశామని, సీఎం చంద్రబాబు, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాలు ఈ కేసుపై నిత్యం చర్చిస్తున్నట్లు తెలిపారు.
Next Story