సింహాద్రి అప్పన్నా.. సామాన్యుణ్ణి కరుణించావా స్వామీ
గతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత నిస్తూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం జరగనుంది.
(శివరామ్)
గతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత నిస్తూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం జరగనుంది. గంటల కొద్ది రాజకీయనేతలు, వీ ఐ పీ లను అంతరాలయం వరకూ అనుమతించి మూల విరాట్టుకు ఆమడు దూరంలో సామన్య భక్తల లైన్లను తిప్పేసే సంస్క్రుతికి ఆ సారి బ్రేక్ పడనుంది. ఎన్నికల కోడ్ పుణ్యమా అని మే నెల 10వ తేదీన జరిగే చందనోత్సవం లో అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు. కేవలం గంట సేపట్లో అనువంశిక ధర్మకర్తలు, పూజారులు, ప్రోటోకాల్ అధికారుల దర్శనాలను పూర్తి చేసి సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయిస్తూ జరపాలని అధికారులు నిర్ణయించారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని వివిధ విభాగాల అధికారులను జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున బుధవారం ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించే స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతించాలని, ఇతర కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. 10వ తేదీ ఉదయం 3.30 నుంచి 4.30 గంటల వరకు (గంటపాటు) మాత్రమే అనువంశిక ధర్మకర్త, తితిదే నుంచి పట్టువస్త్రాలు సమర్పించే వారికి, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు, దాతలకు అంతరాలయ దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ డా. ఎ. రవిశంకర్, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కె. చంద్రమోహన్, ఈవో శ్రీనివాస మూర్తి, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఏడీసీ కె.ఎస్. విశ్వనాథన్, డీఆర్వో కె. మోహన్ కుమార్ ఇతర అధికారులతో కలిసి చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
పొలిటికల్ ప్రోటోకాల్ వుండదు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి దర్శనాలు ఉంటాయని, శానసభ్యులు, ఎంపీలు, మంత్రులు వంటి పొలిటికల్ ప్రొటోకాల్ ఉండబోదని కలెక్టర్ స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉదయం 4.30 తర్వాత వచ్చిన వారికి అంతరాలయ దర్శనాలు ఉండబోవని తేల్చిచెప్పారు. టిక్కెట్ల విక్రయ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని నగర పరిధిలోని ఏడు నుంచి 10 బ్యాంకుల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మే నెల 6వ తేదీ లోపు టిక్కెట్ల విక్రయాల ప్రక్రియను పూర్తి చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. రూ.1500, రూ.1000, రూ.300 ధరల మేరకు టిక్కెట్ల జారీ ప్రక్రియను ప్రణాళికాయుతంగా చేపట్టాలన్నారు. టిక్కెట్టుపై హోలో గ్రామ్, వాటర్ మార్కు వచ్చేలా రూపొందించాలని సూచించారు. రూ.1500 టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే నీలాద్రి గుమ్మం వద్ద నుంచి దర్శనానికి అనుమతిస్తారని స్పష్టం చేశారు.
పరిమితంగానే కొండపైకి వాహనాలు
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కొండపైకి వాహనాల రాకపోకలను గణనీయంగా తగ్గించాలని, ఆ మేరకు ప్రణాళికాయుత చర్యలు చేపట్టాలని పోలీసు విభాగ అధికారులకు చెప్పారు. హనుమంతవాక వైపు నుంచి పాత గోశాల వరకు అక్కడ నుంచి అడవివరం వరకు రెండు పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని.. అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని హనుమంతువాక మార్గం వైపు తొమ్మిది, అడవివరం వైపు 12 స్థలాలను గుర్తించాలని సూచించారు. ఈ విషయంపై పోలీసు అధికారులు సంయుక్త పరిశీలన చేసి తుది చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు.
భక్తులకు బస్సులు
భక్తులకు అసౌకర్యం కలగకుండా కొండ దిగువ నుంచి పైకి తరలించేందుకు, దర్శనం అయిపోయిన తర్వాత కొండ దిగువన దించేందుకు అనువుగా తగినన్ని బస్సులను ఏర్పాటు చేయాలని, ఎక్కడికక్కడ క్యూలైన్లలో విరివిగా తాగునీటి కేంద్రాలను, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంబంధిత విభాగాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గతం కంటే రెట్టింపు సంఖ్యలో వైద్య శిబిరాలను పెట్టాలన్నారు. మరుగుదొడ్లు ఇతర వసతులు సమకూర్చాలని చెప్పారు. విభిన్న ప్రతిభావంతులకు ఆ రోజు సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటలకు దర్శనం కోసం స్లాట్ ఇవ్వాలని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాహనాల రద్దీని గణనీయంగా తగ్గించేందుకు పాసులను మంజూరు చేయాలని, ప్రయివేటు వాహనాలను కొండపైకి అనుమంతించరాదని స్పష్టం చేశారు. పరిశుభ్రతా చర్యలు పక్కాగా చేపట్టాలన్నారు. ఎక్కడిక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని అన్ని విభాగాల అధికారులు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించాలని పేర్కొన్నారు. పూర్తి పర్యవేక్షణ చేసి ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
Next Story