చంద్రబాబును సింగపూర్ రమ్మని ఎవరు పిలిచారు? అధికారికమా లేక అనధికారమా?
x

చంద్రబాబును సింగపూర్ రమ్మని ఎవరు పిలిచారు? అధికారికమా లేక అనధికారమా?

సింగపూర్ పారిశ్రామిక వేత్తలను వైఎస్ జగన్ పారిపోయేలా చేసేలా చేశారని చెప్పడానికే చంద్రబాబు వెళ్లారా? అనధికార పర్యటనకు అధికార ముద్ర ఏమిటీ? ఇదేంటో చదవండి


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ్టి నుంచి (జూలై 26) నుంచి 6 రోజుల పాటు 8 మంది బృందంతో తన పాత మిత్రదేశమైన సింగపూరులో పర్యటించేందుకు బయల్దేరి వెళ్లారు. అయితే ఇవాళ తనను ఆహ్వానించేందుకు పాత అధికారిక మిత్రులెవరూ విమానాశ్రయానికి రాలేదు. శాలువాలు కప్పలేదు. పూల బొకేలు ఇవ్వలేదు. తన పాత మిత్రుడు ఈశ్వరన్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. అధికారిక పర్యటన కాదు కాబట్టి మిగతా వాళ్లు మొహం చాటేశారు. అయితే తెలుగు డయాస్పోరా మాత్రం ఘనంగా స్వాగతం పలికింది. కేరింతలు కొట్టింది.

సింగపూర్ ప్రభుత్వ ఆహ్వానం లేకుండా చంద్రబాబు ఈ పర్యటన ఎందుకు చేస్తున్నట్టు అనే దానిపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
చూడడానికి ఇది ప్రభుత్వ స్థాయి విదేశీ పర్యటనలా కనిపించినా, వాస్తవానికి ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన.
సింగపూర్ ప్రభుత్వం నుంచి చంద్రబాబుకు అధికారిక ఆహ్వానం రాకపోయినా, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అధికారిక జీఓ (Rt No.120) ద్వారా దీనికి అధికారిక ముద్ర వేసింది. మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పరిచింది. ఇలా ‘ప్రైవేట్ టూర్’ను ‘ఎక్స్‌పోజర్ అండ్ నెట్‌వర్కింగ్ విజిట్’గా అధికారికంగా ప్రకటించడంతో రాజకీయ, దౌత్యపరమైన చర్చలకు ఇది దారితీస్తోంది.
అధికారికంగా ఏ ప్రభుత్వ అధికారీ వీరిని కలుసుకునే ప్రణాళిక లేదు. సింగపూర్‌లో నివసిస్తున్న ఎన్ఆర్ఐ తెలుగువారు, అక్కడి తెలుగు కంపెనీల ఆహ్వానం పేరిట ఈ పర్యటన సాగుతోంది. మొదటి రోజు పూర్తిగా సింగపూర్, మలేషియా, దక్షిణాసియా ప్రాంతాల తెలుగు డయాస్పోరాతో సమావేశాలకు కేటాయించారు. తెలుగు వారిని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా మార్చే ‘పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్ పార్ట్‌నర్‌షిప్ (P4)’ మోడల్‌ లో భాగస్వాములు కావాలని కోరతారు.
పలు గ్లోబల్ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు జరపాలని, ఏపీకి పెట్టుబడులను ఆకర్షించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానంగా, డేటా సెంటర్లు, AI, ఫిన్‌టెక్, పోర్ట్ బేస్డ్ ప్రాజెక్టులు వంటి రంగాలలో పెట్టుబడులకు అవకాశాలు చూపనున్నారు.
నవంబర్‌లో జరగబోయే విశాఖపట్నం ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ కోసం విదేశీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడమూ ఈ పర్యటనలో భాగంగా ఉంది.
మిగతా రోజుల్లో ఒక రోజు రోడ్ షో, మరోరోజు పారిశ్రామిక వేత్తలకు విందు, ఇంకో రోజు వ్యక్తిగత భేటీలు, మిగతా సమయం సింగపూరులో అభివృద్ధి చేసిన పార్కులు, భవన సముదాయాలు, ఆర్కిటెక్చర్ డిజైన్లు, టూరిస్ట్ స్పాట్లను పరిశీలిస్తారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ పర్యటన- మరో దావోస్ పర్యటన వంటిది. మన ఖర్చుతో మనం ఏర్పాటు చేసుకున్నది.

రాజధాని అమరావతిని సింగపూర్ తరహాలో నిర్మించాలన్న కలతో 2014-2019 మధ్య సింగపూర్ ప్రభుత్వంతో రెండు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాల ప్రకారం, సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్ సంస్థతో కలిసి 6.84 చ.కి.మీ. ప్రాంతాన్ని అభివృద్ధి చేసే స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ఏర్పాటు చేశారు. వందల ఎకరాల భూమిని ఇచ్చారు. ఆ భూమిని అభివృద్ధి చేసి ఎకరా రూ.50 కోట్లకు అమ్ముకోవచ్చని చెప్పారు.
కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ అప్పటి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయం సింగపూర్ దేశాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. ప్రభుత్వాలు మారినా గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు సజీవంగా ఉంటాయని భావించిన సింగపూర్ కంపెనీలకు వైసీపీ నేతల రాజధాని వ్యతిరేక ప్రకటనలు భయబ్రాంతులకు గురిచేసినట్టు ఆ దేశ పత్రికలు రాసిన కథనాలను బట్టి తెలుస్తోంది. కొన్ని కంపెనీల ప్రతినిధులు చెప్పకుండానే దేశం వదిలిపెట్టి పోయారు. ఫలితంగా, సింగపూర్ ప్రభుత్వం తమ వాటాను బుక్ విలువకే విక్రయించాల్సి వచ్చింది.
సింగపూర్ ఆఫ్ కృష్ణా’ మళ్ళీ సజీవమవుతుందా?
అమరావతి నగర ప్రాజెక్టును మొదట్లో చంద్రబాబు ఎంతో ఆకర్షణీయంగా ప్రచారం చేశారు. ఇది కృష్ణా నదీతీరంలో నిర్మించబోయే ‘సింగపూర్ 2.0’ అని ఆయన ప్రకటించారు. కానీ రాజకీయ అస్థిరత, నిధుల కొరత, పాలన మార్పుల కారణంగా ప్రాజెక్టు నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చాక, అమరావతిని మళ్లీ ప్రారంభించాలని చంద్రబాబు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా, తిరిగి సింగపూర్ ప్రభుత్వ విశ్వాసాన్ని గెలుచుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా ఉంది. అయితే సింగపూర్ మాత్రం ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. ఏ మాత్రం సానుకూలంగా ఉన్నా సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు ఎవరో ఒకరు చంద్రబాబును కలిసి ఉండే ప్లాన్ ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను "రాజకీయంగా అస్థిరమైన రాష్ట్రంగా" భావిస్తోంది. మున్ముందు పెట్టుబడులకు ఆసక్తి చూపడం లేదు. పైగా అవినీతి ఆరోపణలపై జైలు పాలైన మంత్రివర్గ సభ్యుడు ఈశ్వరన్ పేరు ఈ అమరావతి ప్రాజెక్టులో ప్రముఖంగా వినిపించడం, ఆయన చంద్రబాబుకు సన్నిహితుడు కావడం కూడా ప్రస్తుత సింగపూర్ ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడానికి మరో కారణంగా ఉంది.
ఏపీ బ్రాండ్ పునర్నిర్మాణ ప్రయత్నం...
అయితే చంద్రబాబు దృక్పథం భిన్నంగా ఉంది. తమ ప్రభుత్వ శైలిని, పారదర్శకతను, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సింగపూర్‌లో ప్రదర్శించేందుకు ఇది గొప్ప అవకాశంగా చంద్రబాబు చెబుతున్నారు. ఇలా గ్లోబల్ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఇది దావోస్ తరహా పర్యటనే కానీ…
ఇది చంద్రబాబు రెండవ అంతర్జాతీయ పర్యటన. మొదటి పర్యటనగా ఆయన జనవరిలో దావోస్ వెళ్లారు. అక్కడ కూడా పెట్టుబడుల్ని కోరడమే కాదు, 'బ్రాండ్ ఏపీ'ను వినిపించడమే ముఖ్య ఉద్దేశంగా ఉంది. సింగపూర్ పర్యటన కూడా అదే లాజిక్‌తో సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ మంజూరుతో కూడిన అధికారిక జీఓ ఇచ్చినా, నిజంగా ఇది రాజ్యాంగబద్ధ పర్యటనగా పరిగణించాలా? లేదా పార్టీ ఆధారిత ప్రచార కార్యక్రమమా అన్న దానిపై స్పష్టత లేకపోవడం గమనార్హం.
ఇది చంద్రబాబు సొంత ప్రతిభా నైపుణ్యాల ప్రదర్శన వేదికగా రూపొందించారు. ఆహ్వానం లేకుండా వెళ్లడం, అధికార భేటీలకు అవకాశం లేకపోవడం, గత అనుభవాల వల్ల ఏర్పడిన విశ్వాస లోపం – ఇవన్నీ ఈ పర్యటనపై లేవనెత్తుతున్న ప్రశ్నలు.
ఈ పర్యటనతో చంద్రబాబు ఏ మేరకు పెట్టుబడుల్ని ఆకర్షించగలరో, లేదా సింగపూర్ ప్రభుత్వ విశ్వాసాన్ని తిరిగి పొందగలరో అనేది కాలమే చెబుతుంది. కానీ గత అనుభవాలపై పూర్తి స్వీయపరిశీలన లేకుండా చేపట్టిన ఈ ప్రయత్నం మరోసారి రాజకీయ హేతుబద్ధతల పట్ల అసమర్థతగా మారకూడదు. వైఎస్ జగన్ ను విమర్శించేందుకు ఓ అస్త్రం కాకూడదు.
ఈ పర్యటనను ఎలా భావించినా, ఇది సత్వర ఫలితాలు ఇచ్చే ప్రయోగం కాదు. చంద్రబాబు తరహా అంతర్జాతీయ బ్రాండ్ పాలిటిక్స్‌కి ఇదొక దశగా పరిగణించవచ్చు. అభివృద్ధిని మాటల్లో కాకుండా గణాంకాల్లో చూపించగలిగినపుడు మాత్రమే అమరావతి 2.0కు మళ్లీ ప్రాణం పోయగలదు. ఆదిశగా ఈ పర్యటన ఓ చిన్న ప్రయత్నం కావాలి.
Read More
Next Story